కైమోడ్పులు ;- -గౌరవరాజు సతీష్ కుమార్.
 నెత్తికెక్కిన నెమలి పింఛం 
నుదిటిపై కస్తూరి తిలకం 
చెక్కిలిపై దిష్టి చుక్క 
మెడ నిండా పూల దండ 
ఎదపై కౌస్తుభ హారం 
మేన అలదిన శ్రీ గంధం   
ధగధగలాడే పట్టుపంచె కట్టి  
మిలమిలలాడే ఉత్తరీయం 
నడుముకు చుట్టి 
ముంజేతి కంకణాలూ
పాదాల అందెలూ
ఘల్లు ఘల్లున మ్రోగ 
మల్లెలొలికే నీ నవ్వులు 
కృప కురిసే నీ కన్నులు 
పిల్లన గ్రోవిపై 
నీ ముని వ్రేళ్ళు నాట్యమాడితే  
మై మరిచిన గోపికలు 
నిను జేరి ఆడుతుంటే
ఆ దృశ్యం నాకు చూపి 
నన్ను ధన్యుడిని జేశావు 
అందుకో కృష్ణా 
నాకై మోడ్పులు! 
—--------------------------------


కామెంట్‌లు