బాలల భరోసా కథలు ;- సయ్యద్ షఫీ, బాల సాహితీ వేత్త, ఖమ్మం.cell 9949273063


 ఉపాధ్యాయులు ఉన్నతంగా కలలు కంటే విద్యార్థులు వాటిని సాధించి చూపుతారు. ఆ కలలు ఉన్నతంగా ఉంటున్నాయి. మార్గదర్శనం చేస్తున్నాయి .ఫలితాలు పెద్దలనే ఆశ్చర్యపరుస్తున్నాయి. వహవా... అనిపిస్తున్నాయి. తెలుగు భాష భవిష్యత్తు గురించి బాధపడే ఎందరికో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇవన్నీ ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. నిరంతర సాధన .దానికి నిదర్శనమే ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని చిరునోముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నారులు రాసిన "చిరునోముల చిన్నారుల కథలు" పుస్తకావిష్కరణ.        ఆ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పొత్తూరి సీతారామారావు విద్యార్థులకు పాఠాలతో పాటు సాహిత్యం గురించి సందర్భానుసారంగా చెబుతూ విద్యార్థుల్లో రచనాశక్తిని కలిగించారు. ఫలితంగా 18 మంది బాల రచయితలు రాసిన 27 కథలతో "చిరునోముల చిన్నారుల కథలు" రూపుదిద్దుకొని ఫిబ్రవరి 14వ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారి E. సోమశేఖర శర్మ గారి చేతులమీదుగా ,అతిథులు, విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించబడింది.                    ముఖచిత్రం కథకు తగ్గట్టుగా బాల రచయితల ఆలోచనలకు తగ్గట్టుగా ఉంది .విరామ సమయంలో బాలికలందరూ ఒకచోట చేరి నేటి సమాజ పోకడ గురించి చర్చించుకుంటుంటే ఆనందించి సూర్య భగవానుడు పిల్లల ఆలోచనలకు ఆనంద భరితులై నిండుగా ప్రకాశిస్తుంటే, ప్రకృతి ఆకు పచ్చని తివాచీ పరిచి న్నట్లు ఉంది. వెనక అట్టాపై సంపాదకుల చిత్రం , పరిచయంమరియు మరికొందరు బాలసాహితీవేత్తలు అభినందనలు ఉన్నాయి.     ఇక కథల విషయానికొస్తే పిల్లలు పిల్లల కోసం రాసినా, పెద్దలు కూడా తప్పక చదివి, ఆచరిస్తూ పిల్లలకు మార్గదర్శకులుగా మారాలి అని చెప్పే కథలు ఉన్నాయి.ఇందులో నేను ...నేను ...అని విర్రవీగే మనిషి కి,ఒక్క అవాంతరం ఏర్పడితే చాలు బెంబేలెత్తిపోయి సహాయం కోసం బిత్తర చూపులు చూస్తాడు .కానీ అవన్నీ పట్టించుకోని సమాజం చేయూతనిస్తుంది. భరోసానిస్తుంది. ఓ పిచ్చి మనిషి ...జీవితం అంటే ఒంటరిగా బతకటం కాదురా.. సంఘజీవిగా, సంతోషంగా బతకటం ,అందరివాడుగా బతకడం అని "కోతి బుద్ధి "కథ ద్వారా హెచ్చరిస్తుంది యం. దీపిక.       రెండు చెట్ల మధ్య జరిగిన కథ నేటి పిల్లలు తల్లిదండ్రుల త్యాగాలను, వారి ప్రేమను గుర్తించడం లేదు. వారికి జ్ఞానంతోయం కలిగిస్తుంది వెక్కిరింపు కథ. కాయలు కాసిన మామిడి చెట్టు పక్కనే ఉన్న వేప చెట్టును నీ కాయలు ఎవరూ తినరు అని హేళన చేస్తుంది .రైతు వేపకాయలు ఎరువును తెచ్చి మామిడి చెట్టుకు వేస్తూ దీనివల్లే ఈ సంవత్సరం మామిడికాయలు బాగా కాసాయి అని పక్కనున్న రైతుకు చెబుతాడు .అంటే పిల్లలు మీరు సాధించే విజయాలు మీ తల్లిదండ్రులు, గురువులు మీకు ఇచ్చిన విద్యా ద్వారా, వినయ ద్వారా అని మర్చిపోకూడదని గద్దించి చెప్పినట్లుంది ఆర్. సంతోష్ రాసిన "వెక్కిరింపు" కథ.      దాన గుణం, సేవా భావం ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలి .అవే తిరిగి నీకు ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఆడుకుంటాయి  అని మనసుకు హత్తుకునే విధంగా" ఎవరి గొప్ప వారిదే" కథ రాసిండు డి నాగచరణ్.   ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యం కలిగి ఉండాలి .ఆ లక్ష్యం వైపు సాగేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. అధైర్య పడకూడదు. నిరాశ చెందకూడదు అంటూ నేటి బాలల భుజం తట్టింది ఎం. భవ్య శ్రీ    రాసిన "పట్టుదల" కథ.అంగ వైకల్యం ఆటలకు అడ్డు కాదు. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు అని న్యూనతా  భావంతో వెనక వెనక ఉండే విద్యార్థులను , మనం ఎవరికంటే తక్కువ కాదు అని ధైర్యం కల్పించింది  సిహెచ్. భవ్య "ఆత్మ విశ్వాసం"కథ. అభూత కల్పనలకు ఎక్కువగా చోటు ఇవ్వక, వాస్తవికతకు పెద్దపీట వేశారు బాల రచయితలు. పాత్రల ఎంపికలో చెట్లు, జంతువులు, సూర్యచంద్రులను కూడా రంగ ప్రవేశం చేయించారు .అంటే నేటి విద్యార్థులు వస్తు వైవిధ్యంతో పాటు పాత్రలు కూడా వైవిధ్యంగా ఉండాలని ఆలోచిస్తున్నారు అని ఈ కథలు చదివితే తెలుస్తుంది. మరి పుస్తక సంపాదకులు పొ త్తూరు సీతారామారావు ఏం ఆశించి ఈ పుస్తకం వేశారు అని మనం అనుకుంటే.. పిల్లల్లో నైతిక విలువలు, సాహిత్యాభిలాష, రచనాశక్తిని పెంపొందించాలనుకున్నారు. తెలుగు భాష తీయదనాన్ని ఆస్వాదింపజేసి, భావి రచయితలుగా మార్చాలనుకున్నారు .వారితో నాకున్న సాహిత్య పరిచయం, ఉపాధ్యాయ వృత్తి పరిచయం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే తెలుగు ఉపాధ్యాయుడిగా ఆరవ తరగతి నుండి సాహిత్యం పట్ల విద్యార్థుల్లో సాహిత్య అభిలాషను కలిగించి క్రమ క్రమంగా బాల రచయితలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇది ఏ ఒక్క నెలలో జరిగింది కాదు నిరంతర కృషి . ప్రధానోపాధ్యాయుల ప్రోత్సాహం, తోటి ఉపాధ్యాయుల సహకారంతో ఒక మంచి కథల పుస్తకం వచ్చింది .అందుకు వారందరికీ అభినందనలు. బాల రచయితలకు శుభాశీస్సులు "బాల సాహిత్యమే దేశ భవిష్యత్తు "జై బాలసాహిత్యం.         
కామెంట్‌లు