న్యాయాలు-583
పదాతి న్యాయము
*****
పదాతి అనగా కాలి బంటు అని అర్థము.
చతురంగం ఆటలో బంటుకు/ సిపాయికి ఋజు గతియే కానీ వెనుకకు ప్రక్కలకు వక్రగమనం ఉండదు.కానీ చంపునపుడు మాత్రం వైమూలగా వక్రగతి పట్టును అని అర్థము.
అనగా దుష్టుడు దౌష్ట్యమునకు దిగక నడచుచూ సాధువువలె కన్పించిననూ తలవని తలంపుగా దుర్మార్గమునకు దిగుతాడనేది ఇందులోని అంతరార్థం.
ఇదంతా చదరంగం ఆటలో కనిపిస్తుంది.ఆడేవాళ్ళకు తెలుస్తుంది . మరి మనం కూడా దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామా.
చదరంగం లేదా చతురంగ ఆట అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.పైపెచ్చు ఇది మేధో మథనానికి సంబంధించినది. ఇందులో పావులు కదపడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం లాంటి ఎన్నో వ్యూహాలు వుంటాయి.
మరి ఈ ఆటకు సంబంధించిన వివరాలు, నియమాలు క్లుప్తంగా తెలుసుకుందామా...
ఈ చదరంగం ఆటకు 1500 ఏళ్ళ చరిత్ర వుందని విశ్లేషకులు అంటున్నారు.అంటే ఎంత ప్రాచీనమైనదో దీనిని బట్టి మనకు తెలుస్తోంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆటలో విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి మొదలైన వారు చాలా పేరు ప్రఖ్యాతులు పొందడం మనందరికీ తెలిసిందే.
ఈ చదరంగం ఆట రాజులకేమో యుద్ధంలో ఎలాంటి వ్యూహాలను వేయాలో నేర్పుతుంది. సామాన్యులకేమో సంసారం ఒక చదరంగంలా కనిపిస్తూ ఎలా తెలివిగా బయటపడాలో అర్థం చేయిస్తుంది.ఇక రాజకీయ నాయకులకైతే ప్రతిపక్షాల కదలికలను బట్టి తామెలాంటి ఎత్తుగడలు వేయాలో తెలుపుతుంది.
ఇక ఈ ఆట ఆడే విషయానికి వస్తే ఇందులో 64 గళ్ళు వుంటాయి.వాటిలో నలుపు, తెలుపు గళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి.ఉపయోగించే పావులు కూడా ఇలా రెండు రంగుల్లో విభజింపబడి వుంటాయి.
ఇందులో ఆటాడే ఇద్దరు వ్యక్తులు చెరో పదహారు పావులతో ఆట మొదలు పెడతారు.
ఈ పదహారు పావులలో ఒక రాజు ఒక రాణి లేదా మంత్రి, రెండు ఏనుగులు, రెండు గుర్రాలు, రెండు శకటాలు, ఎనిమిది సిపాయి లేదా బంటు పావులు వుంటాయి. అయితే ఈ తెలుపు నలుపు పావులను తీసుకోవడానికి ఇష్టంగా లేదా రూపాయి బిళ్ళ పైకి ఎగరేసి బొమ్మ బొరుసుతో ఎంపిక చేసుకుంటారు.
ఇలా ఎంపిక చేసుకున్న తర్వాత వాటిని ఎవరికి వారు గళ్ళవారీగా వరుస వారీగా అమర్చుకోవాల్సి వుంటుంది.అయితే మొదటి ఎత్తు తెల్ల పావులు తీసుకున్న వారు వేయాల్సి ఉంటుంది.
ఇందులో ఇక రాజుకు, మంత్రికి,ఏనుగుకు, గుర్రాలు ,శకటాలకు, బంట్లకు, కొన్ని నియమాలు ఉంటాయి.మరి ఈ" పదాతి న్యాయము" ప్రకారం బంటు కదలికకు సంబంధించిన నియమాలను మాత్రం చూద్దాం.
బంటు పావు ఎప్పుడైనా ఒక గడి ఖాళీగా వుంటే ముందుకు వెళ్ళగలదు.బంటు పావు వెనక్కు కదలలేదు.అయితే ఈ బంటు కదలిక, మరియు శత్రువు పావును చంపే విధానం వేరుగా ఉంటుంది.వెనక్కి వెళ్ళలేదు కానీ మూలగా ఉన్న పావులను చంపగలదు.మామూలుగా అయితే ముందుకు పోవడమే వుంటుంది కాని శత్రువును చంపేటప్పుడు మాత్రం వక్ర మార్గంలో అనగా వైమూలల వైపు కూడా వెళ్తుంది.
చదరంగం గురించి క్లుప్తంగా కొన్ని పూర్వాపరాలు తెలుసుకున్నాం కదా ! అయితే ఈ ఆటలోని బంటును మన పెద్దవాళ్ళు మానవ మనస్తత్వంలోని దుష్టత్వానికి ముడిపెట్టి చెప్పడం విశేషం.
బంటు లేదా సిపాయి పావు ఏ విధంగా అయితే ఏమీ తెలియనట్టు మంచిదిగా ముందుకు సాగిపోయినట్లు కనిపిస్తూనే హఠాత్తుగా వైమూలగా ఉన్న శత్రువును సంహరించినట్లుగానే కొందరు వ్యక్తులు ఏమీ తెలియని అమాయకుల్లా కనిపిస్తారు.ఏ మాత్రం అవకాశం వచ్చినా రెప్పపాటులో ఊహించని విధంగా దాడి చేసి దుర్మార్గంగా గాయపరుస్తారు.
ఫలానా వ్యక్తి ఇలాంటి వాడు అని తెలిస్తే అప్రమత్తంగా ఉండగలం కానీ ఇదిగో ఇలాంటి బంటు లాంటి వాళ్ళతోనే మహా ప్రమాదం.వారి గురించి చెడుగా ఊహించలేం.కానీ వారి లోపలి కౄరత్వం, క్రౌర్యం హఠాత్తుగా బయట పడుతుంటాయని చెప్పడమే ఈ న్యాయము యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం.
అలాంటప్పుడే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మవద్దో తెలియదు. పత్రికలు,ప్రసార మాధ్యమాల్లో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ చూస్తూ నిలువెల్లా వణికి పోతుంటాం.
అయితే ఇందులో రెండు కోణాలు ఉన్నాయి.ఒకటి ఇలా చేసే వాళ్ళ వెనుక ఒక పెద్ద ముఠా వుంటుంది.చదరరంగంలో శత్రువర్గం ఉన్నట్లుగా.అసలు ముఠా అధినేత ఏమీ తెలియనట్లు ఉంటూనే తన రక్షణ, శత్రు సంహారం కోసం బంటును ఉసిగొల్పి చేయిస్తుంటాడు.అంటే చదరంగంలో బంటు పావు లాంటి వాడన్న మాట.తర్వాత శిక్ష పడితే ప్రత్యక్షంగా చేసిన నిందిత బంటు పావుకే పడుతుంది.
ఇక వ్యక్తిగత కక్షలు లోలోపల పెట్టుకుని సమయం కోసం ఎదురు చూసి దారుణంగా ప్రవర్తించే వారు కొందరు. ఇలా రెండు రకాల వాళ్ళు మన మధ్యలో మనకు ఏ మాత్రం అనుమానం లేకుండా, రాకుండా తిరుగుతూ వుంటారు.
దీనినే ఆధ్యాత్మిక వాదులు తమ దృష్టితో ఏమంటారంటే " జీవితమే ఒక చదరంగం". అందులో రాజువు నీవే,బంటువు నీవే. లోలోపల అరిషడ్వర్గాలనే శత్రువర్గం ఎప్పుడూ నిన్ను కబళించేందుకు కాచుకుని ఉంటుంది. దాని నుంచి తెలివిగా తప్పించుకోక పోతే వాటి బారిన పడి జీవితాన్నే కోల్పోయే పరిస్థితి వస్తుంది.కాబట్టి నీకు నీవే రాజువై ఇంద్రియ నిగ్రహమనే సైనిక దళాలతో వాటితో జీవితాంతం పోరాడుతూనే వుండాలి అంటారు.
ఈ విధంగా ఒక ఆటలోని పావును ఉదాహరణగా తీసుకుని దాన్ని నిశితంగా పరిశీలించి మానవ స్వభావానికి అన్వయించి చెబుతూ హెచ్చరించడం చాలా గొప్ప విషయం కదా!
మరి ఈ "పదాతి న్యాయము "ద్వారా మన పెద్దలు చెప్పిన నిజాలు,ఇజాలు, జాగ్రత్తలు, హెచ్చరికలు సదా గమనంలో పెట్టుకొందాం. అమాయకపు పావుల్లా అలాంటి వారి బారిన, మనలోని అంతః శత్రువుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి