"రాజుని చూసిన కంటితో......";-ఎం బిందుమాధవి
 రాజు అంటే రాజు గారు. ఆయన సర్వాభరణ భూషితుడై..చీని చీనాంబరాలు ధరించి ఉంటే అందం..హోదా ఉట్టి పడుతూ ఉంటుంది. అలాంటి ప్రత్యేక అలంకరణలో ఉన్న వ్యక్తిని చూసి వచ్చాక ఒక పేదరాలు తన భర్త రూపు రేఖలు..వేష భాషలు..అలంకరణలు నచ్చక ఈ మాట వాడటం అనేది ఈ సామెతకి అర్ధం!
 @@@@
 "బావగారొచ్చారు" రేడియో నాటకం వింటున్నది కళ్యాణి. "అసలా నటులు...అంటే గాత్ర ధారులు ఎంత బాగా భావ ప్రకటన చేస్తున్నారో. ఎదురుకుండా చూస్తున్న అనుభూతి కలుగుతున్నది. నవ రసాలని, భావోద్వేగాలని రంగరించి ఉగ్గుతో తాగించినట్టుంది ఆ సంభాషణ విధానం! నిజంగా ఆ రోజులు శ్రవ్యనాటకాలకి స్వర్ణ యుగమేనేమో" అన్నది కళ్యాణి.
 పంటి కింద రాయి పడ్డట్టు కాలింగ్ బెల్ మోగింది. "ఎవరో చూడండి" అన్నది నాటకాన్ని ఆస్వాదిస్తున్న కళ్యాణి.
 "కాలి ('కాళి' కి వచ్చిన తిప్పలన్నమాట) నువ్వెల్లి చూడు" అన్నది వాణి.
 “నేను బిజీ గా  ఉన్నాను. వానీ..('వాణి' కొచ్చిన బాధ అది) నువ్వే వెల్లి చూడు" అని చదివే పుస్తకంలో తల దూర్చాడు కాళి.
 "అబ్బాబ్బా భాషని ఖూనీ చేసి పారేస్తున్నారర్రా! 'కాలి'..'కాళి' కి అర్ధంలో తేడా ఉన్నది. కాలి ఏమిటే, వాడి పేరు కాళి. 'కాలి' అంటే ఇంగ్లీషులో బర్న్ అని అర్ధం! ఈ కాలపు పిల్లలకి భాష సరిగ్గా ఉండాలన్న లక్ష్యమే లేదు" అంటూ తనే వెళ్ళి తలుపు తీసింది.
 "మా దొడ్లో కాశాయి అని అమ్మ ఈ పల్లు ఇచ్చి రమ్మంది ఆంటీ" అంటూ ప్రవీణ్ నాలుగు జామపళ్ళు టేబుల్ మీద పెట్టాడు.
 "నువ్వూ మా పిల్లలలకి నకలే అన్న మాట! పల్లు కాదురా బాబూ..పళ్ళు లేదా పండ్లు" అన్నది.
 "మీకు యూ ట్యూబ్ చూసే అలవాటు బాగానే ఉన్నదిగా! పాత ఆకాశవాణి నాటకాలు దొరుకుతాయి. విను సరదాగా. భాషలో ఉండే అందం, మాధుర్యం తెలుస్తుంది. పదాలు ఎట్లా పలకాలో తెలుస్తుంది" అన్నది.
 "నాటకం పేరు చెప్పండి ఆంటీ, వింటాను" అన్నాడు ప్రవీణ్.
 "గణపతి", "పూటకూళ్ళమ్మ", "బావగారొచ్చారు"... బాగుంటాయి. విను.....విన్నాక నేను అన్నది అవునో కాదో చెప్పు" అన్నది.
                                                  **********
 వాకింగ్ చేస్తున్న ప్రవీణ్ గట్టిగా నవ్వాడు. పక్కన నడుస్తున్న కిరణ్ "ఏంట్రా అంత నవ్వు తెప్పించే విషయం?" అన్నాడు. "ఈ మధ్య ఆకాశవాని వారు శ్రవ్య నాటకాలు యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశారుట. కల్యాని ఆంటీ చెప్పి వినమన్నారు. అదే వింటున్నాను. గనపతి నాటకంలో  'శ్రీ రఘురామ చారు....తులసీ దల దామ' అని పద్యానికి గనపతి అర్ధం చెబుతుంటే" అని పొట్ట పట్టుకుని నవ్వుతూనే అన్నాడు.
 "ఇంకా ఆనాటకంలో గనపతి తల్లి తన మామగారి వృత్తి (శవ వాహకుడు) గురించి గొప్పగా చెబుతుంటే స్కూల్లో పిల్లలంతా నవ్వుతారు" అన్నాడు ప్రవీణ్.
 "అవునురా మా అమ్మ వాళ్ళ  చిన్నప్పుడు ఆదివారం వస్తే చాలుట. మధ్యాహ్నం మూడింటికి ఇల్లంతా 'పిన్ డ్రాప్' సైలెన్స్ ట. నండూరి సుబ్బారావు, వి బి కనక దుర్గ, సీతారత్నం, పుచ్చా పూర్ణానందం, శారదా శ్రీనివాసన్...ఇలా ఎవరికి వారే ఎంత బాగా సంభాషణలు చెప్పేవారో అని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది" అన్నాడు కిరణ్.
 "సాధారణంగా మనిషి కనపడకుండా...మాట వినపడితే, గాత్రధారుల్లో తేడా తెలియదు కాబట్టి కధా విషయం అర్ధం కాదు అనుకునేవాడిని. కానీ వారి వాచకంలో..వ్యంగ్యం, హాస్యం, భయం, ఉద్వేగం, ప్రేమ,  స్పష్టంగా తెలుస్తున్నాయి. అలా కాకపోతే అప్పట్లో అంత మంది శ్రోతలు అంతగా ఆనందించరు కదా" అన్నాడు ప్రవీణ్.
 అలా కబుర్లు చెబుతూనే ఇంటికి చేరారు మిత్రులిద్దరూ.
                                              *******
 "నాన్నా బయటకి వాక్ కి వెళ్ళటం మీ వయసు వారికి ఇక మంచిది కాదు" అన్న కొడుకు కిరణ్ హెచ్చరికతో ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నాడు ఎనభయ్యేళ్ళ వెంకట్రావు. ఇంట్లో ఎవ్వరూ లేరు కదా అని స్మార్ట్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసుకుని ఆడియో కధలు వింటూ వాక్ చేస్తున్నాడు.
 బెల్ మోగింది. ఫోన్ వింటూనే తలుపు తీశాడు. ఎదురుగా పక్కింటి అప్పారావు.
 "రేకా (అది రేఖ అన్నమాట) పెల్లి (పెళ్ళి)  చేసుకుని గుహిని (గృహిణి)  వయ్యావా" అని నాయక పాత్రధారి అడగటం,
 "శేకర్ (శేఖర్) నన్నెందుకిలా వేదిస్తావ్, పో వెల్లి పో మా వాల్లెవరయినా చూస్తే బాగోదు. ఊ:( త్వరగా వెల్లిపో" అని నాయిక.....,
 "రేకా నేను ఈ ఊరు వదిలి వెల్లిపోతున్నాను. చివరి సారి నిన్ను కల్లారా చూసి వెల్లిపోదామని వచ్చా" అని  వెంకట్రావు ఫోన్లో నించి గట్టిగా వినబడుతున్న నాయకుడు సంభాషణలు విని "శివ శివా మన తెలుక్కి ఏం గతి పట్టిందండీ" అన్నాడు అప్పారావ్.
 "అబ్బో ఇదేం విన్నారండి, ఈ మధ్య ప్రతి వారు ఆడియో కధలని యూట్యూబ్ లో తెగ చదివేస్తున్నారు. నిన్న ఒక కధలో  'హరె హమ్మా (తల్లిని చూసిన ఆనందం కానీ ఆశ్చర్యం కానీ ఒక్క రవ్వ కూడా గళంలో పండించకుండా..హరె హమ్మా అనేస్తే రావల్సిన భావం వచ్చేస్తుందన్న ఉద్దేశ్యంతో) ..నువ్వా!  నా కల్లని నేనే నమ్మలేకపోతున్నాను. ఏంటి 'కల్లు' అలా ఎర్రగా ఉన్నాయి? ఎండలో వచ్చినందుకా? నీల్లు కారుతున్నాయ్..అంటూ ఎదురెల్లి తల్లిని కావలించుకుని లోపలికి తీసుకొచ్చి... అమ్మా బాత్ రూం లోకెల్లి కాల్లు కడుక్కురా. నేను స్కూలుకెల్లి పిల్లలని తీసుకొస్తాను. కాసేపు అలా పడుకో ' అంటూ ఒకావిడ రెచ్చిపోయి కధ చదివేస్తూ ప్రజలని వధ చేస్తున్నది" అన్నాడు వెంకట్రావు టీవీ ఆన్ చేస్తూ!
 "గుడ్ ఆఫ్టర్ నూన్. వెల్కం వ్యూయర్స్. ఇప్పుడు ఒక హీరో మీద సాంగ్ ప్లే చేస్తాను. విడియో ఉండదు. చాయ్ తాగుతూ వినండి. ఆ హీరో ఎవరో మీరు గెస్ చెయ్యాలి. ఓకేనా" అన్నది. "పాట వింటూ ఆ పాట ఏ క్లైమేట్ గురించో చెప్పాలి" అన్నది టీవీలో యాంకరమ్మ.
 "వీళ్ళ యాంకరింగ్ తగలడ. ఒక్కళ్ళు కూడా తెలుగులో పూర్తిగా మాట్లాడరు కదా. వీళ్ళకొచ్చిన భాషలన్నీ మిక్సీ లో వేసి రుబ్బి, దిక్కుమాలిన యాసతో ఏదో మాట్లాడతారు. ఒక్క ముక్క అర్ధం అయి చావదు" అన్నాడు అప్పారావు.
 "బయటికెళ్ళే పరిస్థితి లేదు, టీవీయే గతి అని పెడితే ఇదీ హింస" అన్నాడు వెంకట్రావు.
 "ఈ మధ్య పాతకాలం ఆకాశవాణి నాటకాలన్నీ యూ ట్యూబ్ లో పెట్టారు" అన్నాడు అప్పారావు.
 "అవును" అంటూ పూటకూళ్ళమ్మ నాటకం పెట్టాడు హెచ్ డి టీవీలో వచ్చే యూ ట్యూబ్ లో.
 నండూరి సుబ్బారావు, బందా కనకలింగేశ్వర్రావు సంభాషణ రంజుగా సాగుతున్నది. 'అలా ఆ ప్రక్కగా ఉన్న మేడకి పక్కన సన్న సందు. ఆ  వీధిలో దబ్బుల వారి ఇల్లు ఉంటుంది. ఆ సందు సన్నగా ఒక్క మనిషి మాత్రమే నడవగలిగేటంత ఉంటుంది. అక్కడికెళ్ళి అభిషేకం...అంటే దేవతార్చన చేసుకోవచ్చు' అని వీరయ్య పాత్ర అంటే, సుబ్బారాయుడి పాత్ర...ఇదిగిదిగో మేడ, ఆ పక్కనే సన్న సందున్నదండోయ్' అని ఆ గాత్రధారులు కళ్ళకి కట్టినట్టు మనకి ఊహా చిత్రం చూపిస్తుంటే.."మీరేమయినా చెప్పండి! ప్రపంచం వేగంగా వృద్ధి చెందుతున్న మాట నిజమే కానండి, అది సాంకేతిక వృద్ధి అయి ఉండచ్చు. మనిషి తన గాత్రంలో చెయ్యగలిగిన చెణుకులు మాత్రం ప్రత్యేకమే ' అన్నాడు అప్పారావు.
 “మీరెన్నైనా చెప్పండి అప్పారావు గారూ..ఆ రోజుల్లో అలాంటి ఆకాశవాణి శ్రవ్య కార్యక్రమాల విందు అనుభవించి ఇప్పుడు యూట్యూబుల్లో పుంఖానుపుంఖాలుగా వస్తున్న ఈ ఆడియో కధలు వినటం..కిచిడీ భాషలో మహా ప్రాణాలు, ఒత్తులు లేకుండా మాట్లాడే యాంకరమ్మల హొయలు, వయ్యారాలు చూడవలసి రావటం "రాజుని చూసిన కంటితో మొగుడ్ని చూస్తే మొట్ట బుద్ధవుతుంది" అన్నట్టుంది” అన్నాడు వెంకట్రావు.
 "అవునండోయ్..మీరు మహా ప్రాణాలు అంటే ఈ మధ్య విన్న ఒక సంఘటన గుర్తొచ్చింది. మా వాడి ఫ్రెండొకడికి యాక్సిడెంట్ అయి బ్రెయిన్ లో ఒకటి రెండు చోట్ల రక్తం గడ్డ కట్టి ఓ పక్క శరీర భాగం చచ్చుపడిందిట. మాట కూడా నంగి నంగి గా వస్తోందిట."
 "హాస్పిటల్లో 'స్పీచ్ థెరపిస్టులు' ఆ అబ్బాయి చేత మన తెలుగు అక్షరాల్లో మహా ప్రాణాలు 'ఠ', 'ఢ', 'ఖ','ఛ' 'థ''ణ' బాగా పలికించండి. ఆ గడ్డలు కరిగి మాటలు మెరుగవుతాయి అని చెప్పారుట" అన్నాడు అప్పారావు.
 "ఇదంతా మన ఘోషే కానీ చదువులు చెప్పే వాళ్ళూ అట్లాగే ఉన్నారు..నేర్చుకునే వాళ్ళూ అట్లాగే ఉన్నారు. ఇప్పటికి భాషని సరిగా ఉచ్ఛరించే వాళ్ళు ఇంకా కొంతమంది అయినా ఉన్నారు. పోను పోను తప్పొప్పులు చెప్పే వాళ్ళే ఉండరు" అన్నాడు వెంకట్రావు నిట్టూరుస్తూ!

కామెంట్‌లు