నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 దృతరాష్ట్ర కౌగిలి
=============
       కొంతమంది మీద  ఏదో ఒక కారణం వల్ల  చాల కోపం  ఉంటుంది. కనిపిస్తే చంపేయాలన్న  కసివుంటుంది. కానీ అది కనిపించ నివ్వకుండా మనసులో దాచుకుంటూ పైకి ప్రేమ నటిస్తు వుంటారు. అవకాశం దొరికితే తన కౌగిలిలో బంధించి నలిపి చంపేయాలి అనుకుంటారు. ఇలాంటిదే ఈ దృతరాష్ట్ర కౌగిలి నానుడి.  ఇది మహా భారతం నుండి ఉద్భవించిన కథ. అదేమిటో చూద్దాం.
    కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు. పుట్టు అంధుడు.  కౌరవ పతనం అంతా కళ్లు లేకపోయిన మనసుతో చూసినవాడు. వంద మంది కుమారులను కురుక్షేత్ర యుద్ధంలో  పోగొట్టుకున్న దురదృష్ట వంతుడు. తన కుమారులు చనిపోవటానికి పాండవులే కారణం అని వారిపై పగ పెంచుకున్నాడు.  ఎలాగైనా వారిని చంపాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు.
     ఈ విషం తెలుసుకున్న అనేక మంది విజ్ఞులు  కోపం కట్టిపెట్టి పాండవులే తన కుమారులుగా భావించి  వారిపై ప్రేమ పెంచుకోమని నీతి వచనాలు చెప్పారు. కౌరవ సేన మరణానికి పాండవులు కాదని,  కౌరవుల దుష్ట పన్నాగమేనని సంజయుడు చెప్పాడు. ఇదంతా విధి ఆడిన నాటకమేనని, కౌరవులు చనిపోలేదని, స్వర్గంలో సర్వ సుఖాలు అనుభవిస్తున్నారని, విదురుడు చెప్పాడు. దేవ సభలో భూదేవి భూభారాన్ని తగ్గించమని మహా విష్ణువును వేడుకున్న అంశానికి పర్యావసానమే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని వేద వ్యాసుడు వివరించాడు. ఎంత మంది ఎన్ని నీతి వచనాలు  వల్లించినా దృతరాష్ట్రుని కోపం చల్లారలేదు. కానీ పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టు నటించాడు. 
      విజయులై వచ్చిన పాండవులు  పెద్ద తండ్రి   ధృతరాష్ట్రుని ఆశీర్వచనాలు కోసం  వెళ్లారు. ఇదే అదునుగా  దుర్యోధనుడిని చంపిన భీముడిని తన కౌగిలో పిండి చేయాలనుకున్నాడు ధృతరాష్ట్రుడు.  ఈ విషయం ముందే గ్రహించిన శ్రీకృష్ణుడు  అచ్చు భీముడులా ఉన్న ఉక్కు విగ్రహాన్ని  ముందే తయారు చేసి ఉంచాడు.  ధృతరాష్ట్రుడు  భీముడిని ఆశీర్వదించటానికి పిలవగానే, భీముని స్థానంలో ఉక్కు విగ్రహాన్ని పెట్టారు. పగతో,కసితో ఉన్న గుడ్డివాడైన  ధృతరాష్ట్రుడు విగ్రహాన్ని భీముడే అనుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు.  ఆ కౌగిలిలో విగ్రహం నుగ్గునుగ్గు అయింది. ఆ స్థానంలో నిజంగా భీముడు వెళ్లి ఉంటే ఎముకలు సున్నం అయ్యేవే.  ఇది కథ.  ఈ కథ నుండే  దృతరాష్ట్ర కౌగిలి అనే నానుడి  స్థిరపడిపోయింది.  ప్రేమగా, లాలనగా  హత్తుకునే  కౌగిలిని అవకాశంగా తీసుకుని కసి,పగ తీర్చుకోవడం కోసం  వినియోగిస్తే  దీన్ని ధృతరాష్ట్ర కౌగిలి అంటారు.
కామెంట్‌లు