సల సల కాగే సూరీడు... సల్లా సల్లని చందమామ - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

   ఒకూర్లో ఒకామె వుండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దోని పేరేమో సూర్యుడు. చిన్నోని పేరేమో చంద్రుడు. వాళ్ళు చానా బీదోళ్ళు. ఆమె ఆ ఇంట్లో, ఈ ఇంట్లో వనులు చేసి వచ్చిన డబ్బులతో పిల్లలకు మంచి తిండి పెట్టేది. ఒక రోజు ఆమెకు పెద్ద జ్వరమొచ్చి మంచంలో పడిపోయింది. నెలైనా జ్వరం కొంచెం కూడా తగ్గలేదు. ఇంట్లో వున్న దబ్బులన్నీ అయిపోయినాయి. ఆమె పిల్లలిద్దరికీ ఏదో ఒకటి పెట్టి తాను మాత్రం ఏమీ తినకుండా పుత్త మంచినీళ్ళు తాగి కడుపు నింపుకొనేది. పిల్లల కోసం జ్వరంలోనూ ఆకలితో పస్తులుండేది. అంతలో ఒకరోజు ఆ వూరిలో ఒక పెద్ద పెళ్ళి జరుగుతా వుంటే వీళ్ళను భోజనానికి పిల్చినారు. పెళ్ళి భోజనమంటే ఉత్త అన్నం, పప్పు పెట్టరు కదా. మంచి మంచి రుచికరమైన వంటకాలు వడ్డిస్తారు. ఆమె చానా రోజుల నుండి వస్తులుంది కదా. దాంతో నోరూరింది. పిల్లలతో సహా తానూ పోయి బాగా కడుపునిండా తిని రావాలనుకోనింది. కానీ చానా రోజుల నుండి తిండి లేదు కదా. అదీకాక జ్వరం ఇంకా తగ్గలా. దాంతో నీరసమొచ్చి మంచం మీద నుండి కొంచగూడా లేవలేకపోయింది. అడుగు తీసి అడుగు వేయలేక పోయింది. దాంతో సూర్యున్ని, చంద్రున్ని పిలిచి "రేయ్... మీరిద్దరూ పెళ్ళికి పోయి బాగా తిని రండి. అట్లాగే వచ్చేటప్పుడు నాక్కూడా ఏమైనా పట్టుకోని రండి. చానా ఆకలిగా వుంది. ప్రాణం పోయేటట్లు ఉంది" అని చెప్పింది. సరేనని ఇద్దరూ పెళ్ళికి పోయినారు.
సూర్యుడు భోజనానికి కూర్చోగానే అమ్మ చెప్పిన మాట మరిచిపోయినాడు. బచ్చాలు, లడ్లు, కర్జకాయలు, పాయసం అన్నీ బాగా మెక్కి ఉత్త చేతులు పూపుకుంటా ఇంటికొచ్చినాడు. వాళ్ళమ్మ సూర్యున్ని చూడగానే తన కోసం అన్నీ తెచ్చింటాడు అనుకోని ఆశతో "ఏరా! నా కోసం ఏమి తెచ్చినావు" అనడిగింది. దానికి సూర్యుడు "అరెరే! నీ సంగతే మర్చిపోయినా. నాకసలు గుర్తే లేదు" అన్నాడు. తాను రోజూ ఏమీ తినకుండా కడుపు కాల్చుకోని అన్నీ వీళ్ళకే పెడతా వున్నా కనీసం ఒక్కపూట కూడా తనకు తేలేదు కదా అని ఆమె చానా బాధ పడింది.
చంద్రుడు మాత్రం అన్నానికి కూర్చోగానే పెట్టినేవి పెట్టినట్లు సూర్యుని మాదిరి బెరబెరా తినకుండా “పాపం అమ్మ రోజూ తానేమీ తినకుండా అన్నీ మాకే పెడతా వుంది. కనీసం ఈ ఒక్కరోజైనా ఇవన్నీ తీస్కోనిపోయి అమ్మకు పెట్టాలి" ఆనుకొని ఎవరూ చూడకుండా విస్తరాకులో పెట్టినేవి పెట్టినట్టు అంగీలో దాచి పెట్టుకోని ఇంటికి తీసుకొచ్చినాడు.
అమ్మ చంద్రుని చూస్తానే “ఏరా! నువ్వన్నా ఏమన్నా తెచ్చినావా, లేక మీ అన్న మాదిరే అన్నీ బాగా మెక్కి ఉత్త చేతులు వూపుకుంటా వచ్చినావా" అనడిగింది. ఆ మాటలకు చంద్రుడు నవ్వుతా “అమ్మా... ముందు నువ్వు కాళ్ళూ చేతులు కడుక్కొని రాపో... తిందువుగానీ" అంటూ విస్తరి వేసి తెచ్చినవన్నీ ప్రేమగా అమ్మకు కొసరి కొసరి తినిపించినాడు. అవన్నీ తిని ఆమె చానా సంబరపడింది.
ఆ తరువాత సూర్యున్ని పిలిచి "చూడు... వీడు నీకన్నా చిన్నోడే అయినా అమ్మ కోసం ఏమీ తినకుండా అన్నీ తెచ్చినాడు. నువ్వు పెద్దోనివై మాత్రం ఏం లాభం?" అంటూ "నేను ఎట్లాగైతే ఆకలితో మలమల మాడిపోయినానో, అట్లాగే నువ్వు కూడా ఇప్పన్నించీ సలసలసల మండిపోవాల" అని శపించింది.
చంద్రున్ని పిల్చి "మలమల మాడిపోతా వున్న నా కడుపు నిండా అన్నం పెట్టి దాన్ని చల్లగా చేసినావు. అందుకని ఇప్పన్నించీ నువ్వు చల్లగా బతకాల" అని దీవించింది. అందుకే ఆరోజు నుండి ఆకాశంలో సూర్యుడు సలసలసల కాగిపోతా సెగలు కక్కుతా వుంటే, చంద్రుడేమో వెన్నెల కురిపిస్తా హాయిగా వున్నాడు.
***********
కామెంట్‌లు