హోళీ ప్రాశస్థ్యం; - : సి.హెచ్.ప్రతాప్
 సతీవియోగం తర్వాత  శంకరుడు తీవ్రమైన విరక్తితో హిమాలయాలలో  ఘోర తపస్సు ప్రారంభించాడు.అయితే యోగాగ్నిలో దహనం చేసుకొని తనువు చాలించిన  సతీదేవి పార్వతిగా మరో జన్మ ఎత్తగా ఆమెతోనే శివునికి మరల వివాహం చేయదలచిన దేవతలు, ఋషులు, నారదుడు మొదలైన వారు  పార్వతిని శంకరునికి వద్దకుపంపారు. పార్వతి ఎంతో శ్రద్ధగా అహర్నిసలు  శంకరునికి సపర్యలు చేసినా ఆయన చలించలేదు. శంకరుడి దృష్టి పార్వతిపై మరల్చడానికి, ఆయనలో వైవాహిక వాంచలను రేకెత్తించేందుకు  ఇంద్రుడు మన్మథుడిని పంపాడు. మన్మథుడి పూలబాణంతో తపోభంగమైన శివుడు ఆగ్రహించి తన మూడో నేత్రమును తెరచి మన్మథుడిని భస్మం చేసాడు.
మన్మథదహనం (కామదహనం) జరిగిన తర్వాత రతీదేవి భర్తకై విలపించి శంకరునిని ప్రార్థించినపుడు శంకరుడు అనుగ్రహించి శరీరం లేకుండా మన్మథుడిని మరల బ్రతికించాడు. ఈ విషయం మన్మథుని ప్రాణమిత్రుడైన వసంతునికి తెలిసి ఆనందంతో ప్రకృతి అంతా నిండాడు. అప్పుడు  చెట్లు చిగురించి పువ్వులు పూసి కాయలు కాసాయి. మన్మథుడు బ్రతికాడని ప్రకృతే రంగులు చల్లుకున్నది. ఈ రంగులను చూసిన వారి మనస్సు ఉప్పొంగి వారు కూడా రంగులను చల్లుకున్నారు. ప్రియుడు (మన్మథుడు) మరలా బతికాడని తెలుసుకున్న హోళిక అను రాక్షసి(రతి) కూడా ఆనందంతో శరీరాన్ని రంగులమయం చేసుకుంది. ఆమె పేరు మీదే రంగుల పండుగ హోళీ అయింది. ప్రకృతి ఆనందిస్తే చెట్లు, చేమలు రంగులు పులుముకుంటాయి. మానవుడు ఆనందిస్తే అనురాగం, ఆప్యాయత, ఆహ్లాదం రంగులై పారతాయి. మన్మథుడు శరీరం లేకుండా బ్రతకడం అంటే నిజమైన ఆనందం శరీరంతో పొందేదికాదు ఆనందం అంతా ఆత్మదే అని అర్థం. ఆత్మకు శరీరం వస్త్రం మాత్రమే. ఈ పరమార్థాన్ని, అంతరార్థాన్ని లోకానికి అందించేది హోళీ. రంగులు చల్లుకోవడంలో మానవతను, దైవభావనము, సకల జనసౌభాగ్యాన్ని అందజేసిననాడు సమాజమంతా రంగులు వెల్లివిరుస్తాయి. శరీరాత్మ విజ్ఞాన్నాన్ని పెం చే పండుగే హోళీ.
మరొక కధ ప్రకారం హోళీ ముందు
 రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికను కాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు.
ప్రతీ సంవత్సరం ఫాల్గుణ మాసం (ఫిబ్రవరి-మార్చి) పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఈరోజు స్నేహితులు, బంధువులు ఒక దగ్గర చేరి రంగులు చల్లుకుంటూ, కోలాటాలతో సందడి చేసుకుంటారు. అంతే కాకుండా సాంప్రదాయ నృత్యాలు చేస్తూ భగవంతుని సేవలో మునిగితేలుతుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. వసంత కాలంలో వచ్చే ఈ పండగను హిందువులు చాలా ఘనంగా జరుపుకుంటారు
 

కామెంట్‌లు