కవితా! ఓ కవితా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నా కలలో కనిపించరాదా
నన్ను కవ్వించి కవనం చేయించరాదా!

నా మనసును తట్టరాదా
నన్ను కవిత్వ రంగములోనికి దించరాదా!

నా కలము అంచున నిలువరాదా
నాతో కమ్మని కవితల వ్రాయించరాదా!

నా తలకు తలపులు ఇవ్వరాదా
నాతో గొప్ప విషయాలు చెప్పించరాదా!

నా కంటికి సోయగాలు చూపరాదా
నాతో చక్కని వర్ణనలు చేయించరాదా!

నా చేతికి అక్షరాల అందించరాదా
నాతో ముత్యాలసరాల కూర్పించరాదా!

నా మోముపై నవ్వుల కురిపించరాదా
నాతో పసందైన పాటల పాడించరాదా!

నా ముఖమును జాబిలిలా వెలిగించరాదా
నా రాతలను సాహిత్యలోకాన ప్రసరించరాదా!

నా పెదవుల సుధలను కురిపించరాదా
నాతో తియ్యని పలుకులను పలికించరాదా!

నా పలుకుల తేనేచుక్కల చల్లరాదా
నాద్వారా పలువురికి పనసతొనలచవిని చూపరాదా!


కామెంట్‌లు