'కృష్ణా!'శతకము.;- టి. వి. యెల్. గాయత్రి -పూణే. మహారాష్ట్ర.
 ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది 
=========================================
క్రొత్త వృత్తములు.
============
71.
సుగంధి -స, న, య.
విరిమాలలు గొని నీకై
త్వరగా నిలిచితి శౌరీ!
గురురూప!కనుము నన్నున్ 
బరమాత్మ!వరద!కృష్ణా!//
72.
కలహము -స, భ, మ.
సురలున్ యోగులు నీ మ్రోలన్
నిరతంబున్ బడి మ్రొక్కంగా
పరమున్ జూపెడి నీప్రేమన్
దరముల్ తల్తురు శ్రీకృష్ణా!//
73.
యతనం -స, య, య.
దురితాత్ములన్ సంహరించన్
ధరయందు పాదంబు మోపన్
గరుడాద్రివాసా!మురారీ!
తరియించెలోకంబు కృష్ణా!//

74.
 ఇంద్ర /తాంద్రీ -జ జ య గ.
యతి -6.
కదంబ విరుల్ గరిమన్ దెత్తున్
బదంబడి నిన్ బ్రణతిన్ గొల్తున్
వదాన్యుడ వీ వని నీ మ్రోలన్
బదంబుల నే పడుదున్ కృష్ణా!//
75.
జలౌఘావేగా నిరూపణమ్-జ త ర గ.
యతి -6
వినిర్మలాంగా!విశోకదూరా!
మనోధిశాయీ!మహాప్రతాపా!
ఘనావతారా!కవీ!మురారీ!
సనాతనార్యా!జయంబు కృష్ణా!//


కామెంట్‌లు