సాధించాలంటే హేళనలను పట్టించుకోకూడదు;-- యామిజాల జగదీశ్
 నా పదిహేనేళ్ల వయసులో నేను అమెరికాకు వలస ఫోతానని చెప్పినప్పుడు అందరూ నన్ను చూసి పరిహాసం చేశారు.
కానీ నేను అమెరికాలో స్థిరపడ్డాను!
నా పద్దెనిదో ఏట నేను మిస్టర్ యూనివర్స్ టైటిల్  పొందుతానని చెప్పాను. ఆ మాటకు అందరూ నన్ను చూసి  వ్యంగ్యంగా నవ్వారు.
అయితే నేను చాలాసార్లు ఆ టైటిలుని గెలిచాను. 
ఆ తర్వాత సినిమాల్లో హీరోనవుతానని చెప్పాను. అప్పుడూ అందరూ నవ్వారు.
నేను హాలీవుడ్‌లో హీరోగా నిలిచాను.
సినీ జగత్తులో నా పరిస్థితి బాగులేనప్పుడు నా పనై పోయిందని, నేనిక అడ్రెస్ లేకుండా పోతానని అందరూ పెదవివిరిచారు.  
అయితే నేను మళ్లీ వచ్చాను.
నా యాభయ్యో ఏట నేను కాలిఫోర్నియా గవర్నర్‌గా ఉండబోతున్నానని చెప్పాను.  అందరూ నన్ను చూసి నవ్వారు.
కానీ అనుకున్నట్టే గవర్నర్‌ అయ్యాను.
వివిధ సందర్భాలలో నన్ను చూసి నవ్విన వారిని నేనిప్పుడు వెనక్కు తిరిగి చూసి చిర్నవ్వు చిందిస్తున్నాను. వాళ్లందరూ అక్కడే ఉన్నారు.  నేను చెక్కు చెదరని నా ఆత్మవిశ్వాసంతో, పట్టు సడలని కృషితో అనుకున్నది సాధించగలిగాను. ఏదైనా సాధించాలనుకునేవారు, చుట్టూ ఉన్నవారు చేసే అవహేళనలను పట్టించుకోకూడదు.
వారికి తెలిసిందీ చేతనైనదీ అంతే.  వారికి నా గురించి, నా ఆత్మవిశ్వాసం గురించి ఏమీ తెలియదన్నాడు ఆర్నాల్డ్.
అవహేళనలను అధిగమించి విజయాలను సాధించిన ఆర్నాల్డ్ జీవితపయనంలో నిజమైన హీరోగా నిలిచాడు. అతని పూర్తి పేరు ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగర్. 
1947 జూలై 30న జన్మించిన ఆర్నాల్డ్  ఆస్ట్రియన్. అమెరికన్ నటుడు. వ్యాపారవేత్త. చిత్రనిర్మాత. రాజకీయవేత్త. మాజీ ప్రొఫెషనల్ బాడీబిల్డర్. యాక్షన్ చిత్రాలలో తన పాత్రలతో కోట్లాదిమంది హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించాడు. అతను 2003 నుండి 2011 వరకు కాలిఫోర్నియాకు 38వ గవర్నర్‌గా పనిచేశాడు. 15 సంవత్సరాల వయస్సులో బరువులు ఎత్తడం ప్రారంభించిన ఆర్నాల్డ్ 20వ ఏట " మిస్టర్ యూనివర్స్" టైటిల్‌ను గెలుచుకున్నాడు. తరువాత ఏడుసార్లు మిస్టర్ ఒలింపియా టైటిల్‌ను గెలుచుకున్నాడు. బాడీబిల్డింగ్ నుండి తప్పుకున్న తర్వాత, హాలీవుడ్ యాక్షన్ స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందాడు. అతను చలనచిత్ర నిర్మాణ సంస్థ ఓక్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడిగా తనదైన ముద్రవేశాడు.
బాడీబిల్డింగ్ రోజుల్లో అతనిని "ఆర్నీ" అని,  "స్క్వార్జీ" అని పిలిచేవారు.
అతను 1986లో మాజీ US ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీ మేనకోడలు మరియా ష్రివర్‌ని వివాహం చేసుకున్నాడు. కొన్ని కారణాలతో 2011లో విడిపోయారు. వారి విడాకులు  2021లో ఖరారయ్యాయి.

కామెంట్‌లు