మర్మసక్కర్లు (చిట్టి వ్యాసం)- - డా. గౌరవరాజు సతీష్ కుమార్.
 ముదముతోడ జనులు ముదమార ఓటేసి ముదివగ్గులవుతూ వడలిపోతున్నారు. సీటునందినవారు సిగ్గుఎగ్గులులేక భోక్తలై బొజ్జలు తడుముకుంటున్నారు. పార్లమెంటు నుండి పంచాయతీ వరకు పిచ్చికుక్కలకంటె హీనమై, హోరుతో పోరుచేసి మైకులు విరిచేసి, పోడియమును పొడిచేసి వైరిపక్షాల మట్టికరిపింపజేసిన యోధులండి వీరు.
గడ్డిమేయునొకడు. నీళ్ళుత్రాగునొకడు.
ఫ్యాక్టరీలు రోడ్లు మ్రింగువాడొకడు.
మారణాయుధాలు మాయంచేయునొకడు.
బ్యాంకులోని డబ్బుతో బ్రేవుమను నింకొకడు. మాంత్రికులను, తాంత్రికులను, రౌడీలను, గూండాలను హంతకులను, మాఫియాలను, సారాజులైన ఇష్టులను, మరి ఫ్యాక్షనిష్టులను, "రియల్"ఇష్టులను సాకుతున్నారు ఏలికలు సిగ్గు ఎగ్గులు విడిచి. ప్రతినిధులు ప్రతి"నిధి"ని మింగేస్తున్నారు. ఏ పార్టీ అయితేమి? ఏ నేత అయితేమి? గోతికాడినక్కకు ఏమూలనైతేమి? దేశభక్తి ముసుగులో దేశభుక్తిని ఒనరించుచున్న మానవాధములు. కారు లీడర్లు వీరు. మనపాలి "మర్మసక్కర్లు" కదూ!!!
+++++++++++++++++++++++++
పండితులూ దయచేసి నన్ను క్షమించండి.
ఇక్కడ "మర్మ" అనే సంస్కృత పదమును, "సక్కర్" అనే ఆంగ్ల పదమును కలిపి దుష్టసమాసాన్ని చేశాను. "మర్మసక్కర్లు"అనేపదానికి "రహస్యంగా మన రక్తాన్ని పీల్చేవారు" (మన దేశ సంపదను కాజేసేవారు)అనే భావనతో రాశాను.ఈమాట వాడటంలోని ఔచిత్యాన్ని లేదా అనౌచిత్యాన్ని నాకు తెలుపవలసిందిగా మనవి చేస్తున్నాను. నా తర్వాత రచనలలో మార్చుకుంటాను.
+++++++++++++++++++++++++

కామెంట్‌లు