సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -213
రథ్యా ప్రవాహ న్యాయము
****
రథ్యా అంటే రథ మార్గము, రాచబాట,రథ సమూహము,పలు మార్గములు కలిసే చోటు. ప్రవాహ అంటే సంఘటనల,పరంపర,వెల్లువ,మడుగు అనే అర్థాలు ఉన్నాయి.
వీథులలో నుండి పారే పిల్ల కాలువలన్నీ ఒకటై యేఱులా ప్రవహించునట్లుగా అనేది సామాన్య అర్థం...
 బిందువు బిందువు కలిస్తేనే  సింధువు అంటే మహా సముద్రం అవుతుంది. అలాగే పైసా పైసా కూడితేనే  పది రూపాయలు పోగు అవుతాయి అనే అర్థంతో  ఈ రథ్యా ప్రవాహ న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అయితే ఒక్కో చినుకు చినుకు కలిసే పిల్ల కాలువల రూపమెత్తాయి.అలా పిల్ల కాలువలు పారుతూ ఒక్కటిగా కలిసి యేరై ఎలా ప్రవహించిందో దాని వలెనే ఈ సృష్టి కూడా అలాగే విస్తరించిందని ఆధ్యాత్మిక చింతన కలవారు ,వేదాలు ఉపనిషత్తులు చదివిన వారు చెప్పారు.ఆ  విషయాలేమిటో చూద్దాం.
నాలుగు వేదములలోని విభిన్న భాగాల నుండి గ్రహించిన మంత్రాలతో మహర్షులు మనుషులకు అందవలసిన అత్యవసర సందేశాలను, ప్రామాణిక అంశాలను అనుసంధానం చేసి తయారు చేసినవే పంచ సూక్తాలని అంటారు.
ఈ పంచ సూక్తాలలో పురుష సూక్తము సృష్టి గురించి చెబుతుంది.ఈ సూక్తంలో  ఆధ్యాత్మికతతో పాటూ వైజ్ఞానికతను,తార్కికతను కూడా జోడించడం  విశేషం.పరమాత్మ అనంతమైన వ్యాపక స్వభావము కలవాడని ఆ పరమాత్మ విశ్వ సృష్టిగా విస్తరించిన విధాన్ని చెప్పిన కింది ఉదాహరణను చూద్దాం. 
నిశ్చలంగా ఉన్న చెరువులో ఏ చిన్న రాయి వేసినా చుట్టూ తరంగాలు ఏర్పడుతాయి.ఈ తరంగాలకు మొదటి స్థానం  రాయి నీటికి తగిలిన బిందువు.ఆ బిందువు తరంగాలుగా వ్యాపకత్వం ఎలా పొందిందో, అలాగే విశ్వ సృష్టి వ్యాపకం ఒకానొక మహా బిందువు కేంద్రంగా జరిగిందని తెలిపారు.
ఇలాంటి పలు విషయాల క్రోడీకరణే ఓ సమగ్రమైన సమాచారం అవుతుందని అవగాహన చేసుకోవాలి.
 చినుకులు కలిసి సింధువు అయినట్లు అలాగే పొదుపు విషయంలో కూడా...పైసా పైసా జాగ్రత్తగా,పొదుపుగా కూడబెడితేనే సంపన్నులం అవుతామని సదా గమనంలో ఉంచుకోవాలి.
ఒక్క పైసా లేదా ఒక్కటే రూపాయి కదా  నిర్లక్ష్యం చేసాం అనుకోండి.ఎక్కడైనా  ఓ వంద రూపాయలు చెల్లించాల్సి వచ్చినప్పుడు ఒక్క రూపాయి తగ్గితే తీసుకుంటారా ... అస్సలు తీసుకోరు కదా...!
 అదే విధంగా దీనిని జ్ఞానానికి కూడా వర్తింప చేసుకోవాలి.బిందువు లాంటి జ్ఞాన సంపాదన మొదలు పెడితే అపారమైన జ్ఞాన సాగరంగా మారుతామని గ్రహించాలి .ఈ "రథ్యా ప్రవాహ న్యాయము"ను ఈ విధంగా మన జీవితానికి అన్వయించుకోవాలి ఆర్థిక పరమైన సంపన్నులమే కాకుండా జ్ఞాన సంపన్నులం కూడా కాగలం. ఏమంటారు?.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు