సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -230
లోహ కపాల న్యాయము
*****
లోహము అంటే ఎఱ్ఱనిది,రాగిది,ఇనుపది, ఉక్కు, బంగారము, నెత్తురు, ఆయుధము,గాలము, ఎఱ్ఱ మేక అనే అర్థాలు ఉన్నాయి.కపాలము అంటే తలపుఱ్ఱె, గుంపు, గిన్నె,యాచకుని భిక్షాపాత్రము,మూత,గ్రుడ్డు యొక్క పై చిప్ప అనే అర్థాలు ఉన్నాయి.
 లోహ కపాలములోహపు పాత్రల వలె అభేద్యము/భేదింప లేనిది అనీ, త్వరగా  మార్చలేనిదని అర్థం.
పురోడాశకపాలములకు అంటే  పిండివంటలు/ వంటలు చేయడానికి అనువైన పాత్రలు నూతన మృత్కపాలములే అంటే మట్టితో  చేసిన పాత్రలే యోగ్యమైనవని శాస్త్రంలో చెప్పబడినది కానీ లోహ కపాలములు కావు.కావున లోహ కపాలములు అవిహితములు, అయోగ్యములు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
(పురోడాశము అంటే యథార్థమైన అపూపము/ పిండివంట,వేల్వ బడినది/అగ్ని యందు కాల్చబడినది అని అర్థం.)
లోహ పాత్రలు అభేద్యమైనవి అంటే అవి చాలా గట్టిగా, దృఢంగా ఉండి అంత తొందరగా మార్చడానికి వీలు వుండదు.ఇవి కాఠిన్యానికి చిహ్నంగా చెప్పబడినవి. వాటిని మార్చాలంటే కష్టం.
అంతే కాదు వంటల విషయానికి వస్తే కూడా లోహపాత్రల్లో  వంట అనారోగ్యమనీ,మన వంట చేసే పదార్థాలతో చర్య నొందటం వల్ల శరీరానికి హాని కలుగుతుందని ఋజువు చేయబడింది.
ఒక విధంగా మూర్ఖులను  ఈ లోహ పాత్రలతో పోల్చవచ్చు. లోహపు పాత్రలు అంత తొందరగా మార్చడానికి వీలు పడనట్లే మూర్ఖులను అంత తొందరగా మార్చలేము.
ఇక మట్టి పాత్రల విషయానికి వస్తే.. ఒకప్పుడు ఏ వంటలు చేసినా మట్టి పాత్రల్లోనే చేసేవారు.అవే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పూర్వీకులు నమ్మేవారు.అది అక్షర సత్యం అని తెలిసింది కూడా.
మట్టి పాత్రల తయారీలో హానికరమైన రసాయనాల వాడకం ఉండదు.వీటిలో చేసిన వంటల్లో రుచితో పాటు పోషకాలు కూడా బయటికి పోకుండా ఉంటాయనీ,నూనె కూడా ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం రాదు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని  నిరూపించబడింది.అంతే కాదు మన వాళ్ళు పెరుగు తయారీకి ఎక్కువగా మట్టి కుండలనే ఎక్కువగా ఉపయోగించడం చాలా మందికి తెలుసు.ఇక వేసవి కాలంలో మట్టి కుండలు పోషించే పాత్ర ఎంత గొప్పదో అలాగే కుండలలో చల్లబడిన నీళ్ళు కూడా ఫ్రిజ్లో నీళ్ళకంటే ఎంతో ఆరోగ్యమని మనందరికీ తెలిసిందే.
ఇక దైవ, వివాహాది శుభకార్యాలకు  మొట్టమొదట మట్టి పాత్రలకే ప్రాధాన్యత ఇస్తారు. మట్టి పాత్ర మానవ శరీరానికి ప్రతీకగా భావిస్తారు.మట్టి పాత్రల్లో విత్తనాలు వేసి మొలకెత్తించడం అంటే మనలోని జీవాత్మను వికసింప జేసి వృద్ధి పొందుతూ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడం అనే అంతరార్థం ఇందులో ఇమిడి ఉంది.
 అలా లోహ కపాలము లాంటి మనస్తత్వాన్ని వీడి మృత్కపాలము వంటి మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి అనేది ఈ న్యాయము ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు