సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -410
అనువృత్తి న్యాయము
*****
అనువృత్తి అనగా అంగీకారము, విధేయత,మరల మరల చెప్పుట, ఆవృత్తికి రూపాంతరం.
పూర్వ సూత్రం నుండి కొన్ని పదములు అర్థవివరణమునకై ఉత్తర సూత్రంలోనికి తీసుకొనిపోవుటను అనువృత్తి అంటారు.వ్యాకరణాది సూత్రముల యందు అనువృత్తి అనేది స్పష్టంగా కనబడుతుంది.
 స్వప్రయోజనాల సాధనమునకు పూర్వము మరియు పూర్వాంశములను నాశ్రయించడమనేది ఈ న్యాయములో కనిపిస్తుంది.అనగా ఏదైనా సాధించాలంటే గత అనుభవాలను పరిగణనలోకి  తీసుకోవాలి.అలా తీసుకోవడానికి ఈ సూత్రము ఎంతో ఉపయుక్తమైనది.
 అనువృత్తి  అనేది ఆవృత్తికి రూపాంతరము.ఆవృతి అనగా నిర్దిష్ట విషయమును మరల మరల చెప్పుట  అనగా వల్లె వేయుట.అలా చెప్పడం లేదా వల్లె వేయడం వలన పూర్వ విషయం సుదృఢమవుతుంది.
 ఏదైనా విషయాన్ని పూర్తిస్థాయిలో అవగాహన కలిగించడానికి  కొన్ని ఉదాహరణలు,గత అనుభవాలను చెబుతూ ఉంటారు.
అలా పదే పదే చెప్పడం వల్ల అది ఎదుటి వారి మనసులో పూర్తిగా నాటుకుపోతుంది. వాటిని   తాము చేయబోయే పనులకు అన్వయించుకొని తద్వారా  లాభనష్టాలు బేరీజు వేసుకోగలుగుతారు.
గురువులు తమ శిష్యులకు చెప్పేవి ఎక్కువగా జీవితానుభవాలకు సంబంధించినవే ఉంటాయి. అందుకే చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినమని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు.ఎందుకంటే శిష్యుడి  జీవితం మీద దృష్టి పెట్టి నేను అనే భావనను కలిగిస్తూ భవిష్యత్తు దిశగా నడిపిస్తారు.
ఇలా బాల్యం, కౌమారం, యవ్వనం,వృద్ధాప్యం అనే వాటిని  వ్యావృత్తులు అంటారు. వ్యావృత్తులు అంటే మరేం లేదు మనం పొందే అవస్థలు. ఇవి మొదటి నుంచి చివరి వరకు ఒకేలా వుండవు. ఒక్కో అవస్థ నుంచి మరో అవస్థకు మారుతూ వుంటాయి. అలా అవస్థలలో మార్పు వచ్చినా గురువు చెప్పిన నేను అనే అనువృత్తిని గమనించాలి.జీవితంలో వివిధ దశల్లోకి మారినా 'నేను' అనేది మారకపోవడానికి కారణం అనువృత్తంగా ఉన్నటువంటి చైతన్యం వల్లనే అంటారు.
వివిధ దశలను కాదు చూసేది నిరంతర ప్రయాణంలో 'నేను' అనే అనువృత్తిని చూడమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు.చైతన్యం వల్లనే నేను అనేది ఎప్పటికీ స్పురణకు వస్తుందన్న మాట.
 నిత్య జీవితంలో చేసే వివిధ పనుల లాభనష్టాల గురించి ఆలోచించేందుకు, వ్యాకణాది అంశాలకు, ఆధ్యాత్మిక పరంగా నేను అనే స్పురణకు ఉపయోగపడుతుందని ఈ *అనువృత్తి న్యాయము "ద్వారా మనం తెలుసుకోగలిగాం.
 దీనిని బట్టి మన ఎరుకను అనగా నేనును స్పురణకు తెచ్చుకుంటూ ఈ నేనుతో సమాజానికి ఎలాంటి మేలు చేయాలో ఆలోచించి, ఆ మేలు సమాజానికి అందేలా చూద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం