మేఘసందేశం కావ్యం;-:సి.హెచ్.ప్రతాప్

 భారతదేశంలో పుట్టిన వారెవరైనా తమ జీవితంలో మేఘసందేశం అనే కావ్యం పేరు విననివారు వుండరు. విరహ శృంగార రస ప్రధానమైనది మేఘసందేశం. సందేశ కావ్యం అనగానే వెంటనే మదిలో మెదిలే మహనీయ కావ్యం కాళిదాస మహాకవి మేఘసందేశం. ఇది మొత్తం రెండు సర్గల కావ్యం గా రచించబడింది.మొదటి దాంట్లో 67 శ్లోకాలు ఉంటే రెండో దాంట్లో 57 ఉంటాయి.అంటే మొత్తం 124 శ్లోకాల కావ్యం అన్నమాట. మేఘ సందేశం మొట్ట మొదటి ‘ఖండ కావ్యం‘. ఒక కథతో సంబంధం లేకుండా ఏదో ఒక భాగాన్ని లేదా ఘట్టాన్ని తీసుకుని వివరించడమే ఖండ కావ్య లక్షణం. కావ్యం అంతా ఒకటే వృత్తం- మందాక్రాంత అన్నది సాహిత్య విశ్లేషకుల అభిప్రాయం. ఈ కావ్యం ఎంతసుప్రసిద్ధమైనది అంటే భారత దేశంలో పుట్టినందుకు పోయేలోపు ఒక్క కావ్యమన్నా చదివి ఆస్వాదించాలనే తృప్తికోసమైనా ఈ మేఘసందేశం చదివి తీరాలి అన్నవారు లేకపోలేదు. కూబేరుని శాపం వల్ల భార్యకు దూరమైన ఒక యక్షుడు
మేఘంతో చేసే తన విరహ సంభాషణే ఈ కావ్య వస్తువు.. మేఘసందేశ కావ్య కథ క్లుప్తంగా ఇది. పూర్వసర్గ, ఉత్తరసర్గ అని రెండు సర్గలుగా సాగిన ఈ కావ్యంలో, కుబేరుడు యక్షగణానికి రాజు. ఆయన వద్ద ఉన్న ఓ యక్షుడు ఉద్యోగధర్మ నిర్వహణలో చిన్న తప్పిదం చేశాడు. కుబేరుడు కోపించి ఒక సంవత్సర కాలం ఇల్లు విడిచి వెళ్ళాలని శాపం ఇచ్చాడు. ఆ యక్షుడు రామగిరి అనే ప్రాంతంలో నివాసం ఉన్నాడు. ఎనిమిది నెలలు అతిభారంగా గడిచిపోయాయి. ఆషాఢమాసం వచ్చింది. ఒకనాడు యక్షుడు తన భార్యను తలుచుకొని దు:ఖిస్తూ మేఘని చూసి, ఆ మేఘుడిని తగిన విధంగా సంభావించి తన భార్యకు సందేశాన్ని వినిపించ వలసినదిగా కోరాడు.
కామెంట్‌లు