ఒకూర్లో ఒకడుండేటోడు. వాడొకరోజు పనిబడి వాళ్ళ అత్తోళ్ళ ఊరికి పోయినాడు. రాక రాక అల్లుడొచ్చినాడు గదా అని వాళ్ళత్త బాగా పూర్ణమేసి కుడుములు చేసి పెట్టింది. అంతవరకూ వాడెప్పుడూ వాని జన్మలో కుడుములు చూడలేదు. తినలేదు. అదే మొదటిసారి. దాంతో వాటి రుచి చూసి “అబ్బ... ఎంత బాగున్నాయివి" అని లొట్టలేసుకోని తినుకుంటా “అత్తా... అత్తా... దీండ్ల పేరేమి" అనడిగినాడు.
దానికి వాళ్ళత్త “కుడుములు" అని చెప్పింది.
వాడు పళ్ళెంలో వున్నవన్నీ నున్నగా తినేసి మరో నాలుగు యేపిచ్చుకోని “వీటిని ఎట్లా చేస్తారత్తా" అనడిగినాడు.
దానికి వాళ్ళత్త “అరెరే నీవింతవరకూ ఎప్పుడూ కుడుములు తినలేదా... నీ పెండ్లానికి వీటిని చేయడం బాగా వచ్చులే... పోయి అడుగు.... చేసి పెడతాది" అని చెప్పింది.
సరేనని సాయంత్రం వాడు మళ్ళా ఒక నాలుగు కుడుములు తిని ఇంటికి బైలుదేరినాడు. దాండ్ల పేరు యాడ మర్చిపోతానో ఏమో అనుకోని "కుడుములు... కుడుములు... కుడుములు... కుడుములు..." అనుకుంటా పోవడం మొదలు పెట్టినాడు.
అట్లా "కుడుములు... కుడుములు...” అనుకుంటా పోతావుంటే దారిలో ఒక చిన్న నీటి కాలువ అడ్డమొచ్చింది. దాంట్లో దిగితే తడిసిపోతానేమోనని వాడు వెనక్కి నాలుగు అడుగులేసి వురుక్కుంటా వచ్చి “అద్దిరబన్నా" అని ఎగిరి అవతలికి ఒక్క దుంకు దుంకినాడు.
అట్లా “అద్దిరబన్నా" అని ఎగిరి అవతలికి దుంకినాడు కదా... అట్లా దుంకడం... దుంకడం... వాడు "కుడుములు" అనే మాట మర్చిపోయి “అద్దిరబన్నా... అద్దిరబన్నా..." అనుకుంటా పోవడం మొదలు పెట్టినాడు.
వాడు ఇంటికి పోవడం ఆలస్యం పెండ్లాన్ని పిల్చి “ఏమే... మీ ఇంట్లో మీ అమ్మ అద్దిరబన్నలు చేసి పెట్టింది. అబ్బ... అంత రుచికరమైనవి నా జన్మలో ఎప్పుడూ తినలా. నువ్వుగూడా చెయ్యే" అన్నాడు.
ఆమెకు కుడుములంటే తెల్సుగానీ... అద్దిరబన్నలంటే తెలీదు గదా... దాంతో "ఏమోనండి... అద్దిరబన్నలంటే ఏంటివో నాకు తెలీదు. అస్సలాపేరే ఎప్పుడూ నేను వినలేదు" అనింది.
ఆ మాటింటూనే వానికి తెగ కోపమొచ్చేసింది. “ఓసి... దొంగదానా... ఎప్పుడూ ఏమీ అడగనోన్ని నోరు తెరిచి నాకిస్టమైనవి చెయ్యే అంటే... తెలిసి గూడా తెలీదంటావా. మీ అమ్మ నీకు అద్దిరబన్నలు చేయడం బాగా వచ్చని వచ్చే ముందు పదే పదే చెప్పింది. మర్యాదగా నోర్మూసుకోని చేసి పెట్టు" అన్నాడు కోపంగా.
పాపం... ఆమెకు ఎంత ఆలోచించినా అవేంటివో అర్థం కాలేదు. దాంతో "నిజం చెప్తావున్నా... ఆ దేవుని మీదొట్టు. అద్దిరబన్నలంటే ఏంటివో నాకస్సలు తెలీదు. నన్నొదిలెయ్యి" అనింది.
దాంతో వాడు కోపంగా పూగిపోతా మూలనున్న దుడ్డుకర్ర తీసుకోనొచ్చి “ఏమే... మర్యాదగా అడుగుతా వుంటే చేయనంటావా... వుండు నీ పని చెబుతా" అంటూ పావం ఆమెను కొట్టడం
మొదలు పెట్టినాడు. ఆమె ఆ దెబ్బలకు తట్టుకోలేక “అమ్మో.... నాయనో... నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు దేవుడో...” అంటూ గట్టిగా ఏడుస్తా అరవడం మొదలు పెట్టింది.
ఆ అరుపులు విని చుట్టుపక్కన వున్నోళ్ళందరూ వురుక్కుంటా వచ్చి ఆమెను ఇడిపిచ్చి "ఏందిరా... ఏం పాపం చేసిందని నీ పెండ్లాన్ని అట్లా కొడతా వున్నావు. నువ్వు మనిషివా పసువ్వా" అనడిగినారు.
దానికి వాడు కోపంతో చిందులు తొక్కుతా “ ఈ దొంగసచ్చినేది పని తప్పిచ్చుకోవాలని అద్దిరబన్నలు చేయమంటే తెలిసి గూడా తెలీదంటుంది. అందుకే తంతావున్నా" అన్నాడు. అక్కడున్నోళ్ళగ్గూడా ఈ అద్దిరబన్నలంటే ఏంటివో అర్థం కాలేదు.
అంతలో ఒక ముసలామె ఆమె ఒళ్ళంతా దెబ్బలతో కందిపోయింటే చూస్తూ "ఒరే... నీకేం పోయేకాలమొచ్చిందిరా... అద్దిరబన్నలంటే తెలీదని చెప్తా వున్నా వినకుండా గొడ్డును బాదినట్లు అట్లా బాదినావు. ఒళ్ళు చూడు... పాపం... కుడుములు కట్టినట్లు ఎట్లా కందిపోయిందో" అనింది.
"కుడుములు" అనే మాటినేసరికి వాడదిరిపడి "ఆ... ఆ... అవే... అవే... అద్దిరబన్నలు కాదు... కుడుములు... కుడుములు..." అన్నాడు.
ఆమాటినేసరికి అందరూ “ఓరినీ... నీ మతిమరుపు మీద బండ పడ. కుడుములని ముందే చెప్పింటే చేసి పెడ్తుండె గదా, పాపం వుత్త పుణ్యానికి అద్దిరబన్నలు... అద్దిరబన్నలు... అంటా సావగొట్టినావు" అంటూ వాన్ని బాగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వెళ్ళిపోయినారు.
***********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి