రామబాణం
=========
తిరుగులేని అస్త్రం అనే అర్థం చూచించటానికి రామబాణం అనే నానుడి వాడడం రివాజు. అతని మాట 'రామబాణం' అని అంటూ ఉంటారు. అంటే అతను చెప్పే మాట తిరుగులేనిది అని, వెనక్కు తీసుకోవటానికి వీలులేనది అని అర్ధం. ఈ రామబాణం అనే నానుడి రామాయణం కథ నుండి వచ్చిందని వేరే చెప్పనవసరం లేదు.
రాముడు సీత జాడ తెలుసుకుంటాడు. లంకలో ఉందని హనుమంతుడు స్వయంగా చూసి వచ్చి చెపుతాడు. లంకలోకి వెళ్లాలంటే సముద్రంలో నుండి వెళ్ళాలి. సముద్రం దాటడం ఎలా? అదే ఇప్పుడు రాముని మదిలో ఉన్న పెద్ద సమస్య. వెంటనే రాముడు దారి ఇవ్వమని సముద్రుడిని బ్రతిమిలాడి అడుగుతాడు. "ఇది లోక విరుద్ధం. సముద్రం సముద్రం లానే ఉండాలి, దారి ఇవ్వవడం సాధ్యం కాదు" అని శ్రీరామునికే నీతులు చెప్పాడు సముద్రుడు. సముద్రుడు ఎవరో కాదు. రఘువంశపు వాడే. రామునికి పూర్వీకుడు. సగరుని అరవై వేల మంది సంతానమే సముద్రం. రామునికి కోపం వచ్చింది. "నీవు నీలా ఉండాలంటే కుదరదు. అవసరాన్ని బట్టి మార్పు చెందాలి. పరోపకారి వైన నీవే ఇలా అంటే ఎలా? మార్గం ఏర్పాటు చేయి? అన్నాడు రాముడు. సముద్రుడు కుదరదంటే కుదరదు అన్నాడు. ఇక లాభం లేదని రాముడు రామబాణం తీసి సముద్రుని వైపు ఎక్కుపెట్టాడు. ప్రకృతి ప్రళయ ఘర్జన చేసింది. సూర్యచంద్రులు లయ తప్పారు. భూగోళం గడగడా వణక సాగింది. సముద్రుడికి ముచ్చెమటలు పట్టాయి. సముద్రుడు రాముడి పాదాల వద్ద సాగిల పడ్డాడు. "అయ్యా నీ బాణం తగిలితే నేను పూర్తిగా భస్మం అవుతాను. చుక్క నీరు లేకుండా ఎండిపోతాను. ఇసుక రేణువులులాగా మిగిలి పోతాను. నీ బాణానికి ఉన్న శక్తి ఎరుగక విచక్షణ రహితంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. మీ వానర సేనలో నలుడు అనే విశ్వకర్మ పుత్రుడు వున్నాడు. అతడిచే నాపై వారధి నిర్మించండి" అని సలహా ఇచ్చాడు. రాముడు శాంతించాడు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఎక్కుపెట్టిన బాణం వృధాకారదు. దాన్ని ఏమిచెయ్యాలి? ఆలోచిస్తూ ఉండగా సముద్రుడు అందుకుని "అయ్యా! శ్రీరామా!! తూర్పువైపున పాపాత్ములు, లోకకంఠకులు వున్నారు. వారిని సంహరించండి" అన్నాడు. అలా తన రామబాణంతో లోక విరోధులను చంపాడు.
ఇప్పుడు తెలిసిందికదా రామబాణం శక్తి. దాన్ని ప్రయోగిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో? అందుకే రామబాణం నానుడి కూడా ఇలాంటి సందర్భాలలోనే వాడతారు. ఎక్కుపెట్టనే కూడదు. ఎక్కుపెడితే ఏదో ఒక అనర్ధం తప్పదు అనే అర్ధంతో ఈ నానుడిని ఉపయోగిస్తూ ఉంటారు.
నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి