సుప్రభాత కవిత ; - బృంద
కనకవేదిక మీద కచేరీగా
మయూఖ తంత్రుల పైన
తొలిసంధ్యారాగం పాడే
అపరంజి వెలుగులకు....

మనసులోని మర్మమంతా
తెలుసుకొని తెరిపినిచ్చే
కరుణ నిండిన స్పర్శతో
కనికరించే కలిమికి

ఎదలోతున దాగి ఉన్న
ఎన్నెన్నో గాధలను
గురుతు తెచ్చి మురిపించే
గుండెనింపే  పండుగకు....

చెలిమి పండి పంచిన
నెత్తావిమాధురులు
కొమ్మలుగా విస్తరించి
మనసంతా నింపిన హాయికి

అనుభూతుల పరిష్వంగంలో
అమృతంగా మారిన అంతరంగం
అనుభవించే  ఆనందపు
అద్భుతమైన అనుభవాలకు

ఎన్నడు ఎరుగని కలలన్నీ
కన్నులముందర నిలబెట్టి
కుంభవృష్టిగా కరుణను
గుమ్మరించే ప్రత్యక్ష దైవానికి...

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు