మా అందరికీ కేంద్ర బిందువు మా నాయనమ్మ ఆరుమళ్ళ రంగమ్మ గారు చిన్న వయసులోనే ఒక మగ బిడ్డకు ఒక ఆడబిడ్డకు తల్లి. చిన్న వయసులోనే వైధావ్యాన్ని పొంది పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకొని బిడ్డలను ఉన్నతులుగా తయారుచేసి మా అందరిని ఒక గాడిలో నడిపిన పుణ్యవతి మా నాయనమ్మ ఆమెకు కుంచనపల్లి పాతూరు పెనమాక గ్రామాలలో బంధువులు ఎక్కువగా ఉన్నారు ఎక్కువగా ఆ మూడు ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉంటుంది వెళ్ళేటప్పుడు మా ఐదుగురిలో ఎవరినో ఒకరిని ప్రక్కనే తీసుకుని వెళ్ళేది అక్కడకు వెళ్ళిన ప్రతిసారి అన్నీ రాజమరియాదలే ఆమె పెద్దరికం వల్ల అందరూ గౌరవించేవారు మాకు పిల్లలతో ఆడుకోవడం పక్కనే ఉన్న కొండపైన షికార్లు చేయడం అక్కడ ఉన్నన్ని రోజులు నిత్య కృత్యం.
ఆమె మనసు చాలా సున్నితం విజయవాడ వరకు వచ్చి అక్కడ నుంచి కృష్ణా నది వరకు లాగుడు రిక్షా లో వెళ్లి నది నీళ్లలో నడుచుకుంటూ మమ్మల్ని పట్టుకొని మేము పడిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి నడిపించి తీసుకొని వెళ్ళేది అది చాలా దగ్గరగానే ఉండేది దూరం మేము ఇంటికి వెళ్లేసరికి బట్టలు ఆరిపోయేవి వెళ్లే మార్గంలో నీటి సౌకర్యం లేక అనేకమంది బాధపడుతూఉన్నవారిని చూసి తాడేపల్లి గ్రామంలో ఉన్న పెద్దలను కలిసి మీరు జాగ్రత్తగా పెద్ద బావిని తవ్విస్తాను అంటే దానికి కావలసిన ఆర్థిక సహకారం నేను అందిస్తాను మీరు ఎవరు ఒక పైసా ఖర్చు చేయవలసిన అవసరం లేదు మీకు ఏ పద్ధతిలో బావి కావాలో ఆ పద్ధతిలో తవ్వించుకోవడానికి మీ సహకారం నాకు అవసరం అని చెప్పి బావిని తవ్వించింది దానిపై వారు మా నాయనమ్మ పేరు కూడా చెక్కించారు నేటికీ అది కనిపిస్తోంది. ఆమె మాట పనివారికి వేదవాక్కు వేరే వారు ఎవరైనా పనికి పిలిస్తే అమ్మగారితో చెప్పండి వస్తాం అని అంటారు తప్ప వారంతట వారు వెళ్లరు పనిచేసిన తర్వాత ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్లాల్సిందే. లేకపోతే ఆమెకు కోపం ఇంతవరకు ఒళ్లంతా హూనం చేసుకున్నావు భోజనం లేకపోతే ఎట్లా ఆకలి కాకపోతే కాసేపు ఆగి తిని వెళ్ళు అనేది తాను భోజనం చేసేటప్పుడు ఎంతమంది వచ్చినా వారంతా తిని వెళ్ళవలసినదే పదార్థాలు అయిపోతే మళ్లీ చేయించేది భార్యాభర్తల తగాదాల నుంచి ఏ జగడం జరిగినా ఆమె తీర్పు శిలాశాసనం. ఆమె చెప్పిన తరువాత దానికి తిరుగు ఉండదు అలా మా గ్రామాన్ని పరిపాలించిన నాయనమ్మ మా ఐదుగురిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసింది మా అమ్మను కూడా మరిపించేది.
మన గన్నవరం...;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి