గోవా-2;- ప్రమోద్ ఆవంచ

 ప్రతాప్ నన్ను కండోలిమ్ బీచ్ దగ్గర దింపాడు.నేను మెల్లగా అడుగులు వేసుకుంటూ బీచ్ లోపలికి వెళ్ళాను.
దారికిరువైపులా షాపులు, రకరకాల వస్తువులు అమ్ముతున్నారు.వాటినన్నింటిని దాటుకుంటూ బీచ్ లోకి 
ఎంటర్ అయ్యాను.ఆకాశం మేఘావృతమై ఏ క్షణమైనా 
మేఘం గర్భాన్ని చీల్చుకుని వర్షం చినుకుల సవ్వడితో 
నన్ను తడిపేందుకు సిద్ధంగా ఉంది.అహ్లాదకరమైన దృశ్యం.చల్లగా వీచే గాలి.శరీరం చల్లని  గాల్లో తేలుతూ ఉంది.ఇంతకన్నా ప్రశాంతత  మనసుకు వేరొకటి ఉంటుందా...నడుస్తున్నాను,నాపక్క 
నుంచి నలుగురు యువకులు తెలుగులో మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ వెళుతున్నారు.వాళ్ళ వైపు పలకరింపు నవ్వొకటి విసిరి,అలాగే నడుచుకుంటూ 
బీచ్ లోకి వెళ్ళాను.సాహిర్ చెప్పినట్లుగా అక్కడ చాలా తక్కువ మంది పర్యాటకులు ఉన్నారు.వాళ్ళు కడలిని 
కెమెరాలో బంధించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
అది సాధ్యమా.. నేను వాళ్ళకు దూరంగా,ఒడ్డున కొంత 
దూరం నడుస్తున్నాను.అలలు ప్రతి నిమిషం నా కాళ్ళను ముద్దాడుతూనే ఉన్నాయి.ఒక్కొక్కసారి అల ఉదృతి 
ప్రేమతో నా కాళ్ళను,నన్నూ తనతో లాక్కెళ్ళేందుకు ప్రయత్నిస్తుంది.అదొక అందమైన అనుభూతి.ఇసుకపై నా 
పాదాల అడుగులు ఒరిస్సా పట్నాయక్ రూపొందించే
సైంతిక బొమ్మ రూపంలో ఉన్నాయి.వెనక్కి ఒక్కసారి 
చూస్తే నేను నడిచిన అడుగుల పాదాలను అల తనలో 
కలుపుకుంటుంది.నా మనసుతో మాట్లాడేందుకు అంగీకారం తెలిపినట్లుంది.నన్ను భరించడానికి,నా పిచ్చి సోదిని వినడానికి ఒప్పుకున్నట్లుంది.కొంచెం దూరం వెళ్ళి ఒడ్డున కూర్చున్నాను.తన అంగీకారాన్ని వ్యక్తపరుస్తూ
దూరం నుంచి ఒక అల చాలా ఉత్సాహంగా నన్ను 
చేరింది.అంతే వేగంగా వెనుదిరిగింది.వెళుతూ వెళుతూ 
నువ్వు మాట్లాడుతుంటే నీ బాధని మద్య మద్యలో 
వెనక్కి వెళ్ళి కడలి లోతుల్లోకి వెళ్లి ఆక్కడికి చేరవేస్తా.
నీ మస్తిష్కంలో ప్రవహించే లక్షల ఆలోచనలు క్షణ క్షణానికి 
మారిపోతుంటాయి.వాటికి రూపం ఉండదు.క్షణం కిత్రం ఉన్న ఆలోచన మరో క్షణంలో మాయమవుతుంది.
సముద్రం నీ సమస్యలకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది భయపడకు అని చెప్పింది.కొద్దిసేపు వరకు 
ఏ అలా నా దరికి చేరలేదు.ఆ క్షణం నా మస్తిష్కం కొద్దిసేపు స్తంభించింది, కళ్ళు తెరుచుకొనే ఉన్నాయి.
సముద్రాన్ని చూస్తూనే ఉన్నాయి.ఎలాంటి కదలిక లేదు.
వెనక్కి పెట్టిన నా చేతులు ఇసుకలోకి దూసుకుపోయాయి 
అంతలోనే ఏదో తడి..నీళ్ళ తాలూకు నురుగు,నా కాళ్ళను తాకింది...అంతే ప్రస్తుతంలోకి వచ్చాను.
మస్తిష్కం పనిచేయడం ప్రారంభించింది.చేతులను చాలా 
సేపు వెనక్కి పెట్టాను కదా అందుకే తిమ్మిర్లు ఎక్కాయి.
చేతులను ఇసుకలో నుంచి బయటకు తీసాను.ఆ స్థలంలో నా చేతులకు సంబంధించిన అచ్చులు చాలా 
లోతులో దిగబడినట్లుగా కనిపించాయి.ఏమయింది
ఎక్కడ విహరిస్తున్నావు ఈ ప్రపంచంలో లేవా అంది అల.
పరిక్షగా చూసాను...అల చాలా ఉత్సాహంగా ఉంది.ఒక గుంపుగా పరుగులు తీస్తూ వచ్చి నన్ను తాకి...నువ్వంటే ఇష్టం అంటూ నవ్వుతూ, కవ్విస్తూ వెనక్కి తిరిగి వెళుతుంది.లేచి పట్టుకోవడానికి 
ప్రయత్నం చేసాను.వెంట పరిగెత్తాను.అందుకోలేక
పోయాను.కొద్ది దూరం లోతుల్లోకి వెళ్ళాను.పట్టుకున్నాను
అని భ్రమ పడ్డాను.పిడికిలి విప్పి చూసాను.అంతా
శూన్యం.తడిగా ఉన్న ఖాళీ చేతులతో ఒడ్డుకు చేరాను.
నిరాశ నన్ను ఆవహించింది.ఏదో ఒంటరితనం నన్ను 
వెంటాడుతూనే ఉంది.కళ్ళు సముద్రం లోతుల్లో వెతుకుతున్నాయి.ఉన్నట్లుండి ఒక ఉరుము ఉరిమింది 
ఆకాశం వైపుకు తలెత్తి చూసాను.చినుకు కింది పెదవిని 
తాకి కిందికి జారింది.మస్తిష్కం లోతుల్లో  జ్ఞాపకాలకు చలనం వచ్చింది.నా కోసమే అనుకుంటా ఒక అల ఒడ్డుకు కొట్టుకొస్తూ కనిపించింది....
కామెంట్‌లు