సుప్రభాత కవిత ; -బృంద
గుండెలో మోగిన
సిరిమువ్వల సవ్వడిలా
నింగినంత  ప్రకాశంగా
విరిసిన మెరిసే రంగులు

జలదాల పరదాల
జిలుగుల తప్పించుకుని
నెమ్మదిగ  గుమ్మాన
కనిపించే ఆప్తుడిలా

కనులపంటగ వెలిగే
మనుగడ నడిపే 
ఇనుడి ప్రభల కాంతులు
వినువీధిని ప్రసరింప

జలతారు సిరులన్ని
జలసిరి తనలో దాచి
జలజలా సాగుతూ
జపమేదో చేస్తుంటే

ఒడ్డున  విరిసిన
రెల్లు పువ్వు వయ్యారంగా
ఊగుతూ చేతులూపి
తనవైపు చూడమని పిలుస్తుంటే

నెమ్మదిగ గగనాన
కమ్మని వెలుగులు నింపి
అవనికి ఆమనిలా వచ్చి
అనుదినము పండుగ చేసే

కమలప్రియుని చరణాలకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు