సుగంధం!!!; - ప్రతాప్ కౌటిళ్యా
జాబిల్లి తోటల్లో
పువ్వుల నవ్వుల పరిమళాలు
మకరందాలు జాలు వారుతున్నట్లు
సుకుమార సౌదాల సౌందర్యాల ముందు
వాలిపోతున్న సుగంధం!!!

బృందావనలై ఎదురెదుతున్న మీనాల్లా
ఎగిరి పడుతూ మెరుస్తూ మైమరిచిపోయిన చీకటి లోయల్లో
రంగురంగుల నక్షత్రాలు
దారి మళ్ళీ మళ్ళీ వెతికిన చూపుల దండల్లో 
అల్లుకుపోయి గుండెల్లో గుచ్చుకున్న దారాన్ని 

భద్రంగా దాచుకొని జ్ఞాపకాలుగా మార్చి
ఏరి కూర్చుకున్న
సుగంధ ధనాన్ని ఎవరెవరికి దానం చెయ్యాలో
చెలికత్తెల దరహాసాల్లో దాచి ఉంచినట్లు
గమనించిన వెన్నెల పూటల్లో మాటలతో
దాటి పోతూ పోతూ వెనక్కి తిరిగి చూసినా ధవళ కాంతి.!!

నీటి అలలపై పడి లేచే కాంతల్లా
తారకలన్నీ తమలపాకుల్లా పాకుతూ
తొలి పొద్దుల పెదాలపై ఉదయించి
ఆకాశమంత ఎరుపు రంగు అయింది!!!

అతి సుకుమార పూల తీగ నడుముకు
మల్లెపువ్వు ఒకటి పూసింది
కుడి ఎడమలు రెండు ఒక్కటై వాటేసుకుంటే
కొంటె పిల్ల కొంగు తగిలి
పందిరంతా పరుచుకున్నది మెల్లిగా
రాత్రంతా కరిగిన పునుగు లేక
మల్లెతీగ ఉలిక్కిపడింది పల్లె పిలుపుకు!!!

పరుయుడుతున్న వాగు వంపు
కాగితపు పడవలో పరువపు అక్షరాలు అన్ని
వెల్లకిలా పడుకుని ఆకాశాన్ని చూస్తే
నీకోసం నీరు కురిపిస్తా కాస్త
కూర్చుని పడవను నడిపించుకుపో అందేమో
అక్షరాలను సముద్రం ముద్దించుకొని
మేఘాల పైకి లేఖల్లా రాసి పంపింది.!!!

మెల్లిగా ఎగిరిపోతున్న నీటి పక్షులు
సముద్రమంతా తిరిగి
నదులుగా మారాలని మనసు మార్చుకున్నాయి.!!

ఎటుచూసినా నీ చిరునామే
గమ్యం గాలే నీరే నీ ఇల్లు
వెలుగే నీ దారి జాబిల్లే నీ కళ్ళు!!!!!

నీవు దిగిన చోటే పూల తోట
నీవు పంపిన సందేశమే సుగంధం
అదే చందమామతో మా అనుబంధం!!!

ఇస్రో చంద్రయాన్ -3 స్ఫూర్తితో

Pratapkoutilya lecturer in Biom-Chem palem nagarkurnool dist 🙏
8309529273
కామెంట్‌లు