నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

  భస్మాసుర హస్తం
=============
      మంచి పనులు చేసేవారికి వరాలు, చెడుపనులు చేసేవారికి శాపాలు ఇస్తుంటారు దేవుళ్ళు. ఒక్కొక్కరు దేవుని ఆశీర్వాదంతో మంచి వరమే పొందుతారు. ఆ వరాన్ని మంచికి ఉపయోగిస్తే మంచిదే. అలా కాక చెడుకు ప్రయోగిస్తే అదే శాపంగా మారుతుంది. శివ భక్తుడైన భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని నుండి వరం పొంది.  దాన్ని శాపంగా మార్చుకుని తన నాశనానికి తెచ్చుకున్నాడు. ఈ కథ ఆధారంగా *భస్మాసుర హస్తం* అనే నానుడి వాడుకలోకి వచ్చింది. ఈ నానుడి భాగవత కథ ఆధారంగా  వచ్చింది.
      పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు గొప్ప శివ భక్తుడు. వైష్ణవులను అసహ్యించుకునే వాడు. వారు కనిపిస్తే చంపేయాలన్న కోరిక కలిగేది. అంతేకాదు దేవతలందరిని మట్టు బెట్టాలన్న ఆలోచన కూడా ఉండేది. సులభంగా వారిని చంపటం ఎలా? అని ఆలోచించాడు. ఇందుకై శివుని కోసం  కఠోర తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్ష్యమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. " నేను ఎవరి నెత్తిన చేతులు పెడితే వారు భస్మమై పోవాలి" అనే వరం కోరాడు.  వెనుకా ముందు ఆలోచించకుండా  శివుడు తథాస్తు అన్నాడు.  వరం పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు భస్మాసురుడు. రాక్షస బుద్ధులు ఎక్కడికి పోతాయి. ఎదురుగా ఉన్న శివుడు తల పైనే చేయి పెట్టబోయాడు. శివుడు పారిపోయాడు. వాడు వెంట పడ్డాడు.  తను ఇచ్చిన వరం ఎంత  ప్రమాదకరమైనదో శివుడు గ్రహించాడు.  ఇచ్చిన వరం వెనక్కు తీసుకోవడం కుదరదు కాబట్టి  ఎలాగోలా వాడి నుండి తప్పించుటకుని  బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. జరిగిన విషయం చెప్పాడు. ఎలాగైనా కాపాడమని కోరాడు. ఇలా అయితే దేవతలంతా నశిస్తారని గ్రహించిన బ్రహ్మ  సరే అని ఒప్పుకున్నాడు.
      దేవతలు, రాక్షసులు పాల సముద్రం చిలుకుతున్న సమయంలో మోహినిగా మారిన బ్రహ్మ  భస్మాసురుని వద్దకు వెళ్ళాడు. మోహిని అందానికి ముగ్ధుడైన భస్మాసురుడు తనను పెళ్లిచేసుకోమని అడుగుతాడు. మోహిని సరే అని తనలా నాట్యం చేస్తే తప్పక చేసుకుంటాను అన్నది. నాట్యం ప్రారంభించింది. అలాగే భస్మాసురుడు కూడా నాట్యం చేయసాగాడు. నాట్య భంగిమలో భాగంగా తన నెత్తి మీద చేయి పెట్టుకుంది మోహిని. భస్మాసురుడు కూడా అలాగే తన నెత్తి మీద పెట్టుకున్నాడు. వరం కారణంగా  వెంటనే భస్మం అయ్యాడు. వాడి పీడ వీడింది. దేవతలంతా సంతోషించారు. ఇది భస్మాసురుని కథ.  
     ఈ కథ ఆధారంగా భస్మాసుర హస్తం నానుడి వచ్చింది.  ఎవరి వలనైనా ఎదుటి వారు నష్టపోతున్నప్పుడు  వాడిని గురించి ప్రస్తావించేటప్పుడు  ఈ భస్మాసుర హస్తం నానుడి ప్రయోగిస్తారు.
కామెంట్‌లు