అంటగాకు... ముట్టగాకు...ఓయత్తా...- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఒక అత్త, ఒక కోడలు వుండేటోళ్ళు. కోడలు చానా మంచిది. కానీ అత్తకు కోడలంటే అస్సలు పడేది కాదు. చీటికీ మాటికీ ఏదో ఒక వంక దొరికిచ్చుకోని నానా తిట్లు తిట్టేది.
ఒకసారేమో ఇద్దరూ ఏట్లో చేపలు పట్టడానికని పోయినారు. "నీవెక్కువ పడతావా... నేనెక్కువ పడతానా" అంటూ పందెం వేసుకున్నారు. సాయంత్రమైంది. అత్తకేమో ఒక్క చేప కూడా పళ్ళేదు. కాని కోడలికేమో బుట్ట నిండా పడినాయి. ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ బుట్టలు చూసి వాళ్ళత్తతో "ఏమమ్మా... ఒక్క చేప కూడా పట్టలేక పోయినావా... నీకన్నా నీ కోడలే నయమే" అంటూ నవ్వసాగినారు. అందరూ తన కోడలిని తెగ మెచ్చేసుకుంటా తనని ఎగతాళి చేస్తావుంటే  అత్త కోపంతో లోపల్లోపల కుతకుతా వుడికిపోయింది.
ఇంటికొచ్చినాక కోడలితో "నువ్వు పోయి బావిలో నీళ్ళు తాపో... నేను చేపలకూర వండుతా" అని చెప్పింది. 'సరే'నంటూ కోడలు కడవ తీసుకోని నీళ్ళకు పోయింది. కోడలు అట్లా పోయిందో లేదో అత్త బెరబెరా ఇంటి వెనక్కు వచ్చింది. ఆడ ఒక పెద్ద నాగుపాము పుట్ట వుంటే కట్టె తీస్కోనొచ్చి దాన్ని పగులగొట్టడం
మొదలు పెట్టింది. దాంట్లో వున్న నాగుపాము బుస్సుమంటూ బైటకొచ్చింది. వెంటనే అత్త పామును పట్టి చేపల బుట్టలో వేసి మూత పెట్టింది. కోడలు వచ్చీ రాగానే చేపలు తోమమని అత్త కోడలిని పురమాయించింది. కోడలుకిదంతా తెలియదు కదా, తోముదామని ఆమె చేపలబుట్ట తీసింది. అంతే కోడలిని పాము కాటు వేసింది. ఒళ్ళంతా విషమెక్కి గిలగిలా కొట్టుకుంటా అక్కడికక్కడే చచ్చిపోయింది. వెంటనే అత్త ఇంటి వెనుక గుంత తీసి కోడలిని బూడ్చి పెట్టి ఏమీ ఎరుగని నంగనాచిలా మట్టసంగా కూచోనింది.
సాయంత్రం పొలం నుండి కొడుకు ఇంటికొచ్చినాడు. చూస్తే పెండ్లాం యాడా కనబళ్ళేదు. వాళ్ళమ్మను పిలిచి “అమా... అమా... నా పెండ్లాం యాడా కనబడ్డం లేదు. యాడికి పోయింది" అనడిగినాడు. 
దానికి వాళ్ళమ్మ అమాయకంగా మొగం పెట్టి “ఏమోరా..  నాకు తెలీదు. పొద్దున్నే కట్టెలు తెస్తా అని అడవికి పోయింది. అంతే ఇంతవరకూ రాలేదు" అని చెప్పింది. వానికి వాళ్ళమ్మ చంపేసినేది తెలీదు గదా. అందుకని పెండ్లాం కోసం అడవంతా వెదికీ వెదికీ అలసిపోయినాడు. ఏమైందో తెలీక కొద్ది రోజులు ఏడ్చి పూకున్నాడు.
కొంత కాలం తర్వాత ఒకరోజు కోడలి అమ్మ చిన్న కూతుర్తో కలిసి తన కూతురెట్లా వుందో చూసొద్దామని ఆ వూరికి వచ్చింది. చూస్తే కూతురు లేదు. 
దాంతో వాళ్ళమ్మ "మా కూతురెక్కడా కనబడ్డం లేదే.. యాడికి పోయింది" అనడిగింది. 
దానికామె దొంగేడుపు ఏడుస్తా "ఏమోనమ్మా... నాలుగు నెలల కిందట కట్టలు తీసుకోనొస్తా అని అడవికి పోయింది. అంతే... ఆరోజు నుండీ ఈ రోజు వరకు అజా పజా లేదు. ఏమైందో... ఏమో..." అనింది.
కూతురు ఏమైపోయిందబ్బా అని వాళ్ళు ఆలోచించుకుంటా పోతా వుంటే చిన్న చెల్లెలికి ఇంటి వెనక వున్న మందార పూలచెట్టు కనబడింది. ఆ చెట్టు సరిగ్గా కోడలిని ఎక్కడైతే బూడ్చి పెట్నారో సరిగ్గా ఆన్నే పెరిగింది. 
ఆ పాప చెట్టు వంక చూస్తా “అమా... అమా... అక్కకు మందారపూలంటే ఎంతో ఇష్టంగదా... అందుకే
పెంచుకున్నట్టుంది. నేను పోయి ఒక పూవు కోసుకోనొచ్చుకుంటా" అని వురుక్కుంటా పోయి కోసుకుందామని పూవు ముట్టుకోబోయింది. 
అంతే... వెంటనే ఆ పూవు 
"అంటగాకు... 
ముట్టగాకు.. ఓ చెల్లెలా
అంటూ ముట్టూ తగులుతాది 
పాము పెట్టి చంపే
పాపిష్టి అత్త" అనింది.
ఆ మాటలింటానే పాప అదిరిపడింది. వెంటనే వురుక్కుంటా వాళ్ళమ్మ దగ్గరికి పోయి “అమా... అమా..." అంటూ జరిగిందంతా చెప్పింది. ఆమె అట్లాగా అని ఆచ్చర్యపోయి వచ్చి ఆ పువ్వును ముట్టుకోబోయింది, అంతే వెంటనే ఆ పూవు మళ్ళా
"అంటగాకు... 
ముట్టగాకు.. ఓయమ్మా 
అంటూ ముట్టూ తగులుతాది పాము పెట్టి చంపే
పాపిష్టి అత్త" అనింది.
దాంతో వాళ్ళు మళ్ళా ఇంట్లోకి పోయి అత్తను పిల్చి “నిజం చెప్పు... నా కూతురినేం చేసినావు" అనడిగినారు. దానికామె అమాయకంగా “ఏమోబ్బా... నీ కూతురేమైందో నాకేం తెల్సు, అడవిలో పులే చంపిందో... సింహమే చంపిందో" అనింది.
"అట్లాగా... ఐతే బైటకి రా..." అంటూ ఆమె వూరందర్నీ పోగు చేసి “పోయి ఆ పూవును ముట్టుకోపో " అనింది. 
అత్త “అట్లాగే... నాకేం భయమా" అంటా ముట్టుకోబోయింది. వెంటనే ఆ పూవు
“అంటగాకు... 
ముట్టగాకు... ఓయత్తా 
అంటూ ముట్టూ తగులుతాది పాము బెట్టి చంపినావు
పాపిష్టిదానా" అనింది.
ఆ మాటలిన్న అత్త తాను కోడలిని చంపిన విషయం పూరందరికీ తెలిసిపోయిందని భయపడి ఆన్నించి పారిపోడానికి వురికింది.
వెంటనే అందరూ ఆమెను పట్టుకోని మెత్తగా తన్ని గుండు కొట్టించి, సున్నం బొట్లు పెట్టి, గాడిద నెక్కించి, మెళ్ళో చెప్పుల దండేసి వూరంతా తిప్పి... 
“నీలాంటోళ్ళుంటే వూరికే చెడ్డ పేరు... ఫో మా పూర్నించి" అంటూ వెళ్ళగొట్టేసినారు.
***********
కామెంట్‌లు