ఎంతో ఎంతో అందం చూడగ;- -'బాలబంధు' గద్వాల సోమన్న
విందులు చేసే పచ్చని పైరులు
చిందులు వేసే ముద్దుల బాలలు
ఎంతో ఎంతో అందం చూడగ
అన్నం పెట్టే చక్కని పల్లెలు

ప్రాణం పోసే భువిలో తరువులు
జ్ఞానం నింపే మాన్యులు గురువులు
ఎంతో ఎంతో అందం చూడగ
ముఖమున విరిసిన నవ్వుల పూవులు

గలగల పారే యేరుల పరుగులు
మిలమిల మెరిసే నింగిని తారలు
ఎంతో ఎంతో అందం చూడగ
కిలకిల నవ్వే పిల్లల మోములు

నైతిక విలువలు కల్గిన బ్రతుకులు
మానవత్వమే నిండిన మనసులు
ఎంతో ఎంతో అందం చూడగ
ప్రమిదలు బోలిన గృహమున పడతులు


కామెంట్‌లు