రాజుకు చిన్నప్పటి నుండి చీకటి అంటే భయం. తను నాల్గవ తరగతి చదివే రోజుల్లో ఒకరోజు ట్యూషన్ నుండి ఆలస్యంగా వస్తుండగా ఆ ఊరిలో మొత్తం కరెంటు పోయింది. అప్పుడు చీకట్లో వస్తుంటే తన స్నేహితుడు గోపి దెయ్యం కథలు చెప్పి రాజును విపరీతంగా భయపెట్టేసాడు. చీకటి పడితే చాలు దయ్యాలు తిరుగుతాయని , చిన్నపిల్లలు కనిపిస్తే వారి రక్తం జలగల్లా పీల్చి పారేస్తాయని ఇలా ఏవోవో దెయ్యం కథలు రాజు మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ భయం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది.
ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో కరెంట్ పోయి అంతా చీకటిగా మారింది. దానితో రాజు చాలా భయపడి పోయాడు.దయ్యాలు వస్తాయన్న భయంతో పెద్దగా ఏడవడం మొదలు పెట్టాడు. ఇంటి నుండి బయటకు వెళ్తే కాస్త అయినా చందమామ వెన్నెల వెలుతురూ ఉంటుందని అనుకున్నాడు.
దానికోసం రాజు భయంతో అరుస్తూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. అది చూసిన పక్కింట్లో వున్న సీతమ్మ రాజు దగ్గరకు వచ్చి ఏమైంది రాజు ? ఎందుకలా అరుస్తున్నావు? అని అడిగింది. దానితో రాజు నాకు చీకటి అంటే చాలా భయం.చీకటిలో నడిస్తే దెయ్యాలు తీస్కెళ్ళి పోతాయి అని చెప్పాడు. అది విన్న సీతమ్మ చిరునవ్వు నవ్వి భయపడకు రాజు, ఒంటరిగా మరియు చీకటిలో భయంతో ఉన్నపుడు “శ్రీ రామ” అని తలుచుకో ఆయనే నిన్ను రక్షిస్తాడు . అప్పుడు ఏ దయ్యం కూడా నిన్ను తాకలేదు. అని చెప్పింది. అది విన్న రాజు నిజామా? ఆంటీ , అలా అయితే నేను ఇక నుండి అలాగే చేస్తా అని అప్పటి నుండి ప్రతి క్షణం ఆ శ్రీ రాముని తలుచుకోవడం ప్రారంభించాడు. ఆ నామస్మరణతో రాజుకు భయం పోయి ఎంతో ధైర్యం కలిగింది.. శ్రీ రాముడిని తలుచుకోగానే ఆయన స్వయంగా వచ్చి తన పక్క నిలుచొని తనను రక్షిస్తునట్లు అనిపించసాగింది. ఆ అభ్యాసం తరచుగా చేస్తుండడం వలన చీకటి అంటే భయంపోయి చెప్పలేనంత ధైర్యం వచ్చింది. ఇక మళ్లీ ఎప్పుడు కూడా చీకటికి భయపడలేదు. అందుకే భయానికి విరుగుడు విశ్వాసం అని పెద్దలు చెబుతారు.
భయం; -: సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి