న్యాయాలు -582
పతంగ ( పికా) న్యాయము
******
పతంగ అనగా పక్షి,, సూర్యుడు,మిడుత, తేనెటీగ, బాణము.పిక అనగా కోకిల అని అర్థము.
పతంగ (పికా ) అనగా పక్షి వలె జీవించడం.
మరి పక్షి ఎలా జీవిస్తుంది. పక్షి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? తెలుసుకునే ముందు 'పిక పికా ' అనే పక్షి గురించి తెలుసుకుందాం.
పిక పికా అనేది ఒకానొక పక్షి యొక్క శాస్త్రీయ నామము.ఈ పక్షి కాకుల జాతికి చెందినది.దీనిని మెగ్ పై పక్షి అంటారు.ఇది మన దేశంలో ఎత్తైన ప్రాంతాలలో, టిబెట్ లో, అమెరికా, యూరప్ మొదలైన దేశాల్లో ఉందట.దీనికి మాటలు నేర్పిస్తే చిలుకలా మాట్లాడుతుందట. దీనితో చిన్న చిన్న విన్యాసాలు కూడా చేస్తుందట.ఇవి కాకుల వలె మానవ గొంతులను కూడా అనుకరిస్తాయట.చక్కగాకలిసి ఆడుకుంటాయట.గుంపుగా కూడి పనులు చేస్తాయట.బాధ కలిగినప్పుడు వ్యక్తం చేయడం కూడా వీటికి వచ్చట.అందుకేనేమో జంతువులు, పక్షి జాతుల్లో మానవుల తర్వాత తెలివైన వాటిగా ఈ పిక పికా పక్షులు పేరు పొందాయి.ఇవి ఒక పక్షితో జత కట్టి ఒకే ప్రదేశంలో దానితోనే జీవితమంతా గడుపుతాయట.ఇంగ్లాండు లాంటి ప్రాంతాల్లో దీనిని దుశ్శకునంగానూ, అనేక మూఢనమ్మకాలతో ముడిపెట్టి చూస్తారట. ఇవన్నీ పిక్ పికా పక్షి గురించి శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన విషయాలు.
ఇక విషయానికి వద్దాం.ఎలాగూ పిక పికా పక్షి గురించి చెప్పుకున్నాం కాబట్టి వాటి జాతి పక్షి అయిన కాకి నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏమిటో చూద్దాం.
కాకి అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది చిన్నప్పటి హిందీ / తెలుగు గేయం. దాహమైన కాకి కుండలో లోతుగా ఉన్న నీళ్ళు తాగడానికి చిన్న చిన్న గులక రాళ్ళు వేసి నీళ్ళు పైకి వచ్చిన తర్వాత తాగడం.ఇక "కాకి మాంసం ముక్క కథ" ఇవి కాకి తెలివిని, సమయస్ఫూర్తిని గురించి చెప్పేవి.
అయితే కాకిని గురించి పండితులు, పెద్దలు, ఆధ్యాత్మిక వాదులు, సనాతన ధర్మం ఆచరించే వారు, మానవతా వాదులు... ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కాకి గొప్ప తనం గురించి విశ్లేషిస్తూ ఏం చెప్పారో చూడండి.
ఆధ్యాత్మిక వాదులు కాకిని గొప్ప జ్ఞాని అంటారు. ఎందుకంటే కాకి ప్రతి రోజూ బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానం ఆచరిస్తుందనీ, ఈ బంధాలు, అనుబంధాలు, సిరి సంపదలు ఏవీ శాశ్వతం కావని కావు కావు అంటూ జనాలకు గుర్తు చేస్తుందనీ అంటారు. అలా కాకిని కాలజ్ఞాని వారు పిలుస్తుంటారు.
ఇక పండితులైతే సంసారం ఎలా చేయాలో కాకి జంటను చూస్తే తెలుస్తుందనీ ఆ జంట మానవ జంటవలె పరుల కంట పడకుండా గోప్యంగా కురుస్తాయని చెబుతుంటారు.
ఇక మన పెద్దలు కాకుల వలె ఐకమత్యంగా ఉండాలనీ, బంధు మిత్రులతో కలిసి బతకడమే జీవితమంటారు.అదెలా అంటే కాకికి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే కావ్ కావ్ మంటూ మిగతా కాకులను పిలుస్తుంది. కాకుల్లో ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి వాటి భాషలో అరుస్తూ సంతాపం తెలియజేస్తాయి. అంతే కాదు ఆ తర్వాత తప్పకుండా నీటిలో స్నానం చేస్తాయి.సూర్యాస్తమయ వేళకు గూటికి చేరుకోవడం. ఆ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం కాకుల్లో ఉన్న మంచి లక్షణాలు.
పితృ ఋణం తీర్చుకునేందుకు పెట్టే పితృ తర్పణాలను కాకి ముడితేనే పితృదేవతలు సంతృప్తి చెందుతారని సనాతన ధర్మం ఆచరించే వారు చెబుతుంటారు.
ఇక మానవతా వాదులు కాకి చాలా గొప్ప గుణం కలది అంటారు.ఎందుకంటే కోకిల పెట్టిన గుడ్లను పొదిగి అవి ఎదిగేంత వరకు ఆహారం ఇచ్చి కన్నబిడ్డల్లా సాకుతాయి. అలాంటి మానవీయత మనుషులు కూడా ఆచరించాల్సిన ధర్మం అంటారు.
ఇక తెలంగాణ రాష్ట్ర పాఠ్య పుస్తకాల్లోని తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలో మామిండ్ల రామగౌడు రాసిన "వాయసం" పద్య కావ్యం లో కాకి గొప్ప తనం గురించి బోలెడు విషయాలు ఉన్నాయి.ఇలా కాకి గురించి చదువుతుంటే మన కళ్ళ ముందు కనిపించే ఈ పక్షిలో ఇన్ని సద్గుణాలు ఉన్నాయా? అని ఎవరికైనా సరే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
అంతే కాదండోయ్! కాకి పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రకరకాల చెట్ల పండ్లు తిని ఎక్కడెక్కడో విసర్జన చేస్తుంటాయి. అలా విత్తనాలు భూమి పై పడి మొలకెత్తి మహా వృక్షాలు అవుతుంటాయి.
ఈ "పతంగ లేదా (పికా) న్యాయము" ద్వారా నీతి నియమాలు, మానవీయ విలువలు, పర్యావరణ పరిరక్షణ, సిరిసంపదలు,కుటుంబ బంధాల పట్ల మనం ఎలా వుండాలో తెలిసింది కదా! మరి కళ్ళముందు కనిపించే కాకిని చూసి తనలోని మంచి గుణాలు, మంచి అలవాట్లను మనమూ నేర్చుకుని ఆచరణలో చూపుదామా...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి