దానగుణం; - సి.హెచ్.ప్రతాప్
 యుగధర్మాలను అనుసరించి పుణ్యం పొందే మార్గాలు మారుతూ ఉంటాయి. కృత యుగంలో తపస్సు,త్రేతాయుగంలో యజ్ఞ, యాగాదులు,ద్వాపర యుగంలో ‘ధర్మం’ పాటించడం ద్వారా పుణ్యాన్ని పొందేవారు. యుగ ధర్మానికి విరుద్ధంగా కౌరవులు ధర్మాన్ని వదిలి పాపం మూటగట్టుకున్నారు అదే మరొకపక్క  ఎన్ని కష్టాలు వచ్చినా పాండవులు ‘ధర్మాన్ని’ విడిచిపెట్టలేదు. ఫలితంగా శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందారు. కురుక్షేత్ర యుద్ధం లో విజయం సాదించి సకల భోగభాగ్యాలు పొందారు. అయితే ఈ కలియుగంలో దానధర్మాలు ద్వారా మాత్రమే పుణ్యం సంపాదించుకునే విధానం అన్నది యుగ ధర్మం. మానసిక విచలత్వం ఎక్కువగా వున్న ఈ రోజుల్లో  తపస్సు ఆచరించడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. యజ్ఞాలు నిర్వహించడమూ కష్టసాధ్యమే! ధర్మమార్గంలో పయనిస్తూ దానం చేయడం ద్వారా పుణ్యాన్ని పొందవచ్చు. పుణ్యం కోసం దానాలు చేయడం స్వార్థం అవుతుంది కాబట్టి నిస్వార్థంగా దానం చేయడం ఉత్తమ లక్షణం. నిజాయతీగా సంపాదించిన దాంట్లో అవసరార్థులను ఆదుకోవాలి.  ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టదం, దాహంతో అలమటిస్తున్న వారికి గుక్కెడు మంచినీళ్లు పోయడం అనంతమైన పుణ్యాన్ని ఆర్జించి పెడుతుంది.ప్రచారం లేకుండా చేసే గుప్తదానం ఎంతో గొప్పదని పురాణాలు చెబుతున్నాయి. చతుర్విద భక్తిమార్గాలతోపాటు.. దాతృత్వం కూడా మోక్షానికి సోపానమని మహానీయుల దానధర్మాలు చెబుతున్నాయి. కాబట్టి.. ఉన్నంతలో దానధర్మాలు, పరోపకారం చేయడం ఉత్తమగతులను ప్రాప్తింపజేస్తుంది.
ఏదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వ డం. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయం కానీ,వస్తు సహాయ మును కానీ..’ధర్మం’ అంటారు. ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.

సి హెచ్ ప్రతాప్ 
 
MOBILE no : 95508 51075

కామెంట్‌లు