నానుడి కథలు ౼ డా.దార్ల బుజ్జిబాబు

 భీష్మ ప్రతిజ్ఞ
===========
     కఠినమైన నిర్ణయం తీసుకుని దాన్ని అందరి ఎదుట హృదయ పూర్వకంగా  వెల్లడి చేస్తే  దాన్ని ప్రతిజ్ఞ అంటాం.   పాఠశాలలో కూడా ఉదయం ప్రేయర్లో  'భారత దేశం నా మాతృభూమి బారతీయులందరు నా సహోదరులు' అని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం.  మనం తీసుకున్న నిర్ణయంపై కట్టుబడి వుండటానికి హృదయంలో ఆమోదించుకోవడమే ప్రతిజ్ఞ. న్యాయస్థానంలో కూడా ముద్దాయిలు "అంతా నిజమే చెబుతాను" అని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. అలాగే మహా భారతం కథలో కూడా భీష్ముడు ఓ ప్రతిజ్ఞ చేస్తాడు. దాని నుండే భీష్మ ప్రతిజ్ఞ అనే నానుడి వెలుగు చూసింది.
    శంతనుడు ఓ రాజు. ఒకరోజున గంగా నదీ తీరంలో విహరిస్తున్న సమయంలో ఓ అందాల రాశి. కనిపించింది. ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆ అపురూప సందర్యరాశిని పెండ్లాడ దలిచాడు. మనసులో కోరిక చెప్పాడు.  వెంటనే  పెళ్లాడాడు. ఆమె ఎవరో కాదు గంగాదేవి. వీరికి పుట్టిన సంతానమే భీష్ముడు. ఇతడి అసలు పేరు  సత్యవ్రతుడు. ఇతడు పుట్టిన వెంటనే  తల్లి గంగా దేవి తండ్రిని వదలి వెళ్ళిపోయింది. కొన్నాళ్లకు తండ్రి శంతనుడు మళ్లీ పెళ్లి చేసుకోదలచాడు. ఒకనాడు యమునా తీరాన విహారం చేస్తూ ఓ కన్యను చూసాడు. ఆమె దశరాజు కుమార్తె సత్యవతి. ఆమెపై మనసు పడ్డాడు. పెళ్లాడాలనుకున్నాడు. దశరాజు వద్దకు వెళ్లి  తన కోరిక వెల్లడించాడు. తనకుమార్తెకు పుట్టిన కుమారుడినే రాజును చేయాలనే షరతు విధించాడు దశరాజు. భీష్మునిపై అమితమైన ప్రేమ ఉన్న శంతనుడు ఆ షరతుకు అంగీకరించలేదు.  ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు, దశరాజు వద్దకు వెళ్లి తనకు రాజ్యం అక్కరలేదని,  సత్యవతికి పుట్టిన సంతానానికే  రాజ్యభారం కట్టబెడతానన్నాడు. "నీవుసరే, నీకు  పెళ్లై సంతానం కలిగిన  తరువాత నీ కుమారులు ఎదురు తిరిగితే" అడిగాడు రాజు.  "అసలు నేను పెళ్లే చేసుకోను.  జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని పెద్దలు అందరి ఎదుట ప్రమాణం చేసాడు. దీన్నే  భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఆ తరువాత సత్యవతితో శంతనుడి వివాహం జరిగింది. ప్రతిజ్ఞ ప్రకారం భీష్ముడు చనిపోయేవరకు  వివాహం చేసుకోలేదు.
   ఇలా పరోపకారం కోసం గట్టిగా నిర్ణయం తీసుకుని భీషణమైన ప్రతిజ్ఞ  చేవారిని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాడు అనటం నానుడిగా స్థిరపడిపోయింది.
కామెంట్‌లు