సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -51
గజ స్నాన న్యాయము
   ******
గజము అంటే ఏనుగు. స్నానం అంటే స్నానం చేయడం.
ఏనుగు స్నానం చేయడం గురించే ఎందుకు అనుకుంటూ ఉన్నామంటే  ఏనుగు స్నానానికి ఓ ప్రత్యేకత ఉంది.
ఏనుగులు నదుల్లోనో, ఏరులోనో, పెద్ద పెద్ద చెరువులు, కాలువల్లోనో మునిగేంతగా ఉన్న నీళ్ళలోకి దిగి హాయిగా, ఆనందంగా స్నానం చేస్తాయి.
అంతే కాదు అవి స్నానము చేయడము మొదలు పెట్టాయంటే ఒక పట్టాన ఆపవు. స్నానం చేయడంలోనే చాలా సమయాన్ని గడుపుతాయి.
అంత శుభ్రంగా గంటల తరబడి స్నానం చేసిన ఏనుగులు బయటకు వచ్చీ రాగానే ఏం చేస్తాయో గమనిస్తే భలే నవ్వు వస్తుంది.అంతే కాదు కోపం, చిరాకు కూడా కలుగుతాయి.
నీళ్ళ లోంచి ఒడ్డుకు రాగానే చుట్టూ పక్కల ఉన్న చెత్త చెదారాన్ని, దుమ్ము ధూళిని  ఒంటి నిండా గుమ్మరించుకొంటాయి.
ఇక అవి స్నానం చేసి మాత్రం ఏం లాభం. ఫలితం లేకుండా పోయింది కదా!.
అందుకే ఇలా ఎవరైనా చివరి దాకా మనసు పెట్టి, శ్రద్ధతో చేసిన పనులను ఆఖర్లో చేజేతులా చెడగొట్టుకోవడాన్ని ఈ గజ స్నాన న్యాయంతో పోల్చుతారు.
"కొండంత  రాగం తీసి పిచ్చి పాట పాడినట్లు" అనే సామెత కూడా దాదాపు ఇదే కోవకు వస్తుంది. పల్లెటూర్లలో పెద్దలు తరచూ ఈ సామెతను ఉపయోగించడం చూస్తుంటాం.
పాట మొదలు పెట్టేటప్పుడు తీసే రాగం వింటుంటే " ఆహా! ఎంత అద్భుతమైన పాట వింటున్నామో అని తన్మయత్వం పొందినంత సమయం పట్టదు. రాగమే తప్ప పాటలో పస లేదని.
 అంత శ్రద్ధ పెట్టి రాగం నేర్చుకున్న వ్యక్తి పాడే పాట మీద  దృష్టి పెట్టకపోవడాన్ని ఉదహరిస్తూ ఈ గజ స్నాన న్యాయంతోనూ, "కొండంత రాగం తీసి.." అనే సామెతతోనూ పోల్చడం పరిపాటి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు