పరమశివునికి ఉద్యోగుల నివేదన -డా.అడిగొప్పుల సదయ్య
తల్లివై తీర్చేవన్నీ, తండ్రివై కూర్చేవన్నీ
అయినా, 
కష్టాలు మాకేలరా?-తెలంగాణా లింగా!
నష్టాలు మాకేలరా!

ఒక కంట చంద్రుడు కలడు,ఒక కంట సూర్యుడు కలడు
అయినా,
అగ్గి కంటినెందుకు తెరిచావు?- తెలంగాణాలింగా!
బుగ్గి పాలు నెందుకు చేశావు?

తలపైన గంగమ్ముంది,తనువందు గౌరమ్ముంది
అయినా,
మాకేడ చోటిస్తావింకా- తెలంగాణాలింగా!
నీవాళ్ళే వ్యాపించారంతా!

బదిలీలు,ఉన్నతులంటూ
పల్లీలు,బెల్లాలంటూ
అయినా,
ఎంతకాలం ఆశలు పెడతావు?- తెలంగాణాలింగా!
ఆశలను అడియాశలు చేస్తావు?

గాలముకు నోటులు గుచ్చి,
కాలముకు మాటులు వేసి
అయినా,
ఎంతకాలము నాటకమేస్తావు?-తెలంగాణాలింగా!
సత్యాలను గుప్పిట దాస్తావు?

తలపైన గంగమ్ముంది
మెడ చుట్టూ నాగులు కలడు
అయినా,
అభిషేకాలెందుకు నీకయ్యా?-తెలంగాణాలింగా!
జలుబెక్కి జ్వరాలు పడుతావు.

కాటిలోన వాసము చేస్తూ,
కూటికేమో తిరిపెము చేస్తూ,
అయినా,
మా కోసము పాలన చేస్తావు -తెలంగాణాలింగా!
ఎద్దునెక్కి ధర విహరిస్తావు.

జీతాలు,డీఏలంటూ
ఐటీలో తగ్గింపంటూ
అయినా,
మాపైనా అక్కసు ఎందుకురా?- తెలంగాణాలింగా!
జనమందు చులకన చేస్తావు?

నీ సుతుని "గణ"పతి జేసి,
నందీశుతో సేవలు కొంటూ
అయినా,
సోమేశును తలపై దాల్చితివే!- తెలంగాణాలింగా!
కాళేశ్వరమున కాలే మోపితివే!

నదులన్నీ నాట్యము చేసే,
కుంటలన్ని కుండలు నిండే
అయినా,
నీవంపిన నీళ్ళే కదరా! - తెలంగాణా లింగా!
ఎత్తిపోతల గంగే కదరా!

రైతులకు "బంధువు" నీవే- రాజులకు "బిందువు" నీవే
అయినా,
జీతాలు రావెందుకు? తెలంగాణాలింగా!
బాతాలు మాకెందుకు?

బడులన్ని దాతల నిధులతో,
గుడులన్ని భక్తుల నిధులతో
అయినా,
"ప్రగతంతా" నీ పేరే కదరా!- తెలంగాణా లింగా!
గతిలేని బతుకే మాదటరా!

ఓట్ల నాడు పారిస్తారు,
కోట్ల వాగు జనాలపైన
అయినా,
తూట్లేమో మాకే ఎందుకురా?- తెలంగాణాలింగా!
పాట్లెందుకు మేమే పడాలిరా?

రక్కసులకు వరాలు ఇచ్చి
బొక్కసమును ఖాళీ చేస్తావ్ 
అయినా,
ఇంత బోళాతనము నీకేలా? - తెలంగాణా లింగా!
బస్మాసురులుంటరు జాగర్త.

కార్మికులంతా క్లబ్బుల్లోను,
పడుచోళ్ళంతా పబ్బుల్లోను
అయినా,
శివశక్తులై ఊగురా! - తెలంగాణా లింగా!
నీ భక్తులై రేగురా!

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట, కరీంనగర్
9963991125
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷


కామెంట్‌లు