నిండు జీవితం ;- - యామిజాల జగదీశ్
 అనగనగా ఓ పెద్దాయనకు నలుగురు కొడుకులు. ఆయన తన కుమారులు ఏ విషయంలోనైనాసరే చూడటంతోనే ఓ నిర్ణయానికి రాకూడదనే పాఠం చెప్పాలనుకున్నాడు. కనుక ఆయన తనకు చాలా దూరాన ఉన్న ఒక పండ్ల చెట్టుని చూసి రమ్మన్నాడు. అయితే అందరినీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరినీ ఒక్కో రుతువులో పంపాడు. 
పెద్ద కొడుకు శీతాకాలంలో, రెండో కొడుకు వసంతకాలంలో, మూడో కొడుకు వేసవిలో, అందరిలో చిన్నవాడైన నాలుగో కొడుకు శరదృతువులోనూ ఆ చెట్టుని చూడటానికి వెళ్ళారు.
కొడుకులు నలుగురూ ఆ చెట్టుని చూసి తిరిగొచ్చిన తరువాత దాని గురించి చెప్పమన్నాడు పెద్దాయన. 
పెద్ద కొడుకు చెట్టు వికారంగా, వంకర్లు తిరిగుందని చెప్పాడు.
రెండవ కొడుకు "నాన్నా! అన్నయ్య చెప్పింది సరికాదు. అది ఆకుపచ్చ మొగ్గలతో కప్పబడి నిండుగా ఉంది" అన్నాడు.
ఆ తర్వాత మూడో కొడుకు మొదటి ఇద్దరితోనూ ఏకీభవించలేదు. వాళ్ళు చెప్పిందంతా తప్పని, పువ్వులు వికసించి సువాసనలతో మనసుకి ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేనన్నాడు.  ఆ చెట్టు ఎంతో మనోహరంగా ఉందన్నాడు.
ఇక చివరి కొడుకు తన ముగ్గురు సోదరులతోనూ విభేదించాడు. పండ్లన్నీ పక్వానికొచ్చి, జీవితం పరిపూర్ణతతో కూడినదని చెప్పేలా ఉందా చెట్టు అన్నాడు.
నలుగురు కొడుకులూ చెప్పినదంతా విన్న ఆ తండ్రి ఓ చిన్న నవ్వు నవ్వి ఇలా అన్నాడు...
"మీరు చెప్పినదంతా నిజమే. కానీ ఆ నిజాలన్నీ ఆయా రుతువులకే పరిమితం. కానీ చెట్టుని మొత్తంగా చూడాలి. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రావాలి. ఇది తెలుసుకోవాలనే మిమ్మల్ని నేను ఒక్కో సీజన్లో చెట్టుని చేసి రమ్మన్నాను. చెట్టు విషయంలోనే కాదు, మన జీవితమూ వివిధ దశలతో కూడినది. ఒక్కో దశలో ఒక్కోలా అన్పిస్తుంది. కానీ మనమందరం తొందరపడి ఓ నిర్ణయానికి వచ్చేస్తాం. అది సరికాదు. ప్రతి దానికీ ముందు వెనుకలుంటాయి. కనుక అన్నింటినీ పరిశీలించి తుది నిర్ణయానికి రావడమే ఉత్తమం. ఒక సీజన్లో ఆకుల్ని విదిల్చిన చెట్టు మరో సీజన్లో చిగురిస్తుంది. ఇంకొక సీజన్లో పచ్చగా పువ్వులూ కాయలతో నిండుగా అన్పిస్తుంది. ఇంకొక సీజన్లో తీయని పండ్లతో గొప్పగా కన్పిస్తుంది. కానీ ఇవన్నీ కలిస్తేనే చెట్టు. కనుక ఒక కష్టకాలాన్ని బట్టి జీవితాన్ని అంచనా వేయకూడదు. కలిమిలేములు కష్టసుఖాలు ఇలా ఆన్నీ కలీస్తేనే జీవితం" 
ఎప్పుడో ఎక్కడో తమిళంలో చదివిన గుర్తుకొచ్చి ఈ నాలుగు మాటలూ అల్లానిక్కడ. అంతే. అంతకన్నా మరొకటి కాదు.

కామెంట్‌లు