సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -211
యూప పశు న్యాయము
*****
యూపము అంటే బలి పశువును కట్టి వేయుటకు నాటబడిన యజ్ఞ సంబంధమైన కొయ్య.దీనినే కట్టుకొయ్య అని కూడా అంటారు.పశువు అంటే నాలుగు కాళ్ళ జంతువు,పశుప్రాయుడు, ఆత్మ,బలికి ఇచ్చు మృగము అనే అర్థాలు ఉన్నాయి.
యూప స్తంభము అంటే కట్టుకొయ్య.దానికి కట్టిన పశువుకు చావు తప్పదు. కొద్ది రోజుల్లో తాను చావడం తప్పదని తెలిసి కూడా  మానసికంగా సిద్ధంగా ఉండటమే కాకుండా  తనకు  ఆ ధ్యాసే లేనట్టుగా  నిర్వికారంగా ఆ కట్టుకొయ్యకు కట్టబడి అలాగే వుంటుంది.కానీ తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయదు.
వెనుకట రాజుల కాలంలో యజ్ఞ యాగాలదుల సమయంలో చేసినవి మనం చూడలేదు. కానీ ఇలాంటివి  జాతరలలోనూ, మొక్కులు చెల్లించుకునే సమయంలోనూ చూస్తూ ఉంటాం.వాటికి తమ చావు విషయం తెలుసో తెలియదో కానీ పెట్టిన మేతను నిర్వికారంగా మేస్తూ ఉండటం గమనించవచ్చు. 
అలాగే "జాతస్య మరణం ధృవం" అంటే  'పుట్టిన ప్రతి జీవి చావక తప్పదు' అని అందరికీ తెలుసు. కానీ అది తెలిసి కూడా కొందరు ఎలాంటి భావోద్వేగాలకూ, రాగ ద్వేషాలకూ లోనుకాకుండా నిర్వికార స్థితిలో ఉంటారు.
సుఖ దుఃఖాలను,మానావ మానాలను ఓకే తీరుగా స్వీకరిస్తారు.తాము చేసే పర హితమైన పనులను చేయడానికి ఎలాంటి విఘ్నాలు,విఘాతాలు వచ్చినా  వెనుకాడరు.
ఒక విధంగా చెప్పాలంటే వీరిని స్థితప్రజ్ఞత కలవారు అనవచ్చు.
"దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః/ వీతరాగ భయ క్రోధఃస్థితధీర్మునిరుచ్యతే"
అని శ్రీమద్భగవద్గీతలో "నిర్వికార గుణాలు కలిగిన ఉన్న వ్యక్తి అంటే శారీరక మానసిక బాధలు ఎంత పట్టి పీడించినా, తిరస్కారాలు,నిందలు ఎన్ని తనపై మోపబడినా  ఎవరెలా ద్వేషించినా ... ఎలాంటి క్రోధ స్థితిని పొందకుండా  సుఖ దుఃఖాలను సమంగా భరించగలిగే ఆత్మ స్థైర్యాన్ని కలిగి వుంటాడనే" అర్థంతో ఈ శ్లోకం చెప్పబడింది.
 ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు.ఈ ప్రపంచమనే కట్టుకొయ్యకు కట్టేయబడిన మనుషులం. మృత్యువు సంభవించే లోపు రాగద్వేషాలకు అతీతంగా చేయవలసిన మంచి పనులు చేసి మానవ జన్మను సార్థకం చేసుకోవాలనే అంతరార్థం ఇందులో ఇమిడి ఉంది. 
దానిని గ్రహించి, గమనంలో పెట్టుకొని సాగిపోవడమే మనం చేయాల్సిన పని.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు