సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -207
యత్పరః శబ్ద న్యాయము
*****
యత అంటే ఎందుకంటే , లేదా నియంత్రించబడిన అని అర్థము.పర అంటే తదుపరి అని అర్థం.
యత్పర అంటే ఆ తర్వాత  అని,శబ్ద అంటే ధ్వని లేదా పదము అని అర్థము.
ముందు తేజస్సు, తర్వాత శబ్దం పుట్టినా శబ్దం అర్థవంతమైనది అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
శాస్త్ర వేత్తల పరిశోధనలూ, ప్రయోగాల్లో తేలిన విషయం ఏమిటంటే కాంతి లేదా తేజస్సు ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుందనీ. దీనికి ఋజువుగా వర్షం వచ్చేముందు ఉరుములు మెరుపులలో ఉరుము శబ్దం వినడానికి  ముందే మెరుపును చూడగలము.
కొందరు ఆధ్యాత్మిక,తత్వ వేత్తల మాటల్లో  కూడా భగవంతుని నుండి వెలువడిన శక్తులలో మొదటిది అగ్ని లేదా తేజస్సు అని చెప్పబడింది. 
శ్రీ అరబిందో గారు రాసిన "వేద రహస్యం"లో అగ్ని దివ్యత్వం యొక్క  రూపమనీ,బలమైన వేడి మరియు జ్వలించే జ్ఞానశక్తి యని చెప్పారు.అలాగే అగ్నిని దైవ సంకల్ప శక్తి గానూ, ప్రకాశించే సంకల్పంగానూ, విశ్వ శక్తిగానూ చెప్పారు.
అయితే ఇక శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయములో సృష్టి తత్వం గురించి భగవానుడు చెప్పిన మాటల్లోనేమో  శబ్దమే ముందు పుట్టిందని చెబుతాడు.
పంచమహా భూతములు ఐదనీ,అవి భూమి, వాయువు ,అగ్ని, నీరు, ఆకాశమనీ చెబుతూ,వాటికి సంబంధించినవి  మన దేహంలో ఉన్నాయని అవి  శబ్దం,స్పర్శ, రూపము,రస ఇంద్రియాలు అని చెప్పారు.
ఇందులో ఆకాశం అనేది శబ్దము గుణమును కలిగి ఉన్నదనీ, అది ధ్వనికి మూలమనీ.అన్ని లోకాలు, గోళాలు ఉన్నది ఆకాశంలోనే. లోపలా వెలుపలా అనే వ్యవహారానికి కూడా ఆకాశమే మూలమనీ,హృదయాకాశము, ఇంద్రియాలను కూడా ఆకాశమే అంటారని చెబుతూ...
చక్షురింద్రియం సూర్యాధిష్టం అని, ఇది తేజస్సుకు మూలమనీ ఈ తేజస్సు ప్రకాశిస్తుంది.ఉడికిస్తుంది.నీరు తాగిస్తుంది.భోజనం చేయిస్తుంది ( దాహాగ్ని, జఠరాగ్ని అంటారు)అంటే ఆకలి, దప్పిక పుట్టిస్తుంది.ఈ విధంగా ఈ భూమి మీద మొదట శబ్దము సృష్టించబడిందని చెప్పారు .
ఇక వేదం  "ఓంకారం విశ్వంలో అంతర్లీనంగా ఉందనీ, ఓంకారం అనే శబ్దంలో విశ్వం ఉందని" చెబుతుంది.
శబ్దము- శ్రోత్రము, వాయువు- స్పర్శ -త్వక్,అగ్ని- రూపము-చక్షు జలము-రసము- రసనేంద్రయము, భూమి -గంధము-ఘ్రాణము.. ఈ విధంగా భూమిలో ఐదు గుణాలు ఉన్నాయని భగవానుడు చెప్పాడని శ్రీమద్భాగవతం చెబుతోంది.
కబీర్ కూడా "సమస్తం ఓంకారం అనే శబ్దం నుండే పుట్టిందని" అంటాడు.
వారి వారి మతాభిమానము ప్రకారము వారు ఈ సృష్టి, భూమి యొక్క ఆవిర్భావం గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.
ఈ విధంగా భూమి మీద శబ్దం కంటే ముందు కాంతి పుట్టినదని చెప్పినా, కాంతి కంటే ముందు శబ్దం పుట్టిందని చెప్పినా ,దేని తర్వాత ఏది పుట్టినా... భూమి పుట్టి కోటాను కోట్ల సంవత్సరాలు గడిచాయన్నది సత్యం.అలా ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి శబ్దం మరియు తేజస్సు లేదా కాంతితో ఏదో ఒక సంబంధం ఉంటుందనే జ్ఞానాన్ని పొందడమే ఈ "యత్పరః శబ్ద న్యాయము" యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
 మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని వివిధ శబ్దాలను వింటూ, సూర్య కాంతి నుండి  జీవ చైతన్యాన్ని  పొందడమేననీ ఈ న్యాయము ద్వారా గ్రహించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు