అజ ఏకాదశి విశిష్టత;-సి.హెచ్.ప్రతాప్
 మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో ఏకాదశి ఒకటి. మొత్తం 24 ఏకాదశి తిథుల్లో తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి వంటి వాటికి చాలా ప్రాముఖ్యత  వుంది.  ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి. శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి అజ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. ఏకాదశి వ్రతం వలన అన్ని రకాల శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.ఈ రోజున విష్ణువును పూజిస్తే అతని కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలో వచ్చిన అన్ని సమస్యలు తొలగిపోతాయి.  అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్‌ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించినవారు సమస్త వ్యథల నుంచి విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణం చెబుతోంది.
శ్రావణ బహుళ ఏకాదశికి అజ ఏకాదశి అని పేరు.దీనిని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు.ఈ రోజు ఉపవాసం ఉంది, మహావిష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి, మరునాడు ద్వాదశి రోజున పారణ చేయాలి. ఈ రోజు నూనె గింజలు దానం చేయడం ఎంతో మంచిది. పూర్వం రాజ్యాన్ని పోగొట్టుకొని, భార్యాబిడ్డలకు దూరమైనా హారిశ్చంద్ర చక్రవర్తి, గౌతముని సూచన మేరకు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, రాజ్యాన్ని భార్యాబిడ్డలను తిరిగి పొందాడు అని పద్మ పురాణం చేబుతోంది.
 పురాణాల్లో ఏకాదశి వ్రతం, ఉపవాసం గొప్పదని పరిగణిస్తారు.అజ ఏకాదశిని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు.అజ ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండేవారు ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.పసుపు రంగు విష్ణువుకు చాలా ప్రీతికరమైనదని నమ్మకం. కనుక ఈ రోజున పసుపు బట్టలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.అజ ఏకాదశి పూజలో ఏకాదశి వ్రత కథను పఠించి విష్ణువు మంత్రాన్ని జపించాలి. దీని తరువాత ఆరాధన ముగింపులో.. శ్రీ హరికి ఆరతిని ఇచ్చి పూజా కార్యక్రమం పూర్తి చేయాలి. విష్ణువు సుఖం, శ్రేయస్సు, సంతానం కలగాలని భక్తితో కోరుకోవాలి.ఏకాదశి రోజున మద్యం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. చెడు చూడరాదు. చెడు మాట్లాడరాదు. చెడు వినరాదు.  

కామెంట్‌లు