సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -50
ఖాదక ఘాతుక న్యాయము
*****
ఖాదక అంటే తినేది.ఘాతుక అంటే చంపువాడు. ఖాదక ఘాతుక అంటే తినే వారే చంపేవారు అని అర్థం.
తినే వారే చంపేవారు కూడా ఎలా అయ్యారు అనేది పెద్ద ప్రశ్న కదా!... కోడి లేదా గొర్రె,మేక మొదలైన మాంసం తినేవాళ్ళు ఉండటం వల్లే  వాటిని చంపి మాంసాహారాన్ని అందించే వాళ్ళు ఎక్కువయ్యారనే అర్థంలోనూ,,ప్రోత్సహింపబడుతున్నారు అనే సందర్భంలోనూ ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ప్రస్తుతానికి ఈ న్యాయము నేటి సినిమాలు,మరికొన్ని విషయాలకు బాగా వర్తిస్తుంది.
ఒకనాటి సినిమాలు సందేశాత్మకంగా ,సమాజ హితాన్ని కోరే విధంగా,ఇంటిల్లిపాదీ కలిసి సంతోషంగా చూసే విధంగా ఉండేవి.
రాన్రానూ సినిమాల ట్రెండ్ మారిపోయింది.
హీరోయిజం అంటూ  ఒక్క హీరోతో వందల మందిని పటాపటామని చంపించడం,చితక బాదించడం లాంటి హింసాత్మక దృశ్యాలు చూస్తున్నాం.
హింస, విద్వేషాలు,పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు.. ఇలాంటి వాటికి సంబంధించిన సినిమాలే నేడు ఎక్కువగా వస్తున్నాయి.
అలాగే ప్రేమ పేరుతో తీసే సినిమాలైతే పాఠశాల స్థాయి పిల్లలను సైతం చెడగొట్టే విధంగా ఉంటున్నాయని చాలా మంది పెద్దవాళ్ళు వాపోవడంలో వాస్తవం లేకపోలేదు .
ఇక వస్త్రధారణ,ఐటం సాంగ్స్ గురించి చెప్పనక్కర్లేదు. రెచ్చగొట్టేలా, జుగుప్స కలిగించే విధంగా చూపడం, పాటల్లో ద్వంద్వార్థాలు.వినాలంటేనే మనసుకు కష్టంగా ఉంటోంది. ఇలాంటి విపరీతమైన ధోరణులు ఎన్నో  నేటి సినిమాల్లో కనిపిస్తూ ఉన్నాయి.
కేవలం సినిమా తీసేవాళ్ళనే తప్పు పట్టడానికి లేదు.వాటిని ఆదరిస్తూ చూసేవాళ్ళు ఎక్కువై పోయారు. అంటే చూసేవాళ్ళను బట్టి రెచ్చిపోయి సినిమాలు తీసేవాళ్ళు బాగా ఎక్కువయ్యారు.
ఒక్క సినిమాలేం ఖర్మ బుల్లి తెరలో వచ్చే వివిధ రకాల వ్యాపార ప్రకటనలు, సీరియళ్ళు కూడా చాలా వరకు ఈ కోవకు చెందినవే.
ఆడవాళ్ళు అంటేనే సున్నితమైన మనసు కలవారు, విలువలను విడువకుండా కాపాడేవారు.అలాంటిది నేటి బుల్లితెర సీరియళ్ళలో మాత్రం  ఆడవాళ్ళనే విలన్లుగా చూపిస్తున్నారు. రాక్షసత్వం,కౄరత్వం, సంస్కార హీనత్వం గల మహిళా పాత్రలు నేటి  సీరియళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం.
 ఈ విధంగా మానవీయ సంబంధాలు,విలువలు లోపించినవి చూడటం వల్లే నేటి తరం ఆ పంథాలో నడుస్తూ సమాజానికే సవాలుగా మారిన పరిస్థితులు  నేడు చూస్తూ ఉన్నాం.
ఇలాంటి వాటికి ఉదాహరణగా ఈ ఖాదక ఘాతుక న్యాయము సరిగ్గా సరిపోతుంది.
సమాజంలో బాధ్యతా యతమైన పౌరులుగా మనం ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. అలాంటి పరిస్థితులు ఎదరవ్వకుండా,  జరగకుండా చూసే బాధ్యత కూడా  మనందరి మీద ఉందనేది  సదా గుర్తు పెట్టుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు