నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు
 ఏకలవ్య శిష్యుడు
     గురువు లేకుండా, ఎవరో ఒక గురువును మనసులో తలుచుకుని  స్వయం కృషితో విద్యలో విజయం సాధించే వారిని ఏకలవ్య శిష్యుడు అంటారు.  ఒక గొప్ప గురువు దొరకక పోయిన ఆ గురువు రాసిన పుస్తకాలను చదివి గొప్ప విద్యావంతులైన వారు మనకు అనేకమంది తారసపడుతూ వుంటారు.  అలాంటి వారిని కలిసి "మీ గురువు ఎవరు" అని అడిగితే "నేను పలనా వారికి 'ఏకలవ్య శిష్యుడ'ను" అని చెప్పటం మనం వింటూ ఉంటాం. ఆ ఏకలవ్య శిష్యుడు కథ ఏమిటో చూద్దాం. ఈ కథ మహా భారతంలో నుండి  వచ్చింది.
        ఏకలవ్యుడు ఎరుకల రాజు కుమారుడు. ఇతడికి విలువిద్య నేర్చుకోవాలనే కుతూహలం ఉండేది. నేర్పే గురువు కోసం అన్వేషిస్తున్నాడు. అదే సమయంలో  పాండవులకు, కౌరవులకు విద్య నేర్పుతూ ద్రోణాచార్యుడు కనిపించాడు. తనకు కూడా విలు విద్య నేర్పమని అడిగాడు. అందుకు ద్రోణుడు కోపగించుకున్నాడు. తక్కువ కులం వారికి విద్య నేర్పనన్నాడు. ఏకలవ్యుడు కృంగి పోలేదు. తన పట్టుదల వీడలేదు.   బంకమట్టితో  ద్రోణుడి ఆకారం తయారు చేసాడు. ఆ బొమ్మనే గురువుగా భావించాడు. స్వయం కృషితో విలు విద్య నేర్చుకున్నాడు. ద్రోణుడి ప్రియ శిష్యుడు అర్జునుడితో సమానంగా విలు విద్య నేర్చుకున్నాడు. మనసుంటే మార్గం  వుండకపోదు అన్నట్టు  గురువు లేకుండానే  ఏకాగ్రతగా  విద్య నేర్చుకుని ఆదర్శప్రాయుడు అయ్యాడు ఏకలవ్యుడు. 
      మంచి గురువును మనసులో తలచుకుంటూ పట్టువదలక విద్యను నేర్చుకునే వారిని  ఆ గురువుకు ఏకలవ్య శిష్యుడు అనటం  ఈ కథ నుండి వచ్చింది. అదే ఒక నానుడిగా స్థిరపడింది. ఇలాంటి వారు ఇప్పటికి కూడా మన ముందు చాలా మంది ఉన్నారు.  వారిని ఏకలవ్య శిష్యుడుగా ప్రస్తావిస్తూ ఉంటాం.
   

కామెంట్‌లు