అభినందన వందనాలు.;- త్రిపురారి పద్మ.జనగామ.
తల్లిదండ్రుల ప్రేమానురాగ దీప్తిగా
అత్తామామల అనురాగవర్తిగా
పిల్లాపాపల మమతానురక్తిగా
జీవన సహచరుడికి వాత్సల్య శక్తిగా
వెలుగుతూ, ఎదుగుతూ,
ఒదిగేటి మహిళా! వందనం అభివందనం.

పసిపాప నుండి పడతిగా మారేటి క్రమములో
ఎన్నెన్నొ సుడులను దాటుతూ, సాగుతూ
ప్రతిభనే చాటుతూ,నిపుణగా వెలుగుతూ
నింగిలో చుక్కలా మెరిసేటి మహిళా!
వందనం అభివందనం.

ఆదరణ చూపేటి అన్నలే ఉన్నారు
ఆత్మీయతే పెంచు తమ్ముడే ఉన్నాడు
అండదండగ నిలుచు నాన్న తోడున్నాడు
అందరికి నీవుగా,అనురాగవల్లిగా, వెలుగుతూ, ఎదుగుతూ,
ఒదిగేటి మహిళా! వందనం అభివందనం.

బంధాల పందిరికి అల్లినా తీగవు
సుమములా విరిసినా మమకార మాలవు
మధురాతి మధురమూ నీ ప్రేమ బంధమూ.
మహిపైన నిండినా చందనా గంధము.
అవనికే వెలుగువై సాగేటి మహిళా! వందనం అభివందనం.

అలసటే ఎరుగని శ్రమ శక్తి నీవమ్మ
అందాల బంధాల త్యాగమే నీవమ్మ
ఓర్మికీ,కూర్మికీ రూపమే నీవమ్మ
ఉర్వికే కాంతిని ఇచ్చేది నీవమ్మ
సబలగా ఎదుగుతూ ఒదిగేటి మహిళా! వందనం అభివందనం.

అడుగడుగునెన్నెన్నొ ఈతిబాధలే ఉన్న
చిరునవ్వుతో నీవు సాగుతావమ్మ
శాంతమే రక్షణగ మెలుగుతావమ్మా.
కష్టాల సంద్రాన్ని 
ఈదేటి నావవై
ఎగిసేటి అలగా సాగేటి మహిళా! వందనం అభివందనం.

సూటిపోటి
మాటలు,
అణచివేతల చేతలు
ఎన్నెన్నో ఎదురైన స్థైర్యమే నీవుగా
ఎదురించి పోరాడు ధైర్యమే నీవుగా
ముందడుగు వేసేటి
ఆదిశక్తివే నీవమ్మ.
మహిళా! వందనం అభివందనం.


కామెంట్‌లు