ఒక ఊరిలో ఒక పెద్ద మోసగాడు వుండేవాడు. వాడు చేతికి తెలియకుండా గాజులను, చెవికి తెలియకుండా కమ్మలను కాజేసే రకం. దాంతో వానికి తన కన్నా పెద్ద మోసగాడు చుట్టుపక్కల ఎక్కడా ఎవడూ లేడని చానా పొగరెక్కింది.
ఒకసారి వాళ్ల ఇంటికి వాళ్ళ మామ వచ్చాడు. ఆయన రోజుకొక ఊరికి పోతా, ఆ ఊరిలోని వింతలు విశేషాలు తెలుసుకుంటా, గుళ్ళు గోపురాలు చూసుకుంటా తిరుగుతా వుంటాడు. ఈ మోసగాడు ఆయనతో "మామా... నువ్వు తిరగని ఊరూ లేదు. చూడని మనిషీ లేడు. నీకు తెలియని వింతా లేదు. కనబడని విశేషమూ లేదు... అని అందరూ అంటా ఉంటారు. ఈ ముల్లోకాల్లో నాకన్నా పెద్ద మోసగాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూశావా" అన్నాడు.
దానికి ఆయన నవ్వి "ఒరేయ్... తాడి తన్నే వాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు వుంటాడంటారు గదా పెద్దలు. ఇక్కడికి నూరు మైళ్ళ దూరంలో ఒక ఊరు వుందిరా ... అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు వందల వందల మంది మోసగాళ్లే. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు ఎప్పుడు ఎలా మోసం చేసి పోతాడో మనలని పుట్టించిన ఆ దేవుడు కూడా చెప్పలేడు. ఆ ఊరి గురించి ఆ చుట్టుపక్కలంతా కథలు కథలుగా చెప్పుకుంటా వుంటారు" అన్నాడు.
దాంతో ఆ మోసగానికి ఎలాగైనా ఆ ఊరిని చూడాలని అనిపించింది. అది ఎక్కడుందో, ఎలా పోవాలో దారి కనుక్కున్నాడు. ఏమీ తెలియని అమాయకులను మోసం చేయడంలో గొప్పేమీ లేదు. ఆ ఊరికి పోయి అక్కడున్న జనాలను మోసం చేసి చూపెడితే తన పేరు చుట్టుపక్కలంతా మోగి పోతుందని అనుకున్నాడు.
ఆ ఊరివాళ్లకు ఈ మోసగాడు ఎవరు, ఎలా వుంటాడో అస్సలు తెలియదు కదా. దాంతో జమీందారు లాగా కొత్త పట్టుపంచ కట్టుకోని , పట్టు అంగీ వేసుకున్నాడు. మెడలో బాగా ఖరీదైన ధగధగలాడే పచ్చల హారం వేసుకున్నాడు. జేబులో ఎందుకైనా మంచిదని వంద బంగారు వరహాలు వేసుకున్నాడు. పెద్ద దొరలాగ టిప్పుటాపుగా తయారై కాళ్లకు కిర్రు చెప్పులు వేసుకొని ఆ ఊరికి బైలుదేరాడు. తరువాత రోజు పొద్దునకంతా ఆ ఊరి పొలిమేరలకు చేరుకున్నాడు.
ఆ ఊరిలోకి పోతావుంటే తనలాగే ఇంకొకతను ఆ ఊరికి పోతా కనపడ్డాడు. "ఎవరు నువ్వు, ఎందుకు పోతావున్నావు అంటూ వాన్ని పలకరించాడు. దానికి వాడు చిరునవ్వు నవ్వి నాకు చానా రోజులనుంచి ఒక మంచి మేలు జాతి గుర్రాన్ని కొనాలని ఆశ. కానీ చుట్టుపక్కల ఎక్కడ అడిగినా నూరు వరహాలకు తక్కువ దొరకడం లేదు. అదే ఈ ఊరైతే యాభై , అరభై వరహాలకే దొరుకుతాయని తెలిసి కొనడానికి పోతావున్నా" అన్నాడు.
దానికి ఆ మోసగాడు చిరునవ్వు నవ్వి "యాభై వరహాలకు గుర్రమా... అంత తక్కువకు ఎలా దొరుకుతాది. ఇది నమ్మేలా లేదు" అన్నాడు.
దానికతను "ఏమీ లేదు ఈ ఊరిలో చానామంది మోసగాళ్లే. చుట్టుపక్కల ఊళ్లలో తమ మాయమాటలతో ఎందరినో బురిడీ కొట్టించి ఎత్తుకొచ్చినవన్నీ ఇక్కడ తక్కువ ధరకు అమ్ముతుంటారు" అన్నాడు.
మోసగాడు పకపకపక నవ్వుతా "నువ్వు చానా అమాయకుని లెక్క వున్నావే. అందరినీ మోసం చేసేటోళ్లు నిన్ను కూడా మోసం చేయొచ్చు కదా. మేలు జాతి గుర్రమని మాయమాటలు చెప్పి ఏ పనికిమాలిన గుర్రమో అంట కట్టవచ్చు గదా... తెలిసి తెలిసీ ఎవడైనా నిప్పుల్లో చెయ్యి పెడతాడా అన్నాడు.
దానికి వాడు తల గోక్కొని నువ్వు చెప్పింది నిజమే. ఆ గుర్రం మేలు జాతిదో కాదో ఎలా కనుక్కోవడం. నాకు గుర్రాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. నీకేమైనా తెలుసా" అన్నాడు.
దానికి ఆ మోసగాడు "ఈ ఊరిలో అడుగుపెట్టడం పెట్టడం మంచి బోనీ దొరికింది. మొదట వీన్ని మోసం చేయాలి" అని అనుకున్నాడు.
దాంతో వానికి గుర్రాల గురించి ఏమీ తెలియకపోయినా "అరే బలే అడిగావే... మాది ఒకప్పుడు పెద్ద జమీందారీ వంశం. నాకు తెలియని గుర్రం అంటూ ఏదీ లేదు. దాని కళ్ళు చూసి ఏది ఏ జాతిదో ఇట్టే చెప్పేయగలను. అలాగే దాని వంటి రంగు చూసి గుణగణాలు పసిగట్టగలను. చిన్నప్పటినుంచి ఎన్ని గుర్రాలు చూశానో లెక్కే లేదు" అంటూ కోతల మీద కోతలు కోశాడు.
దాంతో వాడు ఆ మోసగాని చేతులు పట్టుకొని "అయ్యా... మీరు నాకు ఒక మంచి మేలు జాతి గుర్రాన్ని చూపియ్యండి. మీరు చేసిన సాయం ఎప్పటికీ మరచిపోను" అన్నాడు.
దానికా మోసగాడు కాసేపు ఆలోచించినట్టు నటించి "నీవంతగా అడుగుతా వుంటే సాయం చేయాలనే వుంది. కానీ నాకు ఊరిలో ఒకతను పది బంగారు వరహాలు బాకీ వున్నాడు. చానా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతా వున్నాడు. ఈరోజే ఈ ఊరికి వచ్చినట్టు తెలిసింది. వాన్ని ఎలాగైనా సరే పట్టుకొని నా పది వరహాలు ఇప్పించుకోవాలి. ఈసారి పట్టుకోకపోతే వాడు మరలా దొరకడు. ఆ వరహాలపై ఆశ వదులుకోవలసిందే" అన్నాడు.
దానికి వాడు "అయ్యా... పది వరహాలే కదా. వాడు పోతే పోనీయండి. ఆ పది వరహాలేదో నేనే నీ చేతిలో పెడతా. ఈ ఒక్క సాయం చేయండి" అన్నాడు బతిమాలాడుతా.
"అబ్బా... పడిందిరా పిట్ట అని లోపల్లోపల నవ్వుకుంటా... కానీ ఎలా నిన్ను నమ్మడం. నీకు మేలు జాతి గుర్రాన్ని చూపించాక నువ్వు వరహాలు ఇవ్వకుండా పోతే ఎలా. అసలే ఇక్కడ ఎవరినీ నమ్మకూడదని అందరూ అంటా వున్నారు అన్నాడు.
దానికి వాడు అయ్యా... నా మాటంటే మాటే. అంతగా అనుమానముంటే ముందే తీసుకోండి" అంటూ పది వరహాలు తీసి వాని చేతిలో పెట్టాడు.
ఆ మోసగాడు సంబరంగా వాటిని జేబులో వేసుకొని వానితో పాటు ఊరిలోకి అడుగుపెట్టాడు. వీధి వీధి తిరుగుతా వుంటే ఒకచోట బజారులో గుర్రాలు అమ్మడం కనిపించింది.
ఈ మోసగాడు గుర్రాల గురించి ఏదో పెద్ద తెలిసినోని మాదిరి ఒక్కొక్క గుర్రాన్ని పట్టిపట్టి చూసి, ఏవేవో లెక్కలేసి... చివరకు ఒక గుర్రాన్ని చూపించి... ఇదిగో ఇది తీసుకో. రంగుకు రంగు. వేగానికి వేగం. చానా అరుదైన జాతి గుర్రం అంటూ కోతలు కోశాడు.
దాంతో వాడు సంబరంగా ఒకసారి ఆ గుర్రమెక్కి వీధి చివరనుండి ఆ చివరకు నడుపుతా అన్నాడు. ఆ గుర్రాలవాడు సరేనని గుర్రాన్ని వానికి ఇచ్చాడు. వాడు గుర్రమెక్కి "ఏయ్... పదపద" అంటూ బైలుదేరాడు. అంతే... అలా బైలుదేరిన వాడు మరలా తిరిగి రాలేదు. ఒక గంట, రెండు గంటలు, మూడు గంటలు ఎదురు చూసినా అజాపజా లేదు. దాంతో ఆ గుర్రాలు అమ్మటోడు ఈ మోసగాన్ని పట్టుకున్నాడు. "మీరిద్దరే కదా కలసి గుర్రాల కోసం వచ్చింది. మరియాదగా గుర్రం ఖరీదు అరవై వరహాలు అక్కడ పెట్టు. లేదంటే రాజభటులకు అప్ప చెబుతా. కనీసం ఆరు నెలలైనా కారాగారంలో ఏసి చావ కొడతారు" అన్నాడు. ఆ మాటలకు మోసగాడు అదిరిపడ్డాడు. నోట మాట రాలేదు. గుర్రాలు అమ్మేటోడు చానా బలంగా బలిసిన దున్నపోతు లెక్క వున్నాడు. పారిపోవడానికి కూడా కుదరదు.
వాడు ఎవడో నాకు తెలియదు అంటూ ఎంత నెత్తినోరూ కొట్టుకున్నా ఎవరూ నమ్మడం లేదు.
"తెలీకుండానే వెంబడి వచ్చావా. తెలీకుండానే ఏ గుర్రం బాగా వుందో చెప్పావా. నీ కళ్ళకు మేమేమైనా వెర్రివాళ్ళ లెక్క కనబడతా వున్నామా. ఇద్దరూ తోడు దొంగలని మాకు తెలుసుగానీ... మరియాదగా డబ్బులు తీసి అక్కడ పెడతావా... లేక కిందా మీదా ఏసి నాలుగు తన్నాలా" అంటూ అంగీ పట్టుకున్నాడు.
దాంతో వాడు ఏమీ చేయలేక జేబులోంచి అరవై బంగారు వరహాలు తీసి ఆ గుర్రాల వానికిచ్చి "ఛ ఛ... అడుగు పెడితేనే పది వరహాలు వచ్చాయని సంబరపడితి గానీ, వాడు నాకే టోపీ పెడతా వున్నది కనుక్కోలేకపోతి" అని బాధపడతా బయటకు వచ్చాడు.
ఇదంతా దూరం నుంచి చూసిన ఒక ముసలాయన దగ్గరకు వచ్చి "ఎవరు నాయనా నువ్వు. నీది ఈ ఊరు కాదనుకుంటానే" అన్నాడు.
దానికి వాడు "అవును. అది ఎలా కనుక్కున్నావు" తాతా అన్నాడు.
దానికి ఆ ముసలాయన పెద్దగా నవ్వి "నువ్వు ఇంత సులభంగా మోసపోయావంటేనే తెలిసిపోతుంది నీది ఈ ఊరు కాదని. అయినా జేబులో వరహాలు ఘల్లు ఘల్లుమని మోగుతా వుంటే ఎవరికైనా కాజేయాలనిపించదా. దానికి తోడు ఈ ఊరిలో వీధికో జేబుదొంగ వున్నాడు. కన్నుమూసి తెరిచేలోగా కాసులు కనపడకుండా మాయమైపోతాయి. వుండు ఒక్క నిమిషం" అంటూ తన జేబులోంచి ఒక చిన్న వరహాలు వేసుకునే ఎర్రరంగు సంచీ తీసి "ఇదిగో ఇది తీసుకో. నీ వరహాలన్నీ ఇందులో వేసుకొని గట్టిగా మూటగట్టి ఎవరూ కొట్టెయ్యకుండా లోపల జేబులో పెట్టుకో. అచ్చం నా మనవని లెక్కనే అమాయకంగా వున్నావు. అందుకే చెబుతా వున్నా" అన్నాడు.
ఆ మోసగాడు తన వరహాలని ఒకసారి లెక్క పెట్టుకొని వాటిని సంచిలో వేసుకొని లోపలి జేబులో దాచిపెట్టుకున్నాడు. పొద్దున్నుంచీ ఏమీ తినక పోవడంతో బాగా ఆకలి అవుతావుంది. అక్కడ ఒక పెద్ద ఫలహారశాల కనపడింది. లోపలికి పోయి కూచోని ఉగ్గాని బజ్జీ తీసుకొని రమ్మని చెప్పాడు. అక్కడ చానామంది వున్నారు. నచ్చినవి తెప్పించుకొని సంబరంగా మాటలాడుకుంటా తింటా వున్నారు.
అంతలో ఒక బట్టనెత్తి ఆయన పైకి లేచి గట్టిగా "దొంగ... దొంగ... నా బంగారు వరహాలు కొట్టేశాడు. పట్టుకోండి... పట్టుకోండి" అంటూ గట్టిగా అరవసాగాడు. అందరూ ఉలిక్కిపడి వాని వంకే చూడసాగారు. ఆ అరుపులు విని బయట పోతావున్న రాజభటులు లోపలికి వచ్చారు.
బట్టనెత్తి ఆయన రాజ భటులను చూసి "అయ్యా... లోపలికి వచ్చేటప్పుడు మూట ఈ జేబులోనే ఉంది. ఇప్పుడే అలా తింటా వున్నానో లేదో మాయమయ్యింది. ఇక్కడే ఎవరో కొట్టేశారు" అన్నాడు.
దాంతో భటులు అందరి వంకా చూసి "ఎవరూ ఇక్కడ నుంచి పక్కకి కదలకండి. బయటకు పోకండి" అంటూ తలుపులేసి, ఆ బట్టనెత్తి ఆయనకెళ్ళి తిరిగి... "నీ మూట ఎలా వుంది. దానిని ఎలా కనుక్కోవడం. అందులో ఎన్ని వరహాలు వున్నాయి" అన్నారు.
ఆ మాటలకు వాడు "అయ్యా... నాది ఎర్రరంగు వరహాల మూట. అందులో సరిగ్గా యాభై బంగారు వరహాలు వున్నాయి" అన్నాడు.
ఆ మాట వినగానే మోసగాడు అదిరిపడ్డాడు. కొంపదీసి వీడు నా వరహాలకే ఎసరు పెడతా వున్నాడా అని అనుమాన పడ్డాడు.
రాజభటులు ఒక్కొక్కరినే వెతుకుతా ఈ మోసగాని దగ్గరకు వచ్చారు. అంతా వెతికితే అంగీ లోపల ఎర్రరంగు మూట కనపడింది. దానిని చూడగానే ఆ బట్టనెత్తి ఆయన ఎగిరి ముందుకు దూకి "అయ్యా... ఇది నాదే. వీడే కొట్టేసినట్టు వున్నాడు" అంటా గట్టిగా అరిచాడు. దానికి ఆ మోసగాడు "ఎర్రనివన్నీ నీవే అంటే ఎలా. ఇప్పుడే దీన్ని ఒక ముసలాయన వరహాలు పెట్టుకోడానికి నాకిచ్చాడు" అన్నాడు.
అప్పుడా బట్టనెత్తి ఆయన "అయ్యా... కావాలంటే లెక్కపెట్టుకోండి. అందులో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కాకుండా సరిగ్గా యాభై బంగారు వరహాలు వుంటాయి. అంతేకాదు ఆ సంచీకి లోపల చిన్న అర వుంది. అందులో మా ఇంటి చిరునామా ఉన్న చిన్న కాగితం ముక్క వుంటాది. పొరపాటున ఆ సంచి ఎక్కడైనా పడిపోతే, ఎవరికైనా మంచివానికి దొరికితే... తిరిగి అప్పజెబుతారని ఆ కాగితం అందులో ఎప్పుడు పెట్టుకుంటా" అన్నాడు.
రాజభటులు సరేనని ఎర్ర రంగు సంచీ లోపల వెతికారు. యాభై బంగారు వరహాలతో పాటు వాడు చెప్పినట్టే లోపల చిన్న కాగితం, అందులో వాని చిరునామా కనపడ్డాయి. దాంతో వాళ్లు ఆ వరహాల మూట బట్టనెత్తోనికి అప్పజెప్పారు.
ఆ మోసగానికెళ్లి తిరిగి "ఏరా... చూడడానికి పెద్ద జమీందారు లెక్క వున్నావు. జనాలను మోసంచేసి బతుకుతా వున్నావు. నీలాంటోళ్ల వల్లనేరా మా ఊరికి చెడ్డపేరు" అంటా వాన్ని వంగబెట్టి దభీదభీమని నాలుగు గుద్దులు గుద్దారు. ఆ ముసలోడు, బట్ట నెత్తోడు కలసి ఎంత మోసం చేసినారు. ఎంత తెలివి తక్కువగా వాళ్ల బుట్టలో పడిపోయాను అని బాధపడతా... ఇంకొంతసేపు అక్కడే వుంటే అనవసరంగా అందరి చేతిలో తన్నులు తినడమే కాకుండా కారాగారంలో బందీ కావడం కూడా ఖాయం అనుకున్నాడు.
అంతే... ఒక్కుదుటున తన బలమంతా వుపయోగించి రాజభటులను వెనక్కు దొబ్బాడు. వెంటనే ఆ మోసగాడు మెరుపు వేగంతో అక్కడి నుంచి బయటకు వురికాడు . రాజభటులకి కనపడకుండా చానా దూరం పారిపోయాడు.
పొద్దున్నుంచీ ఏమీ తినక పోవడంతో బాగా ఆకలి అవుతావుంది. చేతిలో పైసాకూడా లేదు. ఏం చేయాలబ్బా అని అనుకుంటా వుంటే మెడలో పచ్చల హారం మతికి వచ్చింది. దాన్ని ఎక్కడైనా అమ్ముదామని ఒక అంగడి వద్దకు పోయాడు. కానీ... ఏ అంగడికి పోయినా ఎవరూ కొనడం లేదు.
"చూడు నాయనా... ఈ ఊరిలో అడుగుకో దొంగ, గజానికో మోసగాడు తిరుగుతా ఉంటారు. ఏది కొనుక్కొచ్చిన సొత్తో , ఏది కొట్టుకొచ్చిన సొత్తో ఆ దేవునికే తెలియాల. రాజభటులు దొంగ నగల తనిఖీ కోసం వచ్చినప్పుడు పట్టుబడితే... నగలు గుంజు కోవడంతో బాటు, నాలుగు నెలలు లోపలేసి కుమ్ముతారని మా భయం. కాబట్టి ఈ బజారులో ఎవరు నీ హారాన్ని కొనరు" అని ఒక ఆయన చెప్పాడు.
వానికి ఏం చేయాలో తోచక, అది ఎలా అమ్మాలో తెలీక దిగులుగా అడుగులో అడుగు వేసుకుంటా పోతావుంటే ఒక పిల్లోడు దగ్గరకొచ్చి "అనా... ఈ పెద్ద బజారులో ఎవరూ కొనరు గానీ, పక్క సందులో చిన్న సుంకన్న అని ఒకడు వుంటాడు. అతని పని దొంగ సొత్తు అమ్మడం కొనడం. రాజభటులకు ఎప్పటికప్పుడు లంచాలు ముట్ట చెబుతుంటాడు కాబట్టి అతన్ని ఎవరూ పట్టుకోరు. నా వెంబడిరా. అతని ఇల్లు చూపెడతా" అన్నాడు.
దాంతో ఆ మోసగాడు ఆ పిల్లోని వెనకాలే వెనుక వీధిలోకి పోయాడు. ఒక ఇంటిముందు అరుగు పైన ఒక ముసలాయన కనబడ్డాడు. పిల్లోడు ఆ ముసలాయన్ని చూపుతా "ఆయనే... నేను చెప్పిన చిన్న సుంకన్న. అటూ ఇటూ చూడకుండా పో... పోయి గమ్మున నీ పని చేసుకో" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
వాడు చిన్న సుంకన్న దగ్గరికి పోయి పచ్చల హారాన్ని చూపించాడు. వాడు ఆ హారాన్ని పైకీ కిందికీ బాగా చూసి, పచ్చలు అసలువో నకిలీవో పరిశీలించి చూశాక... "చూడు నాయనా నేను ఏదైనా సరే వున్నది వున్నట్టు చెబుతాను. ఇది చానా మంచి హారం. నాలుగు వందల వరహాల పైన్నే వుంటాది. ఎవరైనా సరే కళ్లకద్దుకుని తీసుకుంటారు. కానీ మోసగాళ్ల దేశంలో అమ్మడమయినా, కొనడమయినా అంత సులభం కాదు. చానామందికి నెలనెలా మామూలు ఇయ్యాల. కాబట్టి సగం ధరకు మించి ఒక్క చిల్లిగవ్వ కూడా ఎక్కువ ఇయ్యలేను. నీకు నచ్చితే ఇవ్వు. లేదంటే వేరే చోట ఎక్కడైనా అమ్ముకో. నా దగ్గర మారు మాటలు, బేరాలు ఏమి వుండవు. ఏదైనా సరే ఒక్క మాటతో తెగి పోవాల. అదీ నా పద్ధతి" అన్నాడు.
ఆ మోసగానికి ఏం చేయాలో తోచలేదు. పెళ్లయిన కొత్తలో ఎంతో ముచ్చటపడి నాలుగు వందల వరహాలు పోసి కొన్న హారం అది. కానీ తిరిగి ఊరికి వెళ్లడానికి చేతిలో ఏమీ లేదు. ఆకలేమో నిమిష నిమిషానికి పెరిగి పోతావుంది. తెలిసి తెలిసీ ఈ మోసగాళ్ల దేశానికి రావడం నాదే బుద్ధి తక్కువ. ఇంకోసారి పొరపాటున కూడా ఇటువైపు రాకూడదు అనుకుంటా ఆహారాన్ని వాని చేతిలో పెట్టి రెండు వందల బంగారు వరహాలు తీసుకొని బాధగా బయటకొచ్చాడు.
బజారులో పోతావుంటే ఒక చోట జిలేబీల అంగడి కనపడింది. ఘుమఘుమలాడే వేడి వేడి జిలేబిలు చూడగానే సర్రున నోటిలో నీళ్లు వూరినాయి. దానికి తోడు పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా... మాంచి ఆకలి మీద వున్నాడు. అంగడికి పోయి ఒక బంగారు వరహా ఇచ్చి వచ్చినన్ని మూటగట్టి ఇయ్యమన్నాడు. వాడు ఆ బంగారు వరహాని కిందికీ మీదికీ పరిశీలించి చూసి, నేల మీద వేసి కొడితే టప్పుమని చప్పుడు వచ్చింది.
వెంటనే వాడు కోపంగా "ఏరా... సత్తు వరహాలకు బంగారు రంగు వేసుకోనొచ్చి నన్నే మోసం చేయాలనుకుంటా వున్నావా . ఎంతమందిని చూడలేదు నీలాంటి దొంగ యదవలని" అంటూ చెంప మీద రప్పుమని ఒకటి పెరికాడు.
అంతే... దెబ్బకు వాడు ఆ అంటూ చెంప పట్టుకొని అక్కడే కూలబడ్డాడు. నొప్పికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంగడాయన చేతిలోని వరాహాను వాని మొహం మీదకు విసిరి కొడతా "ఇంకోసారి వీధిలో గనక కనబడినావనుకో... కాళ్ళూ చేతులు విరగ్గొట్టి కళ్లలో కారంపొడి చల్లుతా చూడు. ఏమనుకుంటా వున్నావో" అన్నాడు. దాంతో వాడు వెంటనే తనని మోసం చేసిన చిన్న సుంకన్నని పట్టుకోవడానికని వేగంగా వురుక్కుంటా వాళ్ల ఇంటి దగ్గరికి పోయాడు. అరుగు మీద ఎవరూ లేరు. తలుపులు మూసి వున్నాయి. కోపంగా పోయి తలుపులు దభీ దభీమని గుద్దాడు. ఒక ఆడామె తలుపు తెరిచింది.
"ఎవరు నాయనా నువ్వు. ఎందుకలా అంత గట్టిగా తలుపులు పగిలిపోయేలా కొడతా వున్నావు. కొంచెమన్నా తెలివుందా నీకు" అని అరిచింది.
దానికి వాడు "ఇంతసేపు ఈ అరుగు మీద చిన్న సుంకన్న అని ఒకడు అంగడి పెట్టుకుని వుండెనే. ఆయన ఎక్కడ" అన్నాడు.
దానికి ఆమె "అంగడా... ఈ అరుగు మీదనా... అటువంటిది ఏమీ లేదే. ఈరోజు పొద్దున ఎవరో ఒకాయన, ఒక పిల్లోడు ఇక్కడికి వచ్చి అమ్మా మాది పక్క ఊరు. చానా దూరం నుంచి నడిచీ నడిచీ కాళ్ళు నొప్పి పెడతా వున్నాయి. కాసేపు అరుగు మీద కూచోని పోతాం అంటే సరే అన్నా. అంతే" అనింది.
దానికి వాడు "ఓరి దేవుడోయ్... ఈ ఊరిలో సన్న పిల్లోని దగ్గరనుంచి పండు ముసలోళ్ళ వరకు అందరూ మోసగాళ్లే. ఇంతమందిని మోసం చేసిన నన్నే ఇలా దెబ్బ మీద దెబ్బ కొడతా వున్నారంటే వీళ్లు మామూలోళ్ళు కాదు" అనుకుంటా అక్కడినుంచి వచ్చేశాడు.
చీకటి పడతా వుంది. ఆ మోసగాడు నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటా నడవసాగాడు. ఆకలితో కళ్ళు తిరుగుతా వున్నాయి. నడవలేక పోతా వున్నాడు. దారిలో ఒక పెద్ద గుడి కనబడింది. నెమ్మదిగా అక్కడకు చేరి ఒక మూల నీరసంగా కూలబడ్డాడు. అది చూసిన ఒక బిచ్చగాడు దగ్గరికి వచ్చి "ఏంది దొరా ఇది. చూడ్డానికి గొప్పింటి బిడ్డలా వున్నావు. ఏమైంది. ఇక్కడ కూచున్నావు" అన్నాడు. దానికి ఆ మోసగాడు కళ్లనీళ్లతో "ఈ ఊరిలో అడుగడుగునా దొంగలే. నిండా ముంచేసినారు. పొద్దున్నుంచీ ఏమీ తినక కళ్ళు తిరుగుతా వున్నాయి. ఏమైనా వుంటే కొంచెం పెట్టు" అని దీనంగా అడిగాడు.
దానికా బిచ్చగాడు "ఒక్క నిమిషం ఓపిక పట్టు దొరా... గుడిలో అందరికీ రవ్వ కేసరి పెడతా వున్నారు. కళ్ళు మూసి తెరిచేలోగా అది తీసుకొని నీ ముందుంటా చూడు" అంటూ లోపలికి వురుక్కుంటా పోయి ఒక గిన్నె నిండా తీయని రవ్వకేసరి తెచ్చి వాని ముందు పెట్టాడు. దాన్ని చూడగానే ఆనందంతో వాడి మొహం వెలిగిపోయింది. బెరాబెరా దాన్ని కడుపునిండా తిన్నాడు. అంతే... అది తిన్న కాసేపటికి వానికి నిదుర ముంచుకొచ్చింది. బిచ్చగాడు అందులో మత్తుమందు కలపడంతో మబ్బెక్కి ఎక్కడివాడక్కడ అలాగే పడి నిదర పోయాడు.
తరువాత రోజు పొద్దున్నే ఎవరో "ఏయ్... లెయ్.. లెయ్... పద ఇక్కన్నుంచి" అని గట్టిగా కేకలు పెడతావుంటే అదిరిపడి లేచాడు. ఇంకేముంది ఒంటిమీద చినిగిన పాత తువ్వాలు తప్ప ఏమీ లేవు. పట్టు అంగీ , పట్టు పంచ , కిర్రు చెప్పులు అన్నీ బిచ్చగానితో పాటు మాయం అయిపోయాయి.
"నిజమే... ఏమో అనుకుంటిగానీ తాడి తన్నే వాడొకడు వుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు వుంటాడు అని ఆ రోజు మామ చెప్పింది నిజమే. నేనే పెద్ద మోసగాన్నని, నాకెదురు ఎవరూ లేరని ఇన్ని రోజులు ఎగిరెగిరి పడినా. కానీ ఈ ఊరిలో అందరూ నాకన్నా మోసగాళ్లే. అది కూడా అలాంటిలాంటి మోసగాళ్లు కాదు. మోసగాళ్లకు మోసగాళ్ళు" అనుకుంటా సిగ్గుతో ఆ చినిగిన తువ్వాలును కూడా ఎవరైనా ఎత్తుకు పోతారేమో అనే భయంతో దాన్ని గట్టిగా పట్టుకొని ఇంటి దారి పట్టాడు.
***********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి