ఓ యువతా మేలుకో
నీ దేశాన్ని ఏలుకో..
చేవ సచ్చి.. నిస్పృహతో
నిర్జీవంగా నిరుపయోగంగా
మిగిలిపోకు..
నీ చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని,
అక్రమాలను అవినీతిని చూస్తూ మౌనంగా ఉండబోకు. :ఓ:
లే.. నిద్రలే...నడుం కట్టు
నీ లక్ష్యం వైపు పయనించు
ప్రపంచం నీవైపు చూస్తుంది
చరవాణిని వీడి
చరిత్రను సృష్టించు.
అంతర్జాల వ్యసనం వీడి
అధ్భుత భవితకు బాటలు పరువు : ఓ:
నీ భవిష్యత్ కి నీవే కర్త కర్మ క్రియ
నీ తలరాతకి నీవే బ్రహ్మ..
నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని
అస్తమానం తిడుతూ.. పడుతూ
కృంగిపోకు..నిర్లక్ష్యం వీడు..
నీ లోని ప్రతిభను వెలికి తీయి
లక్ష్యం వైపు సాగిపో
ధృఢ చిత్తంతో అడుగులు వెయ్యి :ఓ:
ప్రపంచం సువిశాలం..
ఎన్నో అవకాశాల పెన్నిధి.
ఎన్నో అద్భుతాలకు నెలవిది
ప్రతిభకు పట్టం కడుతూంది..
ప్రతిభ ఎవడి సొత్తూ కాదని గ్రహించు..
నిస్తేజం వీడి తేజోవంతడివై సాగిపో
రేపటి రోజు నీదే నీదే.. :ఓ:
ఉజ్వల భవిష్యత్ కోసం
వయసు మళ్ళిన
కాలం చెల్లిన నాయకులకు వీడ్కోలు పలుకు..
అవినీతి, బంధు ప్రీతికి కాలం
చెల్లిందని చాటు..
అన్యాయాన్ని అక్రమాలను
ప్రశ్నించు..
సమ సమాజ స్థాపనకు
నడుం కట్టు..
నవోదయానికి నాంధి పలుకు
నవ భారతాన్ని నిర్మించు.. : ఓ:
యువశక్తీ నీ శక్తిని గ్రహించు
యుక్తి గా ఆలోచించు
యువ కిషోరమై పోరాడు
యువతరానిదే ఈ నవభారతం అని చాటించు..
యువ భారతాన్ని నిర్మించు.. :ఓ:
లేవండి ఓ యువకులారా
మేల్కొండి..మెల్కోల్పండి
ఈ సమాజాన్ని..
పరుగెత్తండి గమ్యం చేరే దాకా..
వివేకానందుడి మాటలు విశ్వసించండి..
వివేకవంతులై విజ్ఞాన వంతులై
నీ దేశం కోసం నీ జాతి కోసం
నీ మాతృ భూమి కోసం
నిజమైన దేశ భక్తుడిగా
భావి భారత భాగ్యవిధాత లై
బంగారు భారతాన్ని నిర్మించండి :ఓ:
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి