సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 77వ🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో
======================================
న్యాయాలు -227
లవణామలకీయ న్యాయము
******
లవణము అంటే ఉప్పనిది, ఉప్పు , ఉప్పు సముద్రము,ఒక రాక్షసుడు,ఒక నరకము,సముద్రపుటుప్పు అనే అర్థాలు ఉన్నాయి.ఆమలకము/ ఆమలకి అంటే ఉసిరికాయ లేదా ఉసిరి చెట్టు.
సముద్రపు ఉప్పు అడవిలోని ఉసిరికాయ కలిసినట్లు.
 దీనినే తెలుగులో మనవాళ్ళు "చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్లు" అంటుంటారు.
 సముద్రపు నీటితోనే ఉప్పు తయారవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే.
ఆ ఉప్పు లేనిదే మనం చేసుకునే వంటలకు రుచి రాదు.'అన్నేసి చూడు - నన్నేసి చూడు అంటుందట ఉప్పు.అలాంటి ఉప్పు మనం తయారు చేసుకునే పచ్చళ్ళలో కీలక పాత్ర వహిస్తుంది.ఉప్పు ఏ మాత్రం సరిగా లేకపోయినా ఆ పచ్చడి నిలువ వుండదు.
 అలా అడవిలో పుట్టిన చెట్టు కాయలకు, ఉప్పుకు విడదీయరాని బంధం ఉందని చెబుతారు.
అంతే కాదండోయ్ దీనినే ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించి పెద్దవాళ్ళు ఇలా చెబుతుంటారు.
వివాహాలు స్వర్గంలో జరుగుతాయని ఎవరిని ఎవరికి ముడిపెడతాడో అంతా అక్కడే ముందుగా నిర్ణయం జరిగిపోతుందని చెబుతూనే 'వాళ్ళిద్దరూ  ఉప్పు,ఉసిరి కాయలా కలవడం వింత కదా' అంటుంటారు.
నిజమే అనిపిస్తుంది ఎవరికైనా.అప్పుడు సాంప్రదాయ పద్ధతిలో జరిగిన వివాహమైనా, నేడు ప్రేమించి చేసుకునే పెళ్ళిళ్ళు అయినా ఎక్కడో పుట్టిన అమ్మాయి, మరెక్కడో పుట్టిన అబ్బాయి అలా  కలిసిపోవడం జీవితాంతం ఉప్పు ఉసిరికాయలా అన్యోన్యంగా జీవిస్తూ ఉండటం.
దీనికి సంబంధించి మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు రాసిన సినిమా పాటను  చూద్దామా....
"ఏడుకొండల వాడా వెంకటేశా.... చెట్టుమీద కాయను... సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాసా" అనే పల్లవితో సాగుతుంది.
 అలాగే  సహజ కవి పోతన గారు రాసిన రుక్మిణీ కళ్యాణంలో శ్రీకృష్ణుడు, రుక్మిణిని చేపట్టిన సమయంలో ప్రజలు ఇలా అనుకుంటారు.
"తగు నీ చక్రి విదర్భరాజ సుతకుం;దద్యంబు వైదర్భియుం/దగు నీ చక్రికి;నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱం/ దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా;దర్పహతారాతియై/ మగుడౌ గావుత జక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్"
"ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు,ఎంత మంచి జంటో.. వీరిద్దరిని కూర్చిన బ్రహ్మ దేవుడు కడు సమర్థుడు కదా "అనే అర్థంతో కూడిన ఈ పద్యం ఎక్కడో ఉన్న విదర్భ రాకుమారి రుక్మిణిని,వసుదేవ నందనుడైన శ్రీకృష్ణుడిని కలిపి జంటను చేయడం ఆశ్చర్యం ఆనందం కదా! ఇలా మనసుల,  మనుషుల,వైవాహిక, జీవిత బంధాలు  "లవణా మలకీయ న్యాయము"నకు  సరిగ్గా సరిపోతాయి కదండీ‌!.
ప్రభాత కిరణాల మనస్సులతో 🙏

కామెంట్‌లు