సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -65
ఘుణాక్షర న్యాయము
  ******
ఘుణము అంటే నుసి పురుగు లేదా కర్రను తొలిచే పురుగు.ఘుణాక్షరం అంటే పురుగు తొలచడం వల్ల ఏర్పడిన అక్షరం.
అయితే ఆ పురుగు కావాలని అక్షరంలా తొలిచిందా అంటే అదేం కాదు. అది తొలుస్తూ ఉన్న క్రమంలో  ఏర్పడింది. అంతే కానీ  ఇక్కడ పురుగు యొక్క ప్రతిభ కానీ, ఆ విధంగా తొలచాలన్న ఆలోచన కానీ లేదు.అప్రయత్నంగా అలా జరిగింది అంతే.
ఇలా వ్యక్తుల  ప్రయత్నం ఏమీ లేకుండా  జరిగిన మంచి పనిని ప్రస్తావిస్తూ ఈ ఘుణాక్షర న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అసలు ఘుణాక్షరం అనే మాట ఎందుకు వచ్చిందో చూద్దాం.పూర్వం కాగితాన్ని కనిపెట్టని రోజుల్లో రాగి రేకుల మీదనో,తాటాకుల మీదనో  రాసేవారన్న విషయం అందరికీ తెలిసిందే.
'చందమామ రావే/ జాబిల్లి రావే/ కొండెక్కి రావే/ గోగు పూలు తేవే...' ఈ పాట తెలియని వారు ఉండరు. ఇలా తాళ్ళపాక అన్నమయ్య   అప్పట్లో రాసినవి అన్నీ రాగి రేకుల మీదే రాశారనీ, అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానం తాళ పత్రాలపై రాశారనీ మనకు తెలుసు..
వాటిపై మామూలుగా సిరాతో,ఇంకుపెన్నులతో రాయడం కుదరదు.అప్పటికి అవి వాడకంలో కూడా లేవు. ఒక వేళ రాసినా వాటి మీద నిలువదు చెరిగి పోతుంది.అందుకే గంటముతో రాసేవారు.ఇవి చూస్తూ ఉంటే గుంటగా రాతిపై చెక్కినట్లుగా ఉండేవి.
అయితే ఈ తాళ పత్రాలకు చెద పురుగులు లేదా నుసి పురుగులు పట్టి వాటిని కొట్టేసేవి. అలా కొట్టడం వల్ల, పత్రాన్ని తొలచినట్లై కొన్ని అక్షరాల ఒత్తులు,పొల్లులు చెరిగిపోయి, మరో కొత్త అక్షరంగా మారి పోవడం జరిగేది.
 ఆ పురుగు ప్రయత్న పూర్వకంగా తొలచడం వల్లే కొత్త అక్షరం ఏర్పడిందని మనం అనుకుంటాం.కానీ పురుగుకు అంతటి జ్ఞానం ఉండదు కదా!.
ఇలా ఉద్దేశ రహితంగా జరిగిన మంచి పనిని ఘుణాక్షర న్యాయము అంటారు.
దీనికో సరదా కథ ఒకటి ఉంది.ఓ చెరువు గట్టు దగ్గర కొంతమంది స్నేహితులు నిలుచుని మాట్లాడుతూ ఉన్నారు... ఇంతలో ఓ పిల్లవాడు చెరువులో పడి కొట్టుకుపోతుంటే ఆ స్నేహితుల్లోని ఒకతను రక్షిస్తాడు.
అందరూ అతడు చేసిన సాహసానికి  పొగుడుతూ వుంటారు.
అతడేమో "ఇంతకూ నన్ను అందులోకి నెట్టింది ఎవరు?" ఏడుపు మొహంతో అంటాడు.
మునిగి పోతున్న పిల్లవాడిని చూస్తున్న వాళ్ల తోపులాటలో అతడు అందులో పడిపోవడంతో ఆ పిల్లవాడిని రక్షించడం జరిగిందన్న మాట.
అంతే కానీ అ పిల్లవాడిని రక్షించేందుకు చెరువులో దూకి ప్రాణాలు రక్షించాలన్న తలంపేం లేదు.అనుకోకుండా అతడు అందులో పడటం వల్ల ఆ పిల్లవాడికి మేలు జరిగింది.
ఇలా అప్రయత్నంగా జరిగిన మంచి పనిని ఈ ఘుణాక్షర న్యాయంతో పోలుస్తారు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు