పల్లవి:
తియ్యనీ తేనెల తేట
కమ్మనీ కోయిల పాట
అదే మన తెలుగు
అదే మన వెలుగు
సి.పి.బ్రౌను సేవలో తరించిన భాష
ఆంధ్రభోజుని మదిలో మురిసిన భాష
తియ్యనీ తేనెల తేట
కమ్మనీ కోయిల పాట
అను పల్లవి:
గున్న మామిడి తోట
పున్నమి వెన్నెల బాట
అదే జాను తెనుగు
అదే జాణ జిలుగు
ఆదికవి నన్నయ చుట్టే శ్రీకారం
కవిబ్రహ్మ తిక్కన చెక్కే ఆకారం
ప్రబంధ పరమేశ్వరుడు కట్టె ప్రాకారం
శివకవులు వెదజల్లె భక్తి భావ సుగంధం
చరణం:1
శ్రీ నాథుని కలంలో చాటువై మెరిసింది
పోతన హలంలో సాహిత్యమై విరిసింది
ప్రజాకవి వేమన మాట
వేదమై నిలిచింది
మహాకవి శ్రీ శ్రీ బాట స్వేదమే చిందింది
చలం రచనలో సంచలనమై ఎగసింది
దేవులపల్లిలో అందాల జాబిల్లై వెలిసింది
గురజాడలో తన అడుగుజాడ చూసింది
చరణం:2
విశ్వనాథలో కిన్నెరసాని కదిలింది
నండూరిలో అల ఎంకి తొంగి చూసింది
రాయప్రోలు కవనమే దేశ భక్తి చాటింది
దువ్వూరి కృషీవలుని వెన్నునే తట్టింది
భీమన్న పాలేరు జన జాగృతి చేసింది
జాషువా గబ్బిలమే సమత కాంక్షించినది
సి. నా.రె విశ్వంభర విశ్వశాంతి కోరింది
రావూరి పాకుడు రాళ్ళు
జ్ఞాన పీఠ మెక్కింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి