తెలుగుతల్లికి నీరాజనాలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అభిషేకించి
నూతనవస్త్రాలుకట్టి
తెలుగుతల్లిని
ముస్తాబుచేస్తా

మల్లెలుతెచ్చి
మాలగనల్లి
తెలుగుతల్లి
మెడలోవేస్తా

కాళ్ళుకడిగి
నెత్తినచల్లుకొని
తెలుగుతల్లికి
పూజలుచేస్తా

చేతులెత్తి
కంఠముకలిపి
తెలుగుతల్లికి
జైజైలుకొడతా

అంజలిఘటించి
ఆశిస్సులుకోరి
తెలుగుతల్లికి
వందనముచేస్తా

ముచ్చట్లుచెప్పి
చప్పట్లుకొట్టి
తెలుగుతల్లిని
ప్రశంసిస్తా

రంగులనద్ది
వెలుగులుచిమ్మి
తెలుగుతల్లిని
ధగధగలాడిస్తా

తలనువంచి
ధ్యానముచేసి
తెలుగుతల్లిని
తలచుకుంటా

తలపైనెత్తుకొని
పల్లకిలోకూర్చోపెట్టి
తెలుగుతల్లిని
ఊరేగిస్తా

గళమునెత్తి
గీతముపాడి
తెలుగుతల్లిని
పొగుడుతా

పద్యాలువ్రాసి
కవితలుకూర్చి
తెలుగుతల్లికి
అంకితమిస్తా

కర్పూరమువెలిగించి
కళకళలాడించి
తెలుగుతల్లికి
హారతినిస్తా


కామెంట్‌లు