సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు- 60
గోముఖ వ్యాఘ్ర న్యాయము 
******
గోముఖం అంటే ఆవు ముఖం. వ్యాఘ్రం అంటే పెద్ద పులి. గోవు ముఖం గలిగిన పెద్ద పులిని గోముఖ వ్యాఘ్రం అంటాం.
ఇందులో ప్రత్యేకత ఏముంది అనిపిస్తుంది.కానీ తరచి చూస్తే అంతర్లీనంగా మరో అర్థం దానికి సంబంధించిన కథ, మరో పరిశీలనాత్మక ఉదాహరణ ఉంది.
మనం చదువుకున్న  నీతి కథల్లాంటిదే ఇది. మనకు తెలుసు పులి తోలు కప్పుకుని జంతువులను భయపెట్టి తన పబ్బం గడిపిన నక్క కథ.ఆలాంటిదే ఈ కథ.
ఓ పెద్ద పులి ఆవు తోలు కప్పుకుని ఆవుల మందలో ఆవులా తిరుగుతూ అదును చూసి వాటిని వేటాడేది.
పాపం ఆవులు అది ఆవేనని నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్నాయి.అలా పైకి సాధువుగా, మనలో ఒకరిగా కనిపిస్తూ లోలోపల కౄరమైన బుద్ధి కలిగి ఇతరులను మోసం అన్యాయం చేసే వ్యక్తిని గోముఖ వ్యాఘ్రం అంటారు.ఈ న్యాయముతో పోలుస్తారు.
గోముఖ వ్యాఘ్ర న్యాయాన్ని తెలుగులో మేక వన్నె పులి నానుడికి సమాన అర్థంలో చెప్పవచ్చు.
మేక లక్షణం చూస్తే అది ఎవరికి అపకారం చేయని జంతువు. పులి కౄర జంతువు. దాని స్వభావం ఇతర జంతువులను చంపడం.అది తెలిసిన జంతువులు భయంతో  దానికి ఎప్పుడూ దూరంగానే ఉంటాయి.
మనిషి అలాంటి దుష్టత్వం కలవాడని తెలిస్తే దూరంగా ఉంటాం.కానీ పైకి మంచివాడుగా సాధువుగా నటించే వ్యక్తి చాలా ప్రమాదకరం.అలాంటి వాడినే 'మేక వన్నె పులి' అంటారు.మేక వన్నె అంటే మేక రంగులో అని అర్థం.
ఇలాంటి వ్యక్తి  మాట్లాడే మాటలు మెత్తగా, మృదువుగా, ఎంతో నమ్మకం కలిగించే విధంగా ఉంటాయి. అలాంటి వ్యక్తిని నమ్మి మోసపోయిన తర్వాత తెలుస్తుంది మేక వన్నె పులి అని.
గోముఖ వ్యాఘ్ర న్యాయము, మేకవన్నె పులి లాంటిదే పయోముఖ విష కుంభ న్యాయం కూడా.
పయో అంటే పాలు లేదా నీరు అని అర్థం. పయోముఖ అంటే పైకి కనిపించే పాలు.విష కుంభం అంటే విషంతో నిండిన కుండ. 
పైకి చూడటానికి  స్వచ్ఛమైన పాల కుండలా కనిపిస్తున్నా లోపల విషాన్ని కలిగిన కుండను పయోముఖ విష కుంభం అంటాం.
దీనినే మనుషులకు వర్తింప చేస్తే పైకి చూడటానికి స్వచ్ఛమైన పాల వలె కనిపిస్తూ, లోలోపల దుష్టత్వం కలిగి ఉన్న వ్యక్తులను ఈ పయోముఖ విషకుంభ న్యాయంతో పోలుస్తారు.
సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు చదివినప్పుడు, వారి ముఖాలను ప్రసార మాధ్యమాల్లో చూసినప్పుడు ఎంతో అమాయకంగా కనిపిస్తూ వీళ్ళా ఇంత దారుణానికి ఒడిగట్టారు అనిపిస్తుంది.
ఇలా నమ్మించి మోసం చేసే దుర్మార్గులను, దుష్టులను చూసే ఇలాంటి  న్యాయాలు ,లోకోక్తులు పుట్టాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం