మాటరాని నిరసనవాక్యం;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871.
నేలను చెరబడుతున్న
నీచ నిర్లజ్జ కిరాతకం 
కలియుగ దుర్యోధన దుశ్శాసన వారసత్వం తొడుక్కున్న మూఢుని హేయమైన అకృత్యం 
దురహంకార అత్యాచార పర్వం 
రంగుల ఆకాశంలో చూడని భయానకం   'మానవాకాశంలో సగం' పడ్డ బాధ రాయలేని హనన కాండ  
గాయపడ్డది మన అమ్మా అక్కా తోబుట్టువులే 
పవిత్ర మానవ భూమిలో కనిపించే అమానవీయ మౌనదృశ్యం
నడుస్తున్న కాలంపై ఝళిపించే పదును సిరా కలం ఆర్తి  సృజన
మాటరాని వాక్యానికి ఘోషించే గొంతు  

తెల్లకోటు నేడు వద్య శిలపై విగతజీవి
నిస్వార్థ సేవలతో కాపాడే మానవత్వం దిగంబర కీలల్లో బందీ బలిపశువు కోరల హత్య

ప్రాణం పోయడమే నేరమా 
బతికించడమే తప్పా 
శాంతి కపోతంపై క్షణికావేశ ముళ్ళ వేటు
అసహన అహంభావ వేట
ఇంకెన్నాళ్ళీ దారుణ దావానల మానభంగ  క్రీడ?
జీవాక్షి మూసుకున్న చూపుల విచ్చు కత్తుల వికట ఘటన

స్టెతస్కోప్ గుండె గాయం మరువలేని మరణ మృదంగం
విరిగిన రెక్కల ఎముకల నిశ్శబ్ద శబ్దం
గాయపడ్డ కంటి అద్దాల రక్త కన్నీరు

తల్లి చెల్లి సోయిలేని అకృత్య లోకంలో 
 అబల అనాధ ప్రశ్నించే నివ్వెరపోయిన సమాజం బాధాతో 
తల దించుకునేలా 

వైద్యవృత్తికీ వైద్యులకు అండగా
సంఘీభావ కవిత నాదిదే
సామాజిక కట్టడి పెంచే మనిషి మనిషిగా మసలే కాలంకోసం
నైతిక విద్యా దారులు వెతకాలి 
రక్షణనిచ్చే చేతులతో అన్నలుగా తమ్ములుగా ఈ మట్టిలో మళ్ళీపుట్టాలి ప్రతి మనిషి 


కామెంట్‌లు