భేద భావం ఉండకూడదు ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 ఒక పురుషుడు వ్యష్టిగా (ఏక వచనం)  మరొక వ్యష్టిని స్త్రీని వివాహం చేసుకుంటే  వారిద్దరూ కలిసి (ద్వివచనం) వ్యక్తి అని పిలవబడతారు. వారికి పిల్లలు పుట్టిన తర్వాత  ఆ మొత్తాన్ని కలిపి సమష్టి (బహువచనం) అంటారు. ఇలాంటి కుటుంబాలు అనేకం కలిసి  సమాజం అవుతుంది  ఒక కుటుంబంలో తగాదాలు ఎందుకు వస్తాయి. ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు ఒకే పద్ధతిలో పెరిగినవాళ్లు అన్ని పనులు వారు అంతా కలిసి చేస్తూ ఉన్నవారు తగాదాలు పడి చీలికలు వచ్చి వేరు పడడానికి కారణాలు ఏమిటి  ఏ మనిషి ఆలోచనా మరో మనిషి ఆలోచనతో సరిపడదు. పుర్రెకో బుద్ధి అని పెద్దలు నానుడిగా చెబుతూ ఉంటారు.  ఆ భిన్న అభిప్రాయాల దగ్గర  ఈ సమస్యలు తలెత్తుతాయి.
ఒక కుటుంబంలో ఐదుగురు పిల్లలు ఉన్నారు అనుకుంటే వివాహాలై ఆస్తిని ఎవరికి వారు పంచుకునేటప్పుడు చిన్నవాడికి పుడుతుంది దుర్బుద్ధి. పెద్దవాడు నా కన్నా చాలా సంవత్సరాలు ముందు నుంచి ఈ కుటుంబంలో  సుఖాలనన్నిటిని అనుభవించాడు కదా. దానికి సరిపడిన దామాషాలో నాకు ఆస్తి రావాలి అని పేచీకి దిగుతాడు. అది భార్య ఆలోచన కావచ్చు తనది అవ్వడానికి కూడా అవకాశం ఉంది  ఈ విషయం పెద్ద మనుషుల వరకు వెళ్లి  వారందరూ కూర్చుని ఏదో ఓ పరిష్కార మార్గాన్ని వెతికి  ఆ పద్ధతిలో వారి ఆస్తి పంపకాలు జరుగుతాయి  ఆ క్షణం మొదలు  అన్నదమ్ములు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ  ఒకరి ఇంట్లో జరిగే సంబరాలకు మరొకరు రావడం కానీ జరగదు. ఇది చాలా కుటుంబాలలో మనం చూస్తున్న విషయం.
దీనికి వేమన ఎలాంటి పరిష్కారం చూయిస్తున్నాడు అంటే  మనుషులలో ముందు భేద భావం పోవాలి. వాడు ఎక్కువ వీడు తక్కువ అన్నది  మనసుకు రాకూడదు  భగవంతుని ధ్యానించడానికి ప్రతి ఒక్కరూ ఎలా అర్హులో  అలాగే  తనలాగానే ఇతరులు కూడా అన్నీ ఆలోచనలు ఎప్పుడైతే  తన మనసుకు వస్తుందో  అప్పుడు ఎలాంటి  భేద అభేదములు రావు  అప్పుడు తప్పకుండా వేదాంత రహస్యం తెలిసిపోతుంది. వేదాంతం తెలియాలంటే ముందు జ్ఞాన సముపార్జన కలగాలి  దానిని అనుసరించే శక్తిని  యోగము ద్వారా పొందాలి  అలా ఆలోచించి ఆచరిస్తే  వేదాలు "సర్వే జనా  సుఖినో భవంతు" అని చెప్పిన  అద్భుతమైన  ప్రయోజనం  అందరికీ కలుగుతుంది అని చెప్తున్నాడు వేమన. ఆయన రాసిన ఆటవెలది కూడా ఒకసారి చదివితే  మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది.
కామెంట్‌లు