సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -229
లోష్ట లగుడ న్యాయము
*****
లోష్టము అంటే మట్టిగడ్డ, ఇనుము, తుప్పు అనే అర్థాలు ఉన్నాయి.లగుడ అంటే కట్టె, కఱ్ఱ, దండము అనే అర్థాలు కలవు.
మట్టి ముద్ద, కఱ్ఱ మాదిరిగా.
కుమ్మరి మట్టిముద్దను కఱ్ఱతో కొట్టి కుండలు తయారు చేస్తాడు.అంటే ఇక్కడ బాధించే వాడు,బాధింపబడే వాడు ఒకే చోట ఉన్నప్పటికీ జరిగేది మేలే అని చెప్పే సందర్భంలో ఈ "లోష్ట లగుడ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 కుండలు తయారు చేసే వృత్తి వున్న వ్యక్తిని కుమ్మరి అంటాం.మనకు ఉపయోగపడే కుండ రూపం దాల్చాలంటే ముందు చాలా తతంగం ఉంటుంది.
కుమ్మరి తాను చెరువు నుండి మేలు రకమైన మట్టిని సేకరించి అందులో రాళ్ళు చెత్త లేకుండా  ఏరి గడ్డలుగా ఉన్న మట్టిని మెత్తగా అయ్యేవరకు కఱ్ఱతో గట్టిగా బాదుతాడు. అలా మెత్తగా అయిన మట్టిని ఓ రోజంతా నానబెట్టి మరుసటి రోజు కాళ్ళతో కసాబిసా తొక్కుతాడు.అలా తొక్కిన మట్టి చపాతీ పిండిలా అవుతుంది.దానిని ముద్దగా చేసి సారె మీద ఉంచి ఆ చక్రం తిప్పుతూ కుండను తయారు చేస్తాడు.
ఇలా మట్టి ముద్ద అందమైన కుండ రూపం ఎత్తాలంటే  కుమ్మరిచేతి కఱ్ఱ దెబ్బలు తినాల్సిందే.
దీనినే మనం శిల్పి,శిలకు  కూడా వర్తింప చేయవచ్చు.శిల అంటే రాయి అని తెలుసు.
 ఓ రాయి అందమైన శిల్పంగా రూపుదిద్దుకోవాలి అంటే శిల్పి చేతిలో ఉన్న ఉలి, సుత్తి దెబ్బలను ఎంతో సహనంతో తినాల్సిందే.అప్పుడే ఆ శిల చూపరులను ఆకట్టుకునే రూపాన్ని పొందుతుంది. ఇక్కడ బాధించినందుకు శిల్పి బాధ పడడు.బాధింపబడినందుకు శిలా/ రాయి బాధ పడదు.
 ఈ విధంగా" లోష్ట లగుడ న్యాయము"  తల్లిదండ్రులు పిల్లలకు, గురు శిష్య బంధానికి కూడా వర్తిస్తుంది.
తల్లి దండ్రులు తమ పిల్లలను సరైన మార్గంలో పెట్టడానికి అవసరమైనప్పుడు దండిస్తూ ఉంటారు.అలా దండించామని తల్లిదండ్రులు,దండింపబడినామనీ పిల్లలూ భావింపరు.
 అలాగే శిష్యులను జ్ఞానవంతులుగా  తయారు చేసేందుకు తన విజ్ఞాన సర్వస్వం విద్యార్థికి అందేలా చేసే సమయంలో    విద్యార్థి దృష్టి  చదువుపై మరల్చేందుకు ఒకో సారి చీవాట్లు వేయడం, చిన్న చిన్న దండనలు కూడా అవసరం అవుతాయి. అది విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే.అది విద్యార్థికి కూడా సమ్మతంగానే ఉంటుంది.
అలా విద్యార్థులు విద్యను అభ్యసించి పరిపూర్ణమైన విజ్ఞానవంతులుగా రూపొందుతారు.
 కాబట్టి ఇక్కడ మనం తెలుసు కోవాల్సిన విషయం ఏమిటంటే  బాధిస్తున్నాడని ఆక్షేపించడం, అయ్యో! బాధింపబడుతున్నాడని బాధ పడటంలో అర్థం లేదు. అక్కడ ఓ తరం,లేదా ఓ వస్తువు రూపుదిద్దుకునే క్రమంలో ఇలాంటివి తప్పవని గ్రహిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు