నానుడి కథలు ౼దార్ల బుజ్జిబాబు
 మొసలి కన్నీరు
        మనసులో  సంతోషంగా ఉన్నా,  బయటకు దుఃఖం నటిస్తూ కపటంగా కన్నీరు కారిస్తే అలాంటి కన్నీరును  మొసలి కన్నీరు అంటారు. వాడంటే వీడికి పడదు అని ఎందరికి తెలుసు, వాడు కనిపిస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు. కానీ వాడికి ఆపద వస్తే వెళ్లి పరామర్శించి, లోపల ఆనందగా వున్నా, బయటకు ఓదార్చుతూ   నీతి వాక్యాలు చెబుతూ, కన్నీరు పెట్టుకుంటూ నటిస్తూ ఉంటాడు.  ఇలాంటి వాడిని  *మొసలి కన్నీరు* కారుస్తున్నాడు అంటారు. మొసలి కన్నీరు అనే ఈ నానుడి  పంచతంత్ర కథల నుండి వచ్చింది.
      ఇది బహుళ ప్రజాదరణ పొందిన కథ.  ఒక నది ఉంటుంది. ఆ నది గట్టున ఓ నేరేడు చెట్టు ఉంటుంది.  నదిలో  మొసలి దంపతులు కాపురం ఉంటున్నాయి. గట్టుపైన ఉన్న నేరేడు చెట్టుపైన    ఓ కోతి నివాసం ఉంటుంది. కోతికి మగ మొసలికి మంచి స్నేహం కుదిరింది.  రాలి పడిన నేరేడు పండ్లు తినటం కోసం మగ మొసలి నది గట్టుకు వచ్చేది. చెట్టు పైన  ఉన్న కోతి పండ్లను రాల్చేది.  మొసలి  తిన్నన్ని తిని  కొన్ని పండ్లను తన భార్యకు తీసుకు వెళ్ళేది. అది కూడా కమ్మగా తినేది. 
     ఒకరోజు పండ్లను తింటూ "ఇన్ని పండ్లు ఎక్కడ దొరుకుతున్నాయి" అడిగింది ఆడ మొసలి భర్త మొసలిని. కోతి విషయం చెప్పింది భర్త మొసలి. భార్య మొసలికి మనసులో దుర్భుద్ధి పుట్టింది. నేరుడు పండ్లే ఇంత కమ్మగా ఉన్నాయి. ప్రతి రోజు ఎన్నో పండ్లు తినే కోతి గుండెకాయ ఇంకెంత కమ్మగా ఉంటుందో అని మనసులో అనుకుంది. వెంటనే కోతి గుండెకాయపై మనసు పడింది.  ఓ రోజు భర్త వచ్చే సమయానికి ముసుగు తన్ని పడుకుంది ఆడ మొసలి.   తనకు చచ్చిపోయేటంత జబ్బు వచ్చిందని, బ్రతకాలంటే కోతి గుండెకాయను తినాలని వైద్యుడు చెప్పాడని కన్నీరు కారుస్తూ భర్తతో చెప్పింది. ఇది నిజంగా  బ్రతుకు భయంతో వచ్చిన కన్నీరు కాదు. కపటంతో, కోతిని చంపి దాని గుండెకాయను తినాలని దుర్భుద్ధితో వచ్చిన కన్నీరు. ఇది నిజమే అని నమ్మింది మొగుడు మొసలి. కోతి వద్దకు వెళ్ళింది. ఇంటికి ఆహ్వానించింది. మార్గ మధ్యలో అసలు విషయం చెప్పింది. కోతి తన తెలివితో ఎలాగో తప్పించుకుంది. ఇది కథ. 
     భార్య మొసలి కార్చిన కపట కన్నీరు నుండి మనం చెప్పుకుంటున్న మొసలి కన్నీరు నానుడి వాడుకలోకి వచ్చింది. ఇలాంటి వారు మన సమాజంలో చాలా మంది ఉంటారు. మేలు చేసిన వారికి కీడు చేయాలనే తలంపుతో కపటంగా ప్రవర్తిస్తారు. నటిస్తూ కన్నీరు కారుస్తూ వుంటారు. ఇదంతా చూసేవారికి నటన అని తెలుస్తూనే ఉంటుంది. ఇలాంటి వారిని 'మొసలి కన్నీరు' కారుస్తున్నారు అని అసహ్యించుకుంటు వుంటారు★

కామెంట్‌లు