కొన్ని చూపుల్ని కత్తిరించాలి
కొన్ని చూపులకు రెప్పల్ని మూసివేయాలి!!
నదుల్లా పారుతున్న చూపులకి
ఆనకట్టలు కట్టాలి
ఒకదానికొకటి ఢీకొనే చూపుల మధ్య
స్నేహము ఉండాలి ప్రేమ ఉండాలి!!
కన్నీళ్లను మోసుకెళ్లే చూపులకి
భరోసా ఇవ్వాలి
మండే చూపుల్ని మంచి మనసుతో
మంచు గా మార్చాలి!!
ఎగతాళి చేసి నవ్వే చూపులను
పలకరించకూడదు
పులకరించి పోవాలి!!!
కలబడే చూపులకు క్షణం నిలబడి
మనం ఇచ్చే సమాధానం
మౌనం అయ్యి ఉండాలి!!!
అయస్కాంతంలో ఆకర్షించే చూపుల
మధ్య ధ్రువాలను మార్చాలి!!
భూగోళంలా తిరిగే చూపులను
ఆత్మీయంగా కౌగిలించుకోవాలి!!
మొత్తంగా చూపులు
ఇంద్రధనస్సు లా ఉండాలి
కిరణంలా ఏడు రంగులు కలిసి ఉండాలి
కానీ తెల్లని పావురంలా
తెలుపై తెలిసి ఉండాలి!!
లోకుల్లా అరిచే కాకుల్లా కాకుండా
లోకాల్ని సముద్రాలను చుట్టి వచ్చి
ఆకాశంలో ఎగిరే పక్షుల్లా ఉండే
చూపుల్ని ఎన్నుకోవాలి!!!
బరువైన గుండెల్లో ఎర్రని రక్తపు మేఘాల్లా
వర్షించే చూపుల్ని ప్రేమించాలి!!!
చీకట్లను చీల్చుకుని వచ్చే చూపులకు
చెమట చుక్కల్ని ముత్యాలుగా మార్చే
అనుభవం ఉంటుందని తెలుసుకోవాలి!!
వెలుగు పూలు పూసే తోటల్లో
నలుగురి చిరునవ్వులై వెలిగే చూపుల్ని
మనసారా ఆహ్వానించాలి!!!!
ఇద్దరి మధ్య ముద్దుగా ఉండే
ఒక పద్ధతి చూపుల్ని మనసారా ముద్దాడాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి